పీహెచ్‌డీకి హెచ్1బీ ఆంక్షలుండవు
ప్రతినిధుల సభలో కొత్త బిల్లు
వాషింగ్టన్: సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో అమెరికాలో పీహెచ్‌డీ చేసిన విదేశీయుల్ని గ్రీన్‌కార్డు, హెచ్–1బీ వీసాల ఆంక్షల పరిధిని తప్పించాలని ప్రతిపాదిస్తూ అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ‘స్టాపింగ్ ట్రైన్డ్ ఇన్ అమెరికా పీహెచ్‌డీ ఫ్రం లీవింగ్ ద కంట్రీ’(స్టాపల్) బిల్లును కాంగ్రెస్ సభ్యులు ఎరిక్ పాల్సెన్, మైక్ క్విగ్లేలు ప్రవేశపెడుతూ.. దీని వల్ల అమెరికాకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొ న్నారు. హెచ్–1బీ వీసా నిబంధనల్ని కఠినతరం చేస్తూ గత నెల్లో కార్యనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన నేపథ్యంలో తాజా బిల్లు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో పీహెచ్‌డీ చేస్తున్న, చేసిన భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలివైన విద్యార్థులు పీహెచ్‌డీ డిగ్రీల కోసం అమెరికా వస్తున్నారని, వారి పరిజ్ఞానం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సాయపడేలా ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. అమెరికాలో అంత్యంత నైపుణ్యం అవసరమైన వేలాది ఉద్యోగాలు భర్తీకావడం లేదని, ప్రస్తుతం ప్రవేశపెట్టిన స్టాపల్ యాక్ట్‌తో ఆ కొరత తీరుతుందని అభిప్రాయపడ్డారు.
కొత్త బడ్జెట్‌తో లక్షలాది ఉద్యోగాలు: ట్రంప్
అధికారంలోకి వచ్చాక రూపొందించిన తొలి బడ్జెట్ నూతన అమెరికాకు బాటలు వేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. లక్షలాది మందికి ఉద్యోగాల కల్పనతో ఆర్థిక మందగమనం తగ్గుముఖం పడుతుందన్నారు. బడ్జెట్‌లో సాంఘిక భద్రత, వైద్యసాయానికి నిధుల కోత ఉండదని, బడ్జెట్ కేటాయింపుల్లో సమతూకం పాటిస్తామని చెప్పారు. గత కొన్ని దశాబ్దాల్లో జరిగిన అభివృద్ధి కంటే ఇప్పుడు ఎంతో వేగవంతమైన వృద్ధిని అమెరికా ప్రజలు చూస్తారన్నారు.