నాలుగేళ్ల నుంచి నిరాశే! | Budget 2015: Property prices to rise marginally on hike in service tax | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల నుంచి నిరాశే!

Published Sun, Mar 1 2015 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM

నాలుగేళ్ల నుంచి నిరాశే!

నాలుగేళ్ల నుంచి నిరాశే!

బడ్జెట్‌పై పెదవి విరిచిన నిర్మాణ రంగం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగేళ్ల నుంచి గృహ నిర్మాణ రంగానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోంది. స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ కీలక మంత్రుల్ని కలిసి తమ బాధల్ని నివేదించాం కూడా. గతంలో చిదంబర.. నేడు అరుణ్ జైటీ.. నిర్మాణ సంస్థల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఏదో తప్పదన్నట్టుగా అరకొర నిర్ణయాల్ని తీసుకున్నారే తప్ప..

నిజమైన అభివృద్ధికి ఊతమిచ్చే నిర్ణయాలు చేపట్టలేదు’’ అని పలువురు నిర్మాణ రంగం నిపుణులు చెప్పారు. తొలిసారిగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ నిర్మాణ రంగాన్ని నిరాశలోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై ఏవరేమన్నారంటే..
 
బంగారం అక్రమ రవాణాను విస్మరించారు

జెమ్ అండ్ జువెల్లరీ, లగ్జరీ అండ్ లైఫ్‌స్టైల్ ఫోరం ఆఫ్ ఫిక్కి మిహుల్ చోక్క్సీ

నగల తయారీ పరిశ్రమను ప్రోత్సహించేలా నిర్ణయాలను ఆశించాం. కానీ, ఈ బడ్జెట్‌లో దేశంలో నల్ల డబ్బును అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారే తప్ప దేశంలోకి వచ్చే బంగారు అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2013లో 180 టన్నుల మేర బంగారం అక్రమంగా దేశంలోకి వచ్చింది. దీని విలువ 10 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. వీటి ద్వారా కస్టమ్స్ డ్యూటీ కింద ప్రభుత్వానికి రావాల్సిన బిలియన్ డాలర్లు అలాగే 2% దిగుమతి సుంకాన్ని కూడా నష్టపోయాం. జీడీపీలో 6-7% వాటా ఉన్న ఇండియన్ ఆభ రణాల పరిశ్రమను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోకపోవడం విచారకరం.
 
కాసింత ఉపశమనం

గేరా డెవలప్‌మెంట్ ఎండీ రోహిత్ గేరా

నేరుగా స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకోకపోయినప్పటికీ పరోక్షంగా కాసింత ఉపశమనాన్ని కలిగించింది. మౌలిక రంగానికి ఊతం ఇచ్చే జాతీయ పెట్టుబడి, మౌలిక సదుపాయాల నిధి (ఎన్‌ఐఐఎఫ్) ఏర్పాటు చేయటం ఆహ్వానించదగ్గ పరిణామం. దీంతో ఐఆర్‌ఎఫ్‌సీ, ఎన్‌హెచ్‌బీ వంటి మౌలిక సదుపాయాల ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా నిధుల కొరతతతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇన్‌ఫ్రా సంస్థలకు నిధులు లభిస్తాయి.
 
స్మార్ట్ సిటీల ఊసేలేదు:
 
నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్

ఇప్పటికే తీవ్ర నిధుల కొరతలో కొట్టుమిట్టాడుతున్న స్థిరాస్తి రంగాన్ని ఈ బడ్జెట్ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. దేశంలో వంద స్మార్ట్‌సిటీల నిర్మాణం అని పదేపదే చెప్పిన ప్రభుత్వం అవి ఎక్కడ, ఎంత మేర నిధులు ఖర్చు చేస్తారనే విషయంలో స్పష్టత ఇస్తుందనుకుంటే ఆ విషయాన్నే ప్రస్తావించలేదు.
 
ఎన్నారైలకు నిరాశే మిగిలింది

హిందూజా గ్రూప్ గ్లోబల్ చైర్మన్ శ్రీచంద్ పీ హిందుజా

దేశంలో పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తారని ఆశించిన ఎన్నారైలకు మాత్రం ఈ బడ్జెట్ చేదు గులికల్ని మిగిల్చింది. నిర్ధిష్టమైన చర్యలు, నిజమైన అభివృద్ధికి బాటలు పరిచేలా నిర్ణయాలు లేకపోవడం శోచనీయం.
 
‘హౌజింగ్ ఫర్ ఆల్’ కష్టమే

సీబీఆర్‌ఈ సౌత్ ఏసియా సీఎండీ అన్షుమన్
అందరి సొంతింటి కలను సాకారం చేసే నిర్మాణ రంగానికీ ఉన్న కలలను మాత్రం ఈ బడ్జెట్ తీర్చలేదు. స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేలా పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తారనుకుంటే ఆ ఊసే ఎత్తలేదు. 2022 నాటికి దేశంలో 6 కోట్లు ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించని ఈ బడ్జెట్‌తో ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవటం కష్టమే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement