ప్రముఖ ఆన్‌లైన్ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ తన ట్యాక్సీ డ్రైవర్లకు ఏకంగా రూ.1,470 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఆస్ట్రేలియాలో చాలాకాలంగా కొనసాగుతున్న న్యాయ వివాదానికి పరిష్కారం లభించింది. ఉబర్ తమ దేశంలోకి ప్రవేశించడంతో ఉపాధి కోల్పోయామంటూ దాదాపు 8,000 మంది ట్యాక్సీ డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కొంతకాలంగా విచారణ కొనసాగుతోంది. పరిహారం చెల్లించడానికి కంపెనీ నిరాకరిస్తూ వచ్చింది. తాజాగా ఈ కేసు విక్టోరియా సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. కానీ, అప్పటికే ఉబర్ డ్రైవర్లతో పరిహార ఒప్పందం కుదుర్చుకుంది.
ఉబర్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సేవలందిస్తోంది. 2012లో ఆస్ట్రేలియాలోకి ప్రవేశించిన ఉబర్ వేగంగా సేవలను విస్తరించినట్లు న్యాయవాది మైఖేల్ తెలిపారు. దీనివల్ల అప్పటికే స్థానికంగా అద్దె ట్యాక్సీలను నడిపే చాలా మంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. వారికి పరిహారం చెల్లించాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఉబర్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. దీంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు. డ్రైవర్ల డిమాండ్‌కు సామాన్య పౌరులు సైతం మద్దతు తెలిపినట్లు చెప్పారు.
ఈ వ్యవహారంపై ఉబర్ స్పందిస్తూ ప్రపంచంలో కంపెనీ ఉబర్ సేవలు ప్రారంభించినపుడు ఆయా దేశాల్లో నియంత్రణ నిబంధనలులేవు. ఆస్ట్రేలియాలో ఉబర్ కార్యకలాపాల వల్ల అక్కడి రవాణా వ్యవస్థలు మెరుగైన మార్పులు వచ్చాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దాంతో స్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరికాయని చెప్పారు. ఆదేశ నిబంధనల ప్రకారం..2018 నుంచి వివిధ ప్రాంతాల్లోని వారితో పరిహార ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు.
ఇదీ చదవండి: మరో ‘కేజీఎఫ్’ ఆనవాలు.. ఎక్కడో తెలుసా..?
Comments
Please login to add a commentAdd a comment