బి.శరత్ శర్మ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే కేంద్రంలో మోడీ నాయకత్వంలోని సుస్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మార్కెట్ దృష్టంతా మోడీ ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనే ఉంది. బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా మార్కెట్ కదలికలు ఉంటాయంటున్నారు ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.శరత్ శర్మ. స్టాక్ మార్కెట్లు గరిష్ట స్థాయిలో ఉన్నా... ఇప్పటికీ ఇంకా చాలా చౌకగానే ఉన్నాయని, రానున్న కాలంలో ఈక్విటీలు మంచి లాభాలు అందించనున్నాయి అంటున్న శరత్ శర్మతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ..
మార్కెట్ అంచనాలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడి నుంచి మార్కెట్ కదలికలు ఏ విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు?
గత మూడు నాలుగేళ్లుగా ఒక పరిమిత శ్రేణిలోనే కదిలాయి. చాలా కంపెనీల షేర్లు వాటి వాస్తవ ధర కంటే చాలా తక్కువ ధరలో ఉండేవి. కాని బీజేపీ మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెట్లు 28 శాతం పెరిగాయి. సంస్కరణలకు అనుకూలమైన ప్రభుత్వం పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడం మార్కెట్లకు సానుకూలమైన అంశం. వృద్ధిరేటును గాడిలో పెడుతూ సంస్కరణలను చేపడితే సూచీలు మరింత పైకి దూసుకుపోతాయనడంలో సందేహం లేదు.
ఇప్పటికే సూచీలు బాగా పెరగడంతో ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లోకి ప్రవేశించొచ్చా?
బుల్ ర్యాలీకి ఇది ప్రారంభం మాత్రమే. సెన్సెక్స్ 24,000 దాటినప్పటికీ ఇంకా 25 శాతం చౌకగానే ఉందని చెప్పొచ్చు. 2014-15 ఆదాయాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం సెన్సెక్స్ 16 పీఈ వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది 15 ఏళ్ల సగటు పీఈ 17-18కి కొద్దిగా తక్కువ. ఈ విధంగా చూస్తే మన సూచీలు సహజ విలువకు దగ్గరగా ఉన్నాయేకాని ఖరీదైనవి కావు. ప్రస్తుతం వృద్ధిరేటు 5 శాతంలోపు ఉంది. ఇది కనుక వృద్ధి చెంది 7-8 శాతానికి చేరితే మన మార్కెట్లు చాలా చౌకగా కనిపిస్తాయి. సగటు పీఈ 18కి చేరినా సెన్సెక్స్ 30,000 మార్కును దాటుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. గడిచిన ఆరేళ్లలో సూచీలు 20 శాతం అంటే ఏడాదికి సుమారు 3 శాతం చొప్పున పెరిగాయి. బ్యాంకు డిపాజిట్లు అందించే వడ్డీ 10 శాతం కంటే ఇది చాలా తక్కువ. ఈ నష్టాన్ని సూచీలు ఒకటి రెండు ఏళ్లలోనే భర్తీ చేస్తాయి.
గడిచిన మూడు నెలల్లో కొన్ని రంగాల షేర్లు రెండు నుంచి మూడు రెట్లు పెరిగాయి. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందా?
వార్తల ఆధారంగా జరిపే ర్యాలీ ఎంతో కాలం నిలబడదు. ఇది మార్కెట్లకు మంచిది కాదు. ఇప్పుడు ర్యాలీ చేసిన వాటిల్లో చాలా షేర్లు రానున్న కాలంలో ఈ లాభాలను నిలుపుకోలేవు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి పనితీరు కనబరుస్తూ, డివిడెండ్ ఇచ్చే, మంచి యాజమాన్యం, పనితీరు, వృద్ధికి అవకాశం ఉన్న లార్జ్, మిడ్‌క్యాప్ షేర్లతోనే పోర్ట్‌ఫోలియో రూపొందించుకోవాలి. అంతేకాని ఒకేసారి సెక్టార్స్‌ను మార్చొద్దు. ఇలా వార్తల ఆధారంగా పెరిగే షేర్లకు దూరంగా ఉండాలి.
మోడీ నేతృత్వంలోని రాబోయే కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ నుంచి మార్కెట్ ఏమి ఆశిస్తోంది?
ఇప్పుడు మార్కెట్ దృష్టంతా మోడీ ప్రవేశపెట్టే బడ్జెట్ మీదే ఉంది. ప్రభుత్వం వ్యయం ఏవిధంగా ఉంది, సబ్సిడీలపై ఏ విధంగా వ్యవహరించారన్నవే కీలక విషయాలు. బడ్జెట్ లోటును పెంచుతూ వ్యయాలు ఎక్కువ చేస్తే ప్రభుత్వానికి రుణ భారం పెరగడమే కాకుండా, అది ద్రవ్యోల్బణాన్ని పెంచుతూ వృద్ధిరేటును దెబ్బతీసే ప్రమాదం ఉంది. సంస్కరణల పరంగా తీసుకునే చర్యలను బట్టి ఆయా రంగాల షేర్ల కదలికలుంటాయి. ఇప్పటికే సూచీలు బాగా పెరిగి ఉండటంతో బడ్జెట్ వరకు ఒక పరిమిత శ్రేణిలో తిరుగుతాయి. బడ్జెట్ తర్వాత ఒక స్పష్టమైన దిశలో కదులుతాయి.
గత తొమ్మిది నెలల్లోనే ఎఫ్‌ఐఐలు మన మార్కెట్లో లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టారు. రానున్న కాలంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందా?
ఎఫ్‌ఐఐల పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. మార్కెట్లు పెరుగుతుండటంతో పాటు, రూపాయి బలపడుతుండటంతో ఎఫ్‌ఐఐలు రెండిందాల ప్రయోజనం పొందుతున్నారు. దీంతో రానున్న కాలంలో ఎఫ్‌ఐఐ పెట్టుబడులు మరింత పెరుగుతాయి.
దేశీయ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారా? లేక మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఇంకా అమ్మకాల ఒత్తిడినే ఎదుర్కొంటోందా?
గడిచిన మూడు నెలల నుంచి పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత ఈ త్రైమాసికంలో నికర కొనుగోళ్లు జరిగాయి. ఇప్పటికే హైనెట్‌వర్త్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టగా, రిటైల్ ఇన్వెస్టర్లు సిప్ ఖాతాలు తెరవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రస్తుతం ఏ రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారు? వేటికి దూరంగా ఉంటున్నారు?
ఇప్పటికీ మేము దేశీయ వినియోగంతో ముడిపడి ఉన్న బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఫార్మా, ఐటీ వంటి రంగాలపై ఆసక్తి చూపిస్తున్నాం. ఇతర రంగాల్లో ఉన్న మంచి షేర్లను కూడా కొనుగోలు చేస్తున్నాం.
పీఎస్‌యూ బ్యాంకుల ర్యాలీపై నాయక్ కమిటీ సిఫార్సులు ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయి?
వాస్తవ విలువ కంటే చాలా తక్కువ ధరల వద్ద ఉండటంతో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు పెరుగుతున్నాయి. వృద్ధిరేటు పెరిగితే ఎన్‌పీఏలు తగ్గుతాయనే నమ్మకమే దీనికి కారణం. అంతేకాని ఈ ర్యాలిపై నాయక్ కమిటీ సిఫార్సుల ప్రభావం తక్కువే. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల మధ్య విలీనం అవకాశాలు కూడా తక్కువే.
వడ్డీరేట్లు, రూపాయి కదలికలపై మీ అంచనాలు?
వడ్డీరేట్ల, కదలికలు పూర్తిగా రుతుపవనాలపై ఆధారపడి ఉంటాయి. ద్రవ్యోల్బణం గనుక అదుపులో ఉంటే రానున్న రోజుల్లో వడ్డీరేట్లు తగ్గడమేకానీ పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహంతో రూపాయి విలువ పెరుగుతూవస్తోంది. వచ్చే ఏడాది కాలంలో డాలరుతో రూపాయి మారకం విలువ 60 లోపే ఉంటుంది.