నిఫ్టీ 8000 దాటేసింది
దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్
- ఇంట్రాడేలో 26,900కు సెన్సెక్స్
- సెన్సెక్స్ 229, నిఫ్టీ 73 పాయింట్లు అప్
- మళ్లీ సరికొత్త రికార్డుల మోత
- మెటల్, పవర్, రియల్టీ జోరు
మార్కెట్ అప్‌డేట్
రెండున్నరేళ్ల తరువాత దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ఇన్వెస్టర్లకు హుషారునిచ్చింది. ఈ ఏడాది(2014-15) తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో జీడీపీ 5.7% వృద్ధి చూపడంతో మెరుగుపడ్డ సెంటిమెంట్ అన్ని రంగాలకూ బలాన్నిచ్చింది. మరోవైపు గత రెండు దశాబ్దాలలో వివిధ ప్రభుత్వాలు చేపట్టిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీం కోర్టు మూకుమ్మడిగా రద్దు చేయబోదన్న అంచనాలు దీనికి జత కలిశాయి. సుప్రీం పేర్కొన్న మొత్తం 218 క్షేత్రాలకు సంబంధించి 48 బ్లాకుల్లో ఇప్పటికే అభివృద్ధి పనులు మొదలుకావడంతో వీటిని వెనక్కి తిరిగి తీసుకోలేమని అటార్నీ జనరల్ సుప్రీంకు నివేదించడంతో చివర్లో మార్కెట్లు మరింత జోరందుకున్నాయి. వెరసి సెన్సెక్స్, నిఫ్టీ మరోసారి సరికొత్త రికార్డులను లిఖించాయి.
మార్కెట్ చరిత్రలో తొలిసారి 8,000 పాయింట్లను అధిగమించిన నిఫ్టీ 73 పాయింట్లు ఎగసి 8,028 వద్ద ముగిసింది. ఇక 229 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్ 26,867 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో నిఫ్టీ గరిష్టంగా 8,035కు చేరగా, సెన్సెక్స్ 26,900ను తాకడం విశేషం! కాగా, మే 12న నిఫ్టీ తొలిసారి 7,000 పాయింట్లను తాకింది.బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాలూ లాభాలతో పుంజుకోగా, మెటల్, పవర్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ 2.5% చొప్పున ఎగశాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో సన్ ఫార్మా, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ మాత్రమే 1%పైగా నష్టపోయాయి.
ఎన్‌సీసీ రూ. 599 కోట్ల రైట్స్ ఇష్యూ
రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 598.7 కోట్లు సమీకరిస్తున్నట్లు నాగార్జునా కనస్ట్రక్షన్స్ (ఎన్‌సీసీ) స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. రూ.2 ముఖ విలువ కలిగిన 29.9 కోట్ల షేర్లను జారీ చేయడం ద్వారా ఈ మూలధనాన్ని సేకరించనుంది. ప్రతీ ఆరు షేర్లకు ఏడు షేర్లు ఇచ్చే విధంగా 7:6 నిష్పత్తిలో షేర్లను కేటాయిస్తారు. షేరు ధరను రూ. 20గా నిర్ణయించారు. కానీ ఈ రైట్స్ ఇష్యూకి రికార్డు తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం బీఎస్‌ఈలో ఎన్‌సీసీ షేరు 1.31 శాతం నష్టపోయి రూ. 67.80 వద్ద ముగిసింది.