సెన్సెక్స్ @ 24,000
వరుసగా మూడు రోజుల్లో మూడు భారీ ర్యాలీలు. వెరసి స్టాక్ మార్కెట్లో మూడు రోజులూ సరికొత్త రికార్డులు వెల్లువెత్తాయి. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 24,000 పాయింట్లను అధిగమించగా, ఇప్పటికే 7,000 పాయింట్లను దాటిన నిఫ్టీ 7,100ను సైతం చేరుకోవడం విశేషం!
కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు బలపడుతుండటంతో మార్కెట్లు దూసుకెళుతున్నాయి. బ్రోకర్లు, ట్రేడర్లు రెట్టించిన ఉత్సాహంతో పొజిషన్లు తీసుకుంటుండటంతో ఇండెక్స్‌లు రోజుకో రికార్డును సృష్టిస్తున్నాయి. గత రెండు రోజుల్లో 1,200 పాయింట్లకుపైగా లాభపడ్డ సెన్సెక్స్ తాజాగా మరో 320 పాయింట్లు పుంజుకోవడంతో 23,871 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 94 పాయింట్లు ఎగసి 7,109 వద్ద ముగిసింది. కాగా, ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్టంగా 24,069కు చేరగా, నిఫ్టీ 7,172ను తాకడం చెప్పుకోదగ్గ విశేషం! ఇవి కూడా సరికొత్త రికార్డులే!!
హెల్త్‌కేర్ మినహా....
బీఎస్‌ఈలో హెల్త్‌కేర్ మినహా అన్ని రంగాలూ లాభపడగా, పవర్, ఆయిల్, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ 3% స్థాయిలో పురోగమించాయి. ఎఫ్‌ఐఐల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో దాదాపు రూ. 2,500 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 2,026 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీ ఫండ్స్ రూ. 649 కోట్ల అమ్మకాలు నిర్వహించాయి. మోడీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏకు మెజారిటీ లభిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభిస్తున్నదని నిపుణులు పేర్కొన్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైతే సంస్కరణల అమలు వేగమందుకుంటుందని, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఎఫ్‌ఐఐల పెట్టుబడుల జోరు పెరగడం, రూపాయి బలపడటం వంటి అంశాలు సెంటిమెంట్‌కు జోష్‌నిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఇతర విశేషాలివీ...
బ్లూచిప్స్‌లో భెల్ 10% జంప్‌చేయగా, హీరో మోటో, ఓఎన్‌జీసీ, టాటా పవర్, విప్రో, ఆర్‌ఐఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, మారుతీ 5-2% మధ్య లాభపడ్డాయి.
క్యూ4 ఫలితాల నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ 4% పతనమైంది. సెన్సెక్స్‌లో మరో ఐదు షేర్లు మాత్రమే అదికూడా నామమాత్రంగా నష్టపోయాయి.
మంగళవారం ర్యాలీలో మధ్య, చిన్న తర హా షేర్లకు డిమాండ్ కనిపించింది. దీంతో ట్రేడైన షేర్లలో 1,623 లాభపడగా, 1,268 నష్టపోయాయి.
మిడ్ క్యాప్స్‌లో ఎన్‌సీసీ, హెచ్‌సీసీ, ఐవీఆర్‌సీఎల్, దివాన్ హౌసింగ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, డెల్టాకార్ప్, మణప్పురం ఫైనాన్స్, బీఎఫ్ యుటిలిటీస్, జీఎంఆర్ ఇన్‌ఫ్రా, అదానీ పోర్ట్స్, సింటెక్స్, జీఎస్‌ఎఫ్‌ఎల్, బీఈఎంఎల్, జూబిలెంట్ ఫుడ్, బీఈఎల్, జీవీకే పవర్, అదానీ పవర్ తదితరాలు 17-8% మధ్య దూసుకెళ్లాయి.