ఆన్‌లైన్ రవాణా సేవలందిస్తున్న ఉబర్ కొత్తగా జల రవాణా సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు రోడ్లపై వాహనాలను బుక్ చేసుకున్నట్లే, ఇకపై నీటిలో బోట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఆసియాలో తొలిసారిగా జల రవాణా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది.
శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో శికారా(సంప్రదాయ చెక్క పడవలు) బుకింగ్‌ను పరిచయం చేసింది. శ్రీనగర్‌లోని ప్రముఖ దాల్ సరస్సులో ప్రయాణించే ఈ శికారా పడవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సరస్సు చుట్టుపక్కల ప్రదేశాలను చూసేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. శతాబ్దాలుగా సరస్సులో రవాణా, విశ్రాంతి కోసం శికారాలను ఉపయోగిస్తున్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల పెరుగుదల
‘సాంకేతికత, సంప్రదాయాన్ని మిళితం చేసి ప్రయాణికులకు ఆన్‌లైన్ ద్వారా శికారా రైడ్ అందించి వారికి మరుపురాని అనుభవాన్ని సొంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కశ్మీర్‌లోని ఉత్కంఠభరిత ప్రకృతి దృశ్యాన్ని మరింత మందికి చేరువ చేయడం, పర్యాటకాన్ని మెరుగుపరిచే ఈ ఐకానిక్ అనుభవాన్ని సృష్టించడం గర్వకారణం’ అని ఊబర్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్ తెలిపారు. ఉబర్ వినియోగదారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఈ సేవలను పొందవచ్చని కంపెనీ తెలిపింది. శికారా రైడ్‌ను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 మధ్య బుక్ చేసుకోవచ్చు. ఉబర్ వేదికగా 15 రోజుల ముందు నుంచి బుక్ చేసుకునే వీలుంది. దాల్ లేక్‌లో దాదాపు 4,000 శికారాలు ఉన్నట్లు అంచనా.
Comments
Please login to add a commentAdd a comment