బీఎస్‌ఈ.. బంపర్ లిస్టింగ్
• 35 శాతం ప్రీమియమ్‌తో రూ.1,085 వద్ద ఓపెన్
• ఇంట్రాడేలో 49 శాతం లాభంతో రూ.1,200 గరిష్ట స్థాయికి
• రూ.1,069 వద్ద క్లోజ్
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్(ఎన్‌ఎస్‌ఈ)లో బీఎస్‌ఈ షేర్లు శుక్రవారం లిస్టయ్యాయి. లిస్టింగ్‌లోనూ, ట్రేడింగ్‌లోనూ బీఎస్‌ఈ షేర్లు మెరుపులు మెరిపించాయి. ఆసియాలో అతి పురాతనమైన, 140 ఏళ్ల చరిత్ర గల బీఎస్‌ఈ షేర్లు ఇష్యూ ధర(రూ.806) తో పోల్చితే 35 శాతం ప్రీమియమ్‌తో రూ. 1,085 వద్ద ఎన్‌ఎస్‌ఈలో లిస్టయ్యాయి. ఇంట్రాడేలో 49 శాతం లాభంతో రూ.1,200 గరిష్ట స్థాయికి చేరిన బీఎస్‌ఈ షేర్ చివరకు 33 శాతం లాభంతో రూ.1,069 వద్ద ముగిసింది. కోటిన్నర షేర్లు ట్రేడయ్యాయి. సొంత ఎక్సే్చంజ్‌లో లిస్ట్ కావడానికి సెబీ నియమనిబంధనలు ఒప్పుకోనందున బీఎస్‌ఈ షేర్లు ఎన్‌ఎస్‌ఈలోనే లిస్టయ్యాయి.
మార్కెట్ క్యాప్ ఎట్ రూ.5,750 కోట్లు
ట్రేడింగ్ ముగిసేనాటికి బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,750 కోట్లుగా ఉంది. ఇక బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయి, రూ.115 లక్షల కోట్లకు చేరింది. రూ.805–806 ధరల శ్రేణితో వచ్చిన బీఎస్‌ఈ ఐపీఓ 51 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబయ్యాయి. ఈ ఏడాది వచ్చిన తొలి ఐపీఓ ఇదే, అంతేకాకుండా దేశంలోని తొలి స్టాక్ ఎక్సే్చంజ్ ఐపీఓ కూడా ఇదే.
అతి పెద్ద స్టాక్ ఎక్సే్చంజ్..
బీఎస్‌ఈ షేర్లు భారీ లాభాలతో ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ కావడం.. మార్కెట్ సెంటిమెంట్ జోరును సూచిస్తోందని శామ్‌కో సె క్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ చెప్పారు. బీఎస్‌ఈలో దాదా పు 3,000 కంపెనీలు లిస్టయ్యాయి. లిస్టైన కంపెనీల పరంగా చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద స్టాక్ ఎక్సే్చంజ్ ఇదే. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే పదో స్థానం. ఎన్‌ఎస్‌ఈ షేర్లు తమ స్టాక్ ఎక్సే్చంజ్‌లో లిస్ట్ కావడం కోసం చూస్తున్నామని బీఎస్‌ఈ చైర్మన్ సుధాకర్ రావు ఈ సందర్భంగా చెప్పారు. త్వరలో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ కూడా రానున్నది. ఈ ఐపీఓ ద్వారా ఎన్‌ఎస్‌ఈ రూ10,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా.