బడ్జెట్లో సంస్కరణల మోత!
మలివిడత సంస్కరణలను ఆవిష్కరిస్తాం...
ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ వ్యాఖ్యలు...
మరిన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడుల పెంపు
స్థిరమైన పన్నుల వ్యవస్థతోనే ఇది సాధ్యం...
వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు 6 శాతం పైనే...
న్యూఢిల్లీ: దేశంలో సంస్కరణలను పరుగులు పెట్టిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. వచ్చే ఏడాది (2015-16) బడ్జెట్‌లో భారీ స్థాయిలో మలివిడత(రెండోతరం) సంస్కరణలను ఆవిష్కరిస్తామని చెప్పారు. దేశ ప్రజలకు అత్యంత ఉత్తేజభరితమైన రోజులు ముందున్నాయని కూడా ఆయన హామీనిచ్చారు. వార్తా సంస్థ పీటీఐ ప్రధాన కార్యాలయంలో ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పలు అంశాలపై జైట్లీ తన అభిప్రాయాలను వెల్లడించారు. మరిన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉందని.. ఇందుకు స్థిరమైన పన్నుల విధానం, వ్యవస్థతో పాటు పెట్టుబడి నిధులపై సరసమైన వడ్డీరేట్లు కూడా చాలా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, తప్పులను సరిదిద్దడం కూడా తమ ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు. బొగ్గు గనుల కేటాయింపుల విషయంలో తాము తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఇటువంటిదేనన్నారు. సహజ వనరుల కేటాయింపు... స్థిరమైన, హేతుబద్ధ పన్నుల వ్యవస్థ, భూ సేకరణ చట్టంలో అనవసర నిబంధనల తొలగింపు వంటివన్నీ ఈ దిద్దుబాటు చర్యల్లోకే వస్తాయని జైట్లీ పేర్కొన్నారు. ‘సంస్కరణలనేవి 365 రోజులూ కొనసాగుతూనే ఉంటాయి. అయితే, బడ్జెట్‌లాంటి కీలక తరుణంలో ప్రభుత్వం చేపట్టబోయే సంస్కరణలు, చర్యలను ప్రముఖంగా తెలియజేసేందుకు వీలవుతుంది. అదేవిధంగా సర్కారు ఏ దిశలో వెళ్తోందనేది కూడా ఈ సందర్భంగా అందరికీ తెలుస్తుంది. అందుకే బడ్జెట్ అనేది అత్యంత కీలకమైన అవకాశం.’ అని జైట్లీ పేర్కొన్నారు. బీమా సవరణ బిల్లు, బొగ్గు ఆర్డినెన్స్, వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లులే తమ తక్షణ ప్రాధాన్యాలని కూడా ఆయన పేర్కొన్నారు.
ఇక వృద్ధి జోరందుకుంటుంది...
తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలివ్వడం మొదలైతే.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుందని ఆర్థిక మంత్రి చెప్పారు. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6 శాతం పైగానే నమోదుకావచ్చని... ఆ తర్వాత ఇది మరింత పెరగనుందని కూడా ఆయన పేర్కొన్నారు. తమ ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆరు నెలల్లో తీసుకున్న చర్యలు, విధాన నిర్ణయాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రజలు, పారిశ్రామికవేత్తల్లో అడుగంటిపోయిన విశ్వాసాన్ని మళ్లీ పునరుద్ధరించగలిగామని జైట్లీ అన్నారు. దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లలో భారత ఆర్థిక వ్యవస్థపై మళ్లీ నమ్మకం పెరిగిందని చెప్పారు. ‘ఫలితాలు కనబడేందుకు కొంత సమయం పట్టొచ్చు. అయితే, సానుకూల సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. భారీస్థాయిలో పెట్టుబడులు భారత్‌కు తరలిరానున్నాయి. దేశీ పెట్టుబడిదారుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే రానున్న రోజులన్నీ మనలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయనేది నా అభిప్రాయం’ అని జైట్లీ వ్యాఖ్యానించారు.
రేట్ల కోతపై ఆశాభావం...
వృద్ధికి చేయూతనిచ్చే విధంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) వడ్డీరేట్ల కోతతో ఉపశమనం కల్పిస్తుందన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. ద్రవ్య లభ్యత, చౌకగా పెట్టుబడి నిధులను అందుబాటులోకి తీసుకురాకుండా... మరిన్ని రంగాల్లోని పెట్టుబడులకు గేట్లు తెరవడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. వచ్చే వారంలో ఆర్‌బీఐ పాలసీ సమీక్ష జరపనుంది.
బొగ్గు గనుల కేటాయింపులపై...
ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూ)కు బొగ్గు గనుల కేటాయింపులు, వేలం ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రైవేటు కంపెనీలకు వాణిజ్యపరంగా బొగ్గు తవ్వకానికి ప్రభుత్వం అనుమతిస్తుందని జైట్లీ పేర్కొన్నారు. బొగ్గు స్కాం కారణంగా సుప్రీం కోర్టు రద్దు చేసిన 204 బొగ్గు బ్లాకుల వేలం కోసం ప్రభుత్వం గత నెలలో ఆర్డినెన్స్‌ను జారీ చేయడం తెలిసిందే. ఇందులో ప్రైవేటు కంపెనీలకు వాణిజ్యపరమైన మైనింగ్ అంశాన్ని కూడా చేర్చారు. కాగా, తొలి విడతలో సొంత అవసరాలకు వినియోగించే కంపెనీల కోసం 74 క్షేత్రాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వేలం నిర్వహించనున్నట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. బొగ్గు ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చే బిల్లును ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. కాగా, మూడో విడత ఎఫ్‌ఎం రేడియో విస్తరణ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టనున్నట్లు జైట్లీ చెప్పారు. సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖకు కూడా జైట్లీయే నేతృత్వం వహిస్తున్న విషయం విదితమే. తమ శాఖతో పాటు టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్) ఫేజ్-3 ఎఫ్‌ఎం వేలం విధివిధానాలపై కసరత్తు చేస్తోందన్నారు. మూడో దశ వేలంలో దేశవ్యాప్తంగా 294 నగరాల్లో మరో 800 కొత్త ఎఫ్‌ఎం చానళ్లకు అనుమతించే అవకాశం ఉంది.
ధనికులకు వంటగ్యాస్ సబ్సిడీ కట్...!
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు నిజంగా వాటి అవసరం ఉన్న వర్గాలకే అందేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని జైట్లీ పేర్కొన్నారు. అంతేకాకుండా సంపన్నులకు వంట గ్యాస్ సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన మరోమారు తేల్చిచెప్పారు. ‘సబ్సిడీలనేవి పేదవర్గాలకు అందించాల్సినవి. అంతేకానీ, ధనికులకోసం కాదు. భారత్‌తో ఇంకా చాలా మంది పేదరికంలో ఉన్నారు. వాళ్లకు తప్పకుండా ప్రభుత్వం సబ్సిడీల రూపంలో ఆసరా ఇవ్వాల్సిందే. అయితే, ఈ ప్రయోజనాల దుర్వినియోగం కారణంగా ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. దీనికి అడ్డుకట్టవేయడంపై మేం దృష్టిపెడుతున్నాం’ అని ఆర్థికమంత్రి ఆరుణ్ జైట్లీ పేర్కొన్నారు.