పబ్లిక్‌ ఆఫర్ల పండగొచ్చింది..! | BSE shares list on rival NSE, rise 33% | Sakshi
Sakshi News home page

పబ్లిక్‌ ఆఫర్ల పండగొచ్చింది..!

Published Fri, Mar 3 2017 12:48 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

పబ్లిక్‌ ఆఫర్ల పండగొచ్చింది..! - Sakshi

పబ్లిక్‌ ఆఫర్ల పండగొచ్చింది..!

మార్చిలో ఇన్వెస్టర్ల చెంతకు ఆరు ఐపీఓలు...
దాదాపు రూ.5,000 కోట్ల సమీకరణ
మార్కెట్ల జోరుతో బంపర్‌ లిస్టింగ్‌పై కన్ను


న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు జోరుగా ఉన్నాయి.  యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం,  అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్‌ ట్రంప్‌ గెలవడం, ఆయన రక్షణాత్మక విధానాలకు తెర తీయడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను పెంచనుండడం వంటి ప్రతికూలతలు ఉన్నా... స్టాక్‌ మార్కెట్లు మాత్రం పరుగులు తీస్తున్నాయి.   మన మార్కెట్‌ కూడా ఇదే బాటలో పయనిస్తోంది.

కొత్త ఏడాది ప్రారంభమైన మూడో నెలలోనే సూచీలు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి.  ఇదే అదునుగా పలు కంపెనీలు ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు వస్తున్నాయి. ప్రస్తుత మార్చి  నెలలో ఏకంగా ఆరు కంపెనీలు సుమారు రూ.5,000 కోట్ల నిధులను సమీకరించనున్నాయి.. వీటిల్లో పెద్దదైన డీ–మార్ట్‌ రిటైల్‌ స్టోర్స్‌కు మంచి ఆదరణ ఉండటంతో ఈ స్టోర్స్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్‌ ఐపీఓకు మంచి స్పందన ఉంటుందనేది విశ్లేషకుల అంచనా.. మిగిలిన ఇష్యూల రేంజ్‌ రూ.400–600 కోట్లు. దీంతో వీటికీ మంచి డిమాండ్‌ ఉండగలదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఐపీఓల  ద్వారా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణ, రుణాల చెల్లింపునకు, సాధారణ వ్యాపార కార్యకలాపాల కోసం ఆయా కంపెనీలు వినియోగించుకోనున్నాయి. గత ఏడాది 26 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.26,000 కోట్లు సమీకరించాయి. 2010 తర్వాత ఇదే అధిక మొత్తం కావడం గమనార్హం.

శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్‌
బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ తాజా షేర్ల జారీ ద్వారా రూ.500 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 66 లక్షల షేర్ల జారీ ద్వారా రూ.100 కోట్లు సమీకరించనున్నది.
 
సీడీఎస్‌ఎల్‌
ఈ ఐపీఓ ద్వారా ఈ సంస్థ రూ.500 కోట్లు సమీకరించనున్నది. ఈ నెల 15–17 మధ్య ఈ ఐపీఓ రావచ్చని, రూ.115–135 రేంజ్‌లో ధరల శ్రేణి ఉండొచ్చని, సమాచారం. ఈ నెల 27న  ఈ కంపెనీ స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో దాదాపు 3.5 కోట్ల షేర్లను జారీ చేయనున్నది. 7 లక్షల షేర్లను ఉద్యోగులకు రిజర్వ్‌ చేసింది.

సీఎల్‌ ఎడ్యుకేట్‌
ఐపీఓలో 20,60,652 తాజా షేర్లను, మరో 26,29,881 షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ లో జారీ చేయడం ద్వారా రూ.400 కోట్లు సమీకరించనున్నది.

కాంటినెంటల్‌ వేర్‌హౌసింగ్‌
మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ కంపెనీ. రూ.10 ముఖ విలువ గల రూ.418.8 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లతో పాటు ఆఫర్‌  ఫర్‌ సేల్‌ విధానంలో 7,98,608 షేర్లను జారీ చేయనున్నది. ఈ ఐపీఓ ఈ నెల 22న ప్రారంభమై, 24న ముగియనున్నదని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

డీ–మార్ట్‌
మార్చి 8 న ప్రారంభమై, 10న ముగిసే ఈ ఐపీఓ ద్వారా అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ రూ.1,870 కోట్లు సమీకరించనున్నది. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన రూ.3,000 కోట్ల పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఐపీఓ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ. ఈ ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ గల 6.23 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. ధరల శ్రేణి రూ.290–299గా కంపెనీ నిర్ణయించింది. కనీసం 50 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 21న స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌కావచ్చు. గ్రే మార్కెట్‌లో ఇష్యూ ధరకు రూ.175–180 ప్రీమియం ఉన్నట్లు సమాచారం.

మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌
రేడియో సిటీ ఎఫ్‌ఎం స్టేషన్లను నిర్వహిస్తున్న జాగరణ్‌ ప్రకాశన్‌ గ్రూప్‌కు చెందిన మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌ లిమిటెడ్‌ ఐపీఓ మార్చి 6 ప్రారంభమై, 8న ముగియనున్నది.  తాజా షేర్లతో పాటు  26.59 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో జారీ చేయడం ద్వారా కనీసం రూ.490 కోట్లు సమీకరించనున్నది.  ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.324–333 రేంజ్‌లో, మార్కెట్‌ లాట్‌ 45 షేర్లుగా  ఉండొచ్చని సమాచారం. మార్చి 17న స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ ఏడాది ఐపీఓకు రానున్న కొన్ని కంపెనీలు...
ఎన్‌ఎస్‌ఈ ∙ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ∙టాటా సన్స్‌
టాటా ఇన్ఫోటెక్‌ ∙యూటీఐ ఎంఎఫ్‌ ∙హడ్కో ∙సుల్తాన్‌ చాంద్‌  ∙లోధా గ్రూప్‌ డెవలపర్స్‌ ∙భారత్‌ మ్యాట్రిమోని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement