క్యాబ్ కంపెనీల ధరల పోరు! | Cab companies' prices online! | Sakshi
Sakshi News home page

క్యాబ్ కంపెనీల ధరల పోరు!

Published Fri, Jul 3 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

క్యాబ్ కంపెనీల ధరల పోరు!

క్యాబ్ కంపెనీల ధరల పోరు!

కిలోమీటరుకు ఉబెర్ చార్జీ రూ.7

♦ రేసులో ఉన్నానంటూ రూ.9కి తగ్గించిన ఓలా
♦ వర్షం, పీక్ సమయాల్లో మాత్రం బాదుడు
♦ వాస్తవ చార్జీకి 5 రెట్ల వరకూ వసూలు
♦ ముందే చూసుకోకుంటే జేబు గుల్లే
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ట్యాక్సీ అగ్రిగేటర్ల మధ్య పోటీ తారస్థాయికి చేరింది. పోటీలో ముందుండటానికి ఇవి ధరల పోరుకు తెరతీశాయి. ట్యాక్సీ సర్వీసుల్లో ఆది నుంచీ దూకుడుగానే వ్యవహరిస్తున్న బహుళజాతి సంస్థ ‘ఉబెర్’ మరోసారి ధరల యుద్ధానికి తెరలేపింది. ‘ఉబెర్ గో’ పేరిట చిన్న కార్లకు హైదరాబాద్‌లో కిలోమీటరుకు అతి తక్కువగా రూ.7 చొప్పున వసూలు చేస్తోంది. పెపైచ్చు రూ.25 బేస్ రేటుతో సర్వీసులను అందిస్తోంది. అంటే కనీస చార్జీ రూ.25 చెల్లిస్తే చాలన్నమాట.

ఆ తరవాత ఎన్ని  కిలోమీటర్లయితే అన్నిటికీ రూ.7 చొప్పున వసూలు చేస్తారు. అయితే ఉబెర్ దెబ్బకు మిగిలిన కంపెనీలూ దిగి వస్తున్నాయి. దీంతో పాటు డ్రైవర్లను ఆకట్టుకోవటానికి వారికి ప్రోత్సాహకాల విషయంలోనూ కంపెనీలు పోటీలు పడుతున్నాయి. అయితే ఇక్కడ జరుగుతున్నదొక్కటే. క్యాబ్‌లకు తాము ఎవరి తరఫున వాహనం నడుపుతున్నామనే స్టిక్కర్ తప్పనిసరి కాకపోవటంతో... ఒకే క్యాబ్ అన్ని కంపెనీల తరఫునా సేవలందిస్తోంది. అదీ కథ.

 అగ్ర శ్రేణి కంపెనీ సైతం...
 ఉబెర్ పోటీతో భారత్‌లో ట్యాక్సీ సర్వీసుల్లో అగ్ర స్థానంలో ఉన్న ఓలా సైతం ధరలను సవరించింది. హైదరాబాద్‌లో మినీ కార్లకు కిలోమీటరుకు రూ.10గా ఉన్న చార్జీని కాస్తా రూ.9కి తగ్గిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలియజేసింది. నిజానికి ఈ చార్జీని కొద్ది రోజుల ముందే తగ్గించినా... అధికారికంగా మాత్రం గురువారం ప్రకటించింది. బేస్ రేటును కూడా రూ.100 నుంచి రూ.80కి కుదించింది. ఈ బేస్ రేటుతో నాలుగు కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. అంటే రూ.80కి 4 కిలోమీటర్లు ప్రయాణించి... అక్కడి నుంచి కిలోమీటరుకు రూ.9 చొప్పున చెల్లించాలన్న మాట.

ఇక సెడాన్ కార్లకు కి.మీ.కు గతంలో రూ.14 చొప్పున వసూ లు చేసినా ఇటీవలే దాన్ని రూ.12కు తగ్గించింది. బేస్ రేటులో కూడా రూ.50 తగ్గించి ప్రస్తుతం రూ.100 వసూలు చేస్తోంది. ఢిల్లీలో మినీ కార్లకు కి.మీ.కు రూ.8 చార్జీ వసూలు చేస్తుండటం విశేషం. ఉబెర్ మాత్రం సెడాన్ కార్లకు హైదరాబాద్‌లో కి.మీ.కు రూ.9 చార్జీ చేస్తోంది. బేస్ ఫేర్ రూ.45, కనీస చార్జీ రూ.80.  జినీ, ఓలాకే చెందిన ట్యాక్సీ ఫర్ స్యూర్‌లు హ్యాచ్‌బ్యాక్ కార్లకు కి.మీ.కు రూ.12 వసూలు చేస్తున్నాయి. ట్రిప్ టైమ్ పేరుతో ఈ కంపెనీలు వాహనాన్ని బట్టి నిమిషానికి రూ.2 వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి.

 పోటాపోటీగా ప్రోత్సాహకాలు!
 కారు యజమానులకు అగ్రిగేటర్లు పోటీపడి మరీ నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. పీక్ టైమ్‌లో ఉబెర్ ఒక్కో ట్రిప్‌కు రూ.225 వరకు అదనంగా చెల్లిస్తోంది. ఓలా మాత్రం పీక్ టైమ్‌లో ట్రిప్‌కు రూ.100 ఇస్తోంది. ట్యాక్సీ ఫర్ స్యూర్ సైతం నగదుతో కారు యజమానులను ప్రోత్సహిస్తోంది. ఉదాహరణకు 10 ట్రిప్పులకుగాను కస్టమర్లు చెల్లించిన మొత్తం రూ.2,000 అయితే, కంపెనీ అదనంగా రూ.1,200 ఇస్తోంది. 10 ట్రిప్పులకు కస్టమర్ల నుంచి రూ.3,200లకు మించి పొందితే అదన పు చెల్లింపులు ఉండవు.  ఇక కారు యజమానుల నుంచి ఉబెర్ 20 శాతం, ఓలా, ట్యాక్సీ ఫర్ స్యూర్‌లు 15 శాతం కమిషన్ తీసుకుంటున్నాయి.
 
 డిమాండ్‌ను బట్టి బాదుడు!
 మామూలు సమయాల్లో ఈ అగ్రిగేటర్ల చార్జీలు తక్కువే అనిపించినా పీక్ సమయాల్లోను, వర్షం పడినప్పుడు మాత్రం బాదుడు ఉండనే ఉంటోంది. ఉదయం 7-10, సాయంత్రం 4-9 వరకు క్యాబ్‌లకు డిమాండ్ అధికంగా ఉంటోంది. పీక్ టైమ్‌కు తోడు వర్షం పడిందంటే... ఆ సమయాల్లో ‘సర్జ్’ పేరుతో ఉబెర్‌అదనంగా చార్జీలు వసూలు చేస్తోంది. అలాంటి సమయంలో బుక్ చేసినపుడు ఎన్ని రెట్ల ఛార్జీ చెల్లించాల్సి వస్తుందన్నది ముందే తెలుస్తుంది. అది గమనించకుండా ఇటీవల ఒక కస్టమర్ క్యాబ్ బుక్ చేయటంతో... అది ఏకంగా 5 రెట్ల చార్జీకి వెళ్లింది. దీంతో నిండా 10 కిలోమీటర్లు కూడా ప్రయాణించకుండానే బిల్లు రూ.1,200 పైగా అయ్యింది.

అది చూసి గుండె గుభేలుమన్న సదరు కస్టమర్ హైటెక్ సిటీ వెళ్లాల్సి ఉన్నా మధ్యలోనే అప్పటివరకూ అయిన చార్జీలు చెల్లించి దిగిపోయారంటే కంపెనీ ఏ స్థాయిలో చార్జీ వసూలు చేసిందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి కారు యజమానులకు అదనపు ప్రోత్సాహకాలు ఉబెర్ నుంచే అధికంగా వస్తున్నాయి. ‘‘ఈ ప్రోత్సాహకాల కోసం పలువురు క్యాబ్ యజమానులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. కంపెనీ వద్ద కార్లు పెరగడంతో బుకింగ్స్ తగ్గిపోయాయి’’ అని శంకర్ అనే కారు యజమాని వాపోయాడు. అయితే అన్ని కంపెనీల తరఫునా నడిపిస్తుండటం కారు యజమానులకు కలిసి వస్తోందన్నది బహిరంగ రహస్యం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement