అల్ట్రాటెక్ చేతికి జేపీ సిమెంట్ ప్లాంట్లు | Birla's UltraTech buys JP's cement plants for Rs 16500 cr | Sakshi
Sakshi News home page

అల్ట్రాటెక్ చేతికి జేపీ సిమెంట్ ప్లాంట్లు

Published Mon, Feb 29 2016 1:34 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

అల్ట్రాటెక్ చేతికి జేపీ సిమెంట్ ప్లాంట్లు

* డీల్ విలువ దాదాపు రూ. 17,000 కోట్లు..
* సిమెంట్ రంగంలో అతిపెద్ద ఒప్పందంగా రికార్డు

న్యూఢిల్లీ: దేశీ సిమెంట్ పరిశ్రమలో అతిపెద్ద డీల్ సాకారమైంది. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్.. జైప్రకాశ్(జేపీ) గ్రూపునకు చెందిన సిమెంట్ ప్లాంట్లను చేజిక్కించుకుంది. ఇందుకోసం దాదాపు రూ.17,000 కోట్లు చెల్లించనున్నామని.. ఈ మేరకు జేపీ అసోసియేట్స్‌తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ)  కుదుర్చుకున్నట్లు అల్ట్రాటెక్ సిమెంట్ ఆదివారం ప్రకటించింది. తాము కొనుగోలు చేస్తున్న సిమెంట్ ప్లాంట్లు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ఉన్నాయని పేర్కొంది. వీటి వార్షిక ఉత్పాదక సామర్థ్యం 22.4 మిలియన్ టన్నులు(ఎంటీపీఏ).
 
ఒప్పందం ఇలా...

డీల్‌లో భాగంగా ఈ ప్లాంట్ల విలువను రూ.16,500 కోట్లుగా లెక్కించామని అల్ట్రాటెక్ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.470 కోట్ల పెట్టుబడితో మరో 4 ఎంటీపీఏ సామర్థ్యంగల ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించింది. వీటికోసం దేశీయంగా అదేవిధంగా విదేశీ సంస్థలు కూడా రేసులో ఉన్నప్పటికీ.. చివరికి తాము దక్కించుకున్నట్లు పేర్కొంది. సాత్నా, తూర్పు యూపీ, హిమాచల్‌ప్రదేశ్, కోస్తాంధ్రల్లో ఈ డీల్ వల్ల అల్ట్రాటెక్‌కు కొత్త మార్కెట్లు అందుబాటులోకి రానున్నాయి.

ఇక ప్రతిపాదిత లావాదేవీ పూర్తయితే తమ మొత్తం వార్షిక సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 90.7 ఎంటీపీఏలకు(ప్రస్తుతం 68.3 ఎంటీపీఏ) పెరగనుందని అల్ట్రాటెక్ పేర్కొంది. నియంత్రణపరమైన అనుమతులకు లోబడి డీల్ పూర్తవుతుందని వెల్లడించింది. కాగా, గతంలో మధ్య ప్రదేశ్‌లోని రెండు సిమెంట్ ప్లాంట్‌లను కొనుగోలు చేసేందుకు జేపీ అసోసియేట్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం.. ఈ తాజా ఎంఓయూతో రద్దవుతుందని పేర్కొంది.
 
రుణ భారం తగ్గించుకోవడానికే...
భారీగా ఉన్న రుణ భారాన్ని తగ్గించుకొని, బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరుచుకోవడం కోసమే తాము ఈ అమ్మకాలను చేపడుతున్నట్లు జేపీ అసోసియేట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. సిమెంట్, విద్యుత్ వంటి సాంప్రదాయ రంగాల్లో పెట్టుబడులకు రుణాలు తీసుకున్న అన్ని కంపెనీలపై ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి కారణంగా తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడిందని తెలిపింది.

టారిఫ్‌లు ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోవడం, సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోవడం కారణంగా విద్యుత్ రంగం పెను సవాళ్లను ఎదుర్కొంటోందని వెల్లడించింది. ఇకపై తాము ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్, రియల్టీ ప్రాజెక్టులపై మరిం త దృష్టిసారించున్నట్లు జేపీ అసోసియేట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మనోజ్ గౌర్ వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement