
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్‌ను నెలకొల్పుతున్నట్టు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టంచేసింది. లక్నోలో దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర ప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సంజీవ్ షరన్ తెలిపారు. ఫిబ్రవరి 21–22 తేదీల్లో లక్నోలో జరిగే ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఆహ్వానించేందుకు మంగళవారమిక్కడ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘యూపీలో ఇప్పటికే 2,000కుపైగా స్టార్టప్‌లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. హైదరాబాద్ మాదిరి అతిపెద్ద ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసి ఈ స్టార్టప్స్‌కు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. యూపీ కేంద్రంగా ఉన్న స్టార్టప్‌లకు తోడ్పాటు అందించేందుకు రూ.1,000 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం’ అని వివరించారు.
ఆవిష్కరణలకు దన్ను..
వివిధ రంగాల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి ఇండస్ట్రియల్ పాలసీకి రూపకల్పన చేశామని ఉత్తర ప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి సతీష్ మహానా తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంపెనీలు యూపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. కాగా యూపీలో పెట్టుబడులకు జీవీకే పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆసక్తి కనబరిచింది. ఎయిర్‌పోర్టులు, విద్యుత్ రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చింది. జేవర్ విమానాశ్రయం అభివృద్ధికి సుముఖంగా ఉన్నట్టు జీవీకే డైరెక్టర్ పి.వి.ప్రసన్న రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment