కంపెనీల నిధుల్ని మింగితే ఇక పదేళ్ల జైలు!
షెల్ కంపెనీల డైరెక్టర్లకు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: రిజిస్ట్రేషన్లు రద్దయిన కంపెనీల డైరెక్టర్లకు కేంద్ర ప్రభుత్వం బుధవారం కఠిన హెచ్చరికలు చేసింది. కంపెనీల తాలూకు బ్యాంకు ఖాతాల నుంచి నిధులను సొంత ఖాతాలకు మళ్లించాలని ప్రయత్నించే వారు పదేళ్ల వరకు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సోమవారం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, షెల్ కంపెనీల డైరెక్టర్లు మూడు ఆర్థిక సంవత్సరాల పాటు రిటర్నులు ఫైల్ చేయకపోతే ఆ పదవిని కోల్పోతారని, ఇతర ఏ కంపెనీలో పదవులున్నా అనర్హతకు గురవుతారని సమావేశం అనంతరం ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రకటనలో పేర్కొన్నారు.
ఏ విధమైన కార్యకలాపాలు లేకుండా రికార్డులపైనే కొనసాగుతున్న 2.09 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లను కార్పొరేట్ వ్యవహారాల శాఖ తాజాగా రద్దు చేసిన విషయం తెలిసిందే. కొన్ని కేసుల్లో షెల్ కంపెనీలకు సహకారం అందించిన చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీల సెక్రటరీలు, కాస్ట్ అకౌంటెంట్లను సైతం కేంద్ర ప్రభుత్వం తాజాగా గుర్తించింది. ఇక నల్లధనం నియంత్రణ చర్యల్లో భాగంగా మరిన్ని షెల్ కంపెనీలను గుర్తించే పని కొనసాగుతోందని, ఈ సంస్థల వెనుక అసలు లబ్ధిదారులు, వ్యక్తులు ఎవరన్నది తెలుసుకునే చర్యలు కూడా కొనసాగుతున్నాయని కేంద్రం ప్రకటించింది.
రిజిస్ట్రేషన్ రద్దయిన కంపెనీల డైరెక్టర్లు సంస్థ నిథులను కాజేస్తే, ఆరు నెలల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని, ఇందులో ప్రజాధనం ఉంటే మూడేళ్లు తక్కువ కాకుండా శిక్ష ఉంటుందని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్లు రద్దు కావటానికి ముందు నిధులు కాజేసినట్టు తేలినా చర్యలు తప్పవని హెచ్చరించింది.