Minister PP Choudhury
-
‘న్యాయ గడియారాలు’...!
న్యాయపరమైన వ్యవహారాలు, ప్రక్రియల్లో మరింత సమర్థతను పెంచడంలో భాగంగా దేశంలోని మొత్తం 24 హైకోర్టులలో ‘న్యాయ గడియారాలు’ ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్య ద్వారా ప్రజల్లో చైతన్యం పెరిగి న్యాయవ్యవస్థలో సమర్థత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మనదేశంలో కేసుల పరిష్కారానికి సంబంధించిన న్యాయప్రక్రియ సుదీర్ఘకాలం కొనసాగుతూ కక్షిదారులకు విసుగు చెందేంత స్థాయి వరకు వెళ్లడం మనకు తెలిసిందే. న్యాయ విభాగం జవాబుదారీతనం, సమర్థతపై దేశవ్యాప్త చర్చ సాగుతున్న నేపథ్యంలో... ఈ విషయంలో కోర్టుల మధ్య పరస్పరం కేసుల పరిష్కారంలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొనడంతో పాటు పౌరుల పట్ల న్యాయస్థానాలు మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించేలా చేయొచ్చునని ప్రభుత్వం అంచనావేస్తోంది. గతేడాది నవంబర్ 26న ‘నేషనల్ లా డే’ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ వివిధ న్యాయస్థానాల ఆవరణలో న్యాయ గడియారాలుంచాలని చేసిన సూచనకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ గడియారాల్లో (ఎల్ఈడీ మెసేజ్ డిస్ప్లే బోర్డుల్లో) పెండింగ్ కేసుల సంఖ్య ప్రదర్శిస్తారు. ప్రతీరోజు కోర్టులు పరిష్కరించిన కేసులు, ఇలాంటి కేసుల సంఖ్య ఆధారంగా ఒక్కో న్యాయస్థానం సాధించిన ర్యాంక్ ఎంతో అందులో చూపుతారు. కొత్తఢిల్లీలోని న్యాయశాఖ కార్యాలయంలో ఇప్పటికే ఇలాంటి గడియారాన్ని ఏర్పాటుచేశారు. దేశంలోని న్యాయస్థానాల్లో అధికసంఖ్యలో కేసులు పరిష్కరించిన వాటిని గురించి ఇందుల్లో ప్రదర్శిస్తారు. దీనికి కొనసాగింపుగా దేశంలోని అన్ని హైకోర్టుల్లో వీటిని అమర్చుతారు. ఆ తర్వాత కింది కోర్టుల్లోనూ వీటిని నెలకొల్పనున్నారు. పరిష్కరించే కేసుల విషయంలో న్యాయస్థానాల మధ్య పోటీ తత్వాన్ని పెంచేందుకు, పనితీరు ఆధారంగా హైకోర్టులకు ర్యాంక్లిచ్చేందుకు ఈ గడియారాలు ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి చెబుతున్నారు. భవిష్యత్లో అన్ని సబార్డినేట్ కోర్టులలో సైతం వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కంపెనీల నిధుల్ని మింగితే ఇక పదేళ్ల జైలు!
షెల్ కంపెనీల డైరెక్టర్లకు కేంద్రం హెచ్చరిక న్యూఢిల్లీ: రిజిస్ట్రేషన్లు రద్దయిన కంపెనీల డైరెక్టర్లకు కేంద్ర ప్రభుత్వం బుధవారం కఠిన హెచ్చరికలు చేసింది. కంపెనీల తాలూకు బ్యాంకు ఖాతాల నుంచి నిధులను సొంత ఖాతాలకు మళ్లించాలని ప్రయత్నించే వారు పదేళ్ల వరకు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సోమవారం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, షెల్ కంపెనీల డైరెక్టర్లు మూడు ఆర్థిక సంవత్సరాల పాటు రిటర్నులు ఫైల్ చేయకపోతే ఆ పదవిని కోల్పోతారని, ఇతర ఏ కంపెనీలో పదవులున్నా అనర్హతకు గురవుతారని సమావేశం అనంతరం ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రకటనలో పేర్కొన్నారు. ఏ విధమైన కార్యకలాపాలు లేకుండా రికార్డులపైనే కొనసాగుతున్న 2.09 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లను కార్పొరేట్ వ్యవహారాల శాఖ తాజాగా రద్దు చేసిన విషయం తెలిసిందే. కొన్ని కేసుల్లో షెల్ కంపెనీలకు సహకారం అందించిన చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీల సెక్రటరీలు, కాస్ట్ అకౌంటెంట్లను సైతం కేంద్ర ప్రభుత్వం తాజాగా గుర్తించింది. ఇక నల్లధనం నియంత్రణ చర్యల్లో భాగంగా మరిన్ని షెల్ కంపెనీలను గుర్తించే పని కొనసాగుతోందని, ఈ సంస్థల వెనుక అసలు లబ్ధిదారులు, వ్యక్తులు ఎవరన్నది తెలుసుకునే చర్యలు కూడా కొనసాగుతున్నాయని కేంద్రం ప్రకటించింది. రిజిస్ట్రేషన్ రద్దయిన కంపెనీల డైరెక్టర్లు సంస్థ నిథులను కాజేస్తే, ఆరు నెలల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని, ఇందులో ప్రజాధనం ఉంటే మూడేళ్లు తక్కువ కాకుండా శిక్ష ఉంటుందని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్లు రద్దు కావటానికి ముందు నిధులు కాజేసినట్టు తేలినా చర్యలు తప్పవని హెచ్చరించింది.