
ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ కంపెనీ 'ఉబర్' (Uber) వినియోగదారుల కోసం మరో గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. ఇది తప్పకుండా ప్రయాణికులకు ఉపయోగపడుతుంది. ఇకపై ఉబర్ సర్వీస్ కోసం 90 రోజులకు ముందే బుక్ చేసుకోవచ్చు. తద్వారా ప్రయాణికులకు ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించిన టెన్షన్ దూరమవుతుంది.
(ఇదీ చదవండి: Reset SBI ATM PIN: ఇంటినుంచే ఏటీఎమ్ పిన్ మార్చుకోండి)
ఎయిర్ పోర్ట్‌కి వెళ్లేవారు లేదా వచ్చేవారికి ఇప్పటికే ప్రధాన ఎయిర్ పోర్టులలో ఉబర్ ట్యాక్సీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక పికప్ పాయింట్స్, పార్కింగ్ ఏరియాలను కలిగి ఉండటం వల్ల వినియోగదారుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ప్రయాణం పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మూడు నెలలకు ముందే (90 రోజులు) బుక్ చేసుకునే సదుపాయం కల్పించడం వల్ల మరింత ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి.
కేవలం ఎయిర్ పోర్ట్ ప్రయాణాలకు మాత్రమే కాకుండా, ఇతర ప్రయాణాలకు కూడా ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా బుక్ చేసుకుంటే ఉబర్ డ్రైవర్లు కూడా ముందుగానే బుకింగ్ ప్లాన్ సిద్ధం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. మనదేశంలో కొన్ని ఎయిర్ పోర్టులలో ఉబర్ సర్వీస్ మరింత సులువుగా ఉంటుంది. దీని ద్వారా స్టెప్ బై స్టెప్ గైడెన్స్‌ను ఒక యాప్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతానికి అలాంటి సదుపాయం దేశంలోని 13 ప్రధాన విమానాశ్రయాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.