బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంటర్నెట్‌ టెలిఫోనీ | BSNL Internet Telephony | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంటర్నెట్‌ టెలిఫోనీ

Published Thu, Jul 12 2018 12:34 AM | Last Updated on Thu, Jul 12 2018 12:34 AM

BSNL Internet Telephony - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశీయంగా తొలి ఇంటర్నెట్‌ టెలిఫోనీ సర్వీసును ఆవిష్కరించింది. మొబైల్‌ యాప్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఏ టెలిఫోన్‌ నంబరుకైనా కాల్‌ చేసే సదుపాయం దీనితో అందుబాటులోకి రానుంది. జూలై 25 నుంచి ఈ సర్వీసులు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన మొబైల్‌ యాప్‌ ’వింగ్స్‌’ను కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా బుధవారం ఆవిష్కరించారు. ‘ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ మార్కెట్‌ వాటాను పెంచుకోగలగడం ప్రశంసనీయం. సిమ్‌ అవసరం లేకుండా ఫోన్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయం కల్పించే ఇంటర్నెట్‌ టెలిఫోనీని అందుబాటులోకి తెచ్చినందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ను అభినందిస్తున్నా‘ అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. దేశీ సేవల కోసం వార్షికంగా రూ. 1,099 ఫీజును చెల్లించి, వై–ఫై లేదా ఇతరత్రా ఏ టెలికం ఆపరేటరు ఇంటర్నెట్‌ సర్వీస్‌నైనా ఉపయోగించుకుని దేశవ్యాప్తంగా ఏ టెలిఫోన్‌ నంబరుకైనా ఈ యాప్‌ ద్వారా అపరిమితమైన కాల్స్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం కూడా మొబైల్‌ యాప్స్‌ ద్వారా వాయిస్‌ కాల్స్‌ చేసుకునే వీలున్నప్పటికీ, సదరు యాప్‌ను ఉపయోగిస్తున్న వారికి మాత్రమే చేసే అవకాశం ఉంది.  

త్వరలో రిజిస్ట్రేషన్స్‌ ప్రారంభం.. 
మరికొద్ది రోజుల్లో రిజిస్ట్రేషన్స్‌ ప్రారంభిస్తామని, జూలై 25 నుంచి అధికారికంగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ తెలిపారు. ‘వింగ్స్‌ యాప్‌ను ఉపయోగించి కస్టమర్లు.. భారత్‌లోని నంబర్లకు విదేశాల నుంచి కూడా కాల్‌ చేయొచ్చు. ఇంటర్నెట్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈ యాప్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. కాల్స్‌ చేసుకోవచ్చు. దేశీయంగా అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ కోసం వార్షికంగా రూ. 1,099 ఫీజు ఉంటుంది‘ అని ఆయన చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ జారీ చేసే మొబైల్‌ నంబరుకు ఈ యాప్‌ అనుసంధానమై ఉంటుందని తెలిపారు.  

ఐడియా–వొడాఫోన్‌ విలీనానికి ఆమోదం.. 
ప్రైవేట్‌ టెలికం దిగ్గజాలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్‌ ఇండియా విలీన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని మనోజ్‌ సిన్హా చెప్పారు. అయితే, రెండు కంపెనీలూ ఇంకా కొన్ని లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉందని, ఆ తర్వాత తుది ఆమోదముద్ర లభిస్తుందని వివరించారు. డీల్‌కు పూర్తి స్థాయిలో అనుమతులివ్వాలంటే వొడాఫోన్‌ ఇండియాకు చెందిన స్పెక్ట్రం కోసం ఐడియా రూ. 3,976 కోట్లు కట్టాలని, ఇరు సంస్థలు రూ. 3,342 కోట్ల మేర బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని టెలికం శాఖ షరతులు విధించిన సంగతి తెలిసిందే. కానీ ఐడియా, వొడాఫోన్‌ వీటిని కోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఐడియా, వొడాఫోన్‌లు విలీనమైతే దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల నికర విలువ, 35 శాతం మార్కెట్‌ వాటా, 43 కోట్ల యూజర్లతో దేశీయంగా అతి పెద్ద టెలికం సంస్థ ఆవిర్భవించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement