చిన్న షేర్లు ముద్దు
కొత్త ప్రభుత్వం ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపడుతుందన్న అంచనాలు మార్కెట్లలో ఊపందుకున్నాయి. సంస్కరణల జోరు పెరుగుతుందన్న ఆశలు ఇందుకు జత కలిశాయి. మౌలిక సదుపాయాలు, విద్యుత్, సిమెంట్, మైనింగ్, బ్యాంకింగ్ తదితర రంగాలకు జవసత్వాలు కల్పించే బాటలో పటిష్ట విధాన నిర్ణయాలుంటాయని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో సోమవారం ట్రేడింగ్‌లో ఇన్‌ఫ్రా, పవర్ రంగాల షేర్లు కొనుగోళ్ల వెల్లువతో రేసు గుర్రాల్లా దూసుకెళ్లాయి. బీఎస్‌ఈలో స్మాల్ క్యాప్ 6% జంప్‌చేయగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ సైతం 4% ఎగసింది. ట్రేడైన షేర్లలో 2,154 లాభపడితే, 698 నష్టపోయాయి.
రాష్ట్ర కంపెనీల హవా...
చిన్న షేర్లలో జేపీ పవర్ 30%పైగా దూసుకెళ్లగా, రాష్ర్ట కంపెనీల షేర్లు జీవీకే పవర్, కేఎస్‌కే ఎనర్జీ, ఐవీఆర్‌సీఎల్ ఇన్‌ఫ్రా, ల్యాంకో ఇన్‌ఫ్రా, జీఎంఆర్ ఇన్‌ఫ్రా 20% స్థాయిలో ఎగశాయి. ఈ బాటలో ఇతర మిడ్ క్యాప్స్ జేకే లక్ష్మీ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రా, ఇండియాబుల్స్ పవర్, సుజ్లాన్ ఎనర్జీ, జేకే సిమెంట్, హెచ్‌సీసీ, బీఈఎంఎల్, జేపీ ఇన్‌ఫ్రా, పుంజ్‌లాయిడ్, గేట్‌వే డిస్ట్రిపార్క్స్, సింటెక్స్, బీఎస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్, బీజీఆర్ ఎనర్జీ, ఓరియంట్ సిమెంట్, ఇండియా సిమెంట్, కల్పతరు పవర్, ఇండియన్ బ్యాంక్, వోల్టాస్, జేపీ అసోసియేట్స్, ఎన్‌సీసీ, శ్రేఈ ఇన్‌ఫ్రా, క్రాంప్టన్ గ్రీవ్స్, దేనా బ్యాంక్, స్టెరిలైట్ టెక్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, సద్భావ్ ఇంజినీరింగ్, జిందాల్ సా తదితరాలు 20-12% మధ్య పురోగమించాయంటే వీటికి ఏ స్థాయిలో డిమాండ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు! మార్కెట్ల దూకుడుకు అనుగుణంగా రిటైల్ ఇన్వెస్టర్లు సైతం పెట్టుబడులకు ఉపక్రమిస్తుండటంతో బ్రోకింగ్ షేర్లు మోతీలాల్ ఓస్వాల్, ఎడిల్‌వీజ్ ఫైనాన్షియల్ సైతం 20% జంప్ చేయడం విశేషం!