ఇలా చేసై కోటిశ్వరులే !
♦ వేతనంలో మిగిలిన మొత్తం పెట్టుబడులకు
♦ అవసరాలు వస్తాయని అట్టే ఖాతాలో ఉంచేయొద్దు
♦ మూడు నెలల అవసరాల కోసం అత్యవసర నిధి
♦ ఇక మిగిలిన ప్రతీ రూపాయి ఇన్వెస్ట్‌మెంట్‌కే వెళ్లాలి
♦ అత్యవసర నిధిని కూడా లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టడం బెటర్
ఎంత సంపాదించినా పొదుపు, మదుపులు చేయకపోతే పేదవారికిందే లెక్క. సంపద సృష్టించుకోవాలంటే మంచి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయాలంటే సంపాదించిన మొత్తంలో నిర్ణీత శాతాన్ని మిగల్చాలి. దాన్ని క్రమశిక్షణతో పెట్టుబడులకు మళ్లించాలి. వాస్తవానికి ఇదేమంత పెద్ద కష్టం కాదు. ఓ చిన్న సూత్రాన్ని ఫాలో అయిపోతే చాలు... సులభంగానే సంపదను కూడబెట్టవచ్చు.
మిగులు వృథా కాకూడదు...
సాధారణంగా ప్రతి నెలా ఆర్జిస్తున్న మొత్తం నుంచి ఇంటద్దె, కిరాణ, పాలు, పిల్లల స్కూలు ఫీజులు, వైద్యం, ప్రయాణ చార్జీలు.. ఇలా అన్ని ఖర్చులు పోను కొంత మిగులుతుంది. మిగలాలి కూడా. ఈ మిగులును కొందరు దుబారా ఖర్చులకు వాడేసుకుంటే, కొందరు కాస్త ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఏదైనా అనుకోని అవసరాలు ఎదురవుతాయన్న ఆలోచనతో కాస్త పక్కనబెడతారు. నిజానికి సంపద సృష్టికి విఘాతం కలిగించేది ఇదే.
ముందుగా అసలు మీ నెలసరి ఖర్చులేంటి? ఎంత? అన్నది తేల్చుకోండి. ఇంటద్దె, కిరాణా, పాలు, కూరగాయలు, విద్యుత్తు, నీటి బిల్లు, పేపర్, కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఫోన్, ప్రయాణ చార్జీలు, పెట్రోల్ చార్జీలు, పిల్లల విద్యా వ్యయాలు, వినోదం, రెస్టారెంట్లలో విందులు, వైద్య వ్యయాలు, వస్త్రాలు, బీమా ప్రీమియం, రుణ వాయిదాలు, ఇతర వ్యయాలన్నీ లెక్కించి నెలకు ఎంత అవసరమో స్పష్టతకు రండి. వీటిని నెలసరి వేతనం నుంచి మినహాయిస్తే ఎంత మిగులు అన్నది తేలుతుంది. ఈ మిగులు మొత్తాన్ని మీరు నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
కానీ ఏం జరుగుతోంది...?
మిగులు మొత్తాన్నీ రికరింగ్ డిపాజిట్‌లోకో, సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లోకో మళ్లిస్తున్నారా...? దీనికి అవుననే సమాధానం ఎక్కువ మంది నుంచి రాకపోవచ్చు. ఉదాహరణకు రూ.50,000 వేతనంలో నెల ఖర్చులు రూ.30,000 వేలు వస్తున్నాయనుకోండి. రూ.20,000 మిగులు ఉంటుంది. కానీ, ఎక్కువ మంది ఇందులో రూ.5,000 లేదంటే రూ.10,000కు మించి ఇన్వెస్ట్ చేయరు. అత్యవసరాల కోసం ఉంచుకుంటారు.
అత్యవసర నిధి అవసరమే
అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఆదుకునేందుకు ప్రత్యేక నిధి అన్నది అవసరమే. మూడు నుంచి ఆరు నెలల అవసరాలకు నిధిని పక్కన పెట్టుకోవాలి. మొదట చేయాల్సిందిదే. అంతే కానీ, ప్రతి నెలా వేతనంలో మిగిలిన మొత్తాన్ని అత్యవసరాల పేరుతో అలా ఉంచేయడమన్నది సమంజసం కాదు. ఎందుకంటే అత్యవసరాల కోసమని నెల వేతనంలో రూ.10 నుంచి రూ.20వేల వరకు, ప్రతి నెలా బ్యాంకు ఖాతాలో ఉంచేశారనుకోండి. వాటిని ఇతర అవసరాలకు వాడుకోకుండా ఉండగలరా...? మిగులు నిధులు కనిపిస్తూ ఉంటే... అవసరం ఏర్పడితే మరో ఆలోచన లేకుండా వాడేస్తారు. దీంతో ఆ నెలలో ఇన్వెస్ట్ చేయకుండా ఉంచినదంతా అదనపు ఖర్చు రూపేణా హరించుకుపోతుంది.
కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ వచ్చిందనో, మరొకటో... ఆన్‌లైన్లో కంటికి నచ్చిన వస్తువును ఆర్డర్ చేసేందుకూ వెనుకాడరు. ఎందుకంటే ఆర్థిక శాస్త్రం ప్రకారం... సరఫరా ఎక్కువగా ఉంటే డిమాండ్లు కూడా ఎక్కువైపోతాయి. ఒక్కసారి ఇలా అదనపు ఖర్చులకు అలవాటు పడ్డారా... ఇక ఆపై అదే నిత్యకృత్యం అవుతుంది. దీనివల్ల నెల వేతనంలో మిగిలిన మొత్తం పూర్తిగా పెట్టుబడులకు వెళ్లలేదు. అంటే ఆ మేర ఇన్వెస్ట్‌మెంట్ తగ్గిపోయింది. మరోవైపు అత్యవసరాల కోసం ఇన్వెస్ట్ చేయకుండా ఉంచిన రూ.10వేలు నిజంగా అత్యవసరాలకు కాకుండా సాధారణ అవరాలకే ఖర్చయిపోయింది. అప్పుడు నిజంగా అత్యవసరాలు ఎదురైతే...? పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారా..? ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఇవన్నీ తప్పిదాలే.
చేయాల్సింది ఇదీ...
ముందుగా మూడు నుంచి ఆరు నెలల పాటు కుటుంబ పోషణ, పెట్టుబడుల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి. ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్యపరంగా తీవ్ర అస్వస్థతకు గురవడం ఇతరత్రా సందర్భాల్లో ఆదుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీన్ని లిక్విడ్ ఫండ్స్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేందుకు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక పైన చెప్పుకున్న ఉదాహరణ ప్రకారం నెలసరి వేతనం రూ.50,000లో వాస్తవ కుటుంబ ఖర్చులు రూ.30,000 మాత్రమే. ఎందుకైనా మంచిది కొంతన్నా చేతిలో ఉండాలనుకుంటే... నెలసరి ఖర్చులు రూ.30,000కు అదనంగా ఓ పది శాతం రూ.3,000 దగ్గర ఉంచుకోవాలి. దీన్ని కూడా లిక్విడ్ ఫండ్స్‌లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే అవసరమైనప్పుడు వెంటనే తీసేసుకోవచ్చు. మొత్తం రూ.33,000 పోను వేతనంలో రూ.17,000 మిగులు ఉంటుంది.
ఈ మిగులును మొదట కొన్ని నెలల పాటు పైన చెప్పుకున్నట్టు మూడు నుంచి ఆరు నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి సమకూర్చుకునేందుకు పక్కన పెట్టుకోవచ్చు. ఓ ఆరు నెలలకు అత్యవసర నిధి సిద్ధమైపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి మిగులు మొత్తాన్ని దీర్ఘకాలిక లక్ష్యాలు, సంపద సృష్టికి ఇన్వెస్ట్‌మెంట్స్‌గా మళ్లించాలి. అవి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఆర్డీ, పీపీఎఫ్ ఇలా ఏవైనా కావచ్చు. ప్రతి ఏటా ఆర్జన పెరుగుతుంటుంది కదా... అలాగే ఖర్చులు కూడా. పెరుగుతున్న వేతనానికి అనుగుణంగా పెట్టుబడుల మొత్తాన్ని కూడా పెంచుకుంటూ వెళ్లాలి.
ముందు అత్యవసర నిధి
ఆ తర్వాత నెల ఖర్చులకు అదనంగా 10 శాతం స్వల్పకాలిక సర్దుబాటు నిధి
ఒక నెలలో సర్దుబాటు నిధి మిగిలిపోతే దాన్ని అత్యవసర నిధికి మళ్లించాలి
నెలలో మిగులు మొత్తం పెట్టుబడులకు మళ్లించాలి
ఇలా చేస్తే వృ«థాకు బ్రేక్ పడతుంది. వ్యయంలో, పెట్టుబడుల్లో క్రమశిక్షణ అలవడుతుంది. చివరిగా సంపద సాకారమవుతుందన్నది నిపుణుల విశ్లేషణ.