రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్రాలతో జట్టు
జాయింట్ వెంచర్ కంపెనీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం...
♦ వనరుల సమీకరణ, ప్రాజెక్టులను
♦ వేగంగా పూర్తిచేయడమే లక్ష్యం
న్యూఢిల్లీ: రైల్వేలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో ఇకపై రాష్ట్రాలకు మరింతగా భాగస్వామ్యం కల్పించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రేల్వే శాఖతో రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్(జేవీ) కంపెనీ ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేసింది. బుధవారమిక్కడ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర పడింది. రైల్వే ప్రాజెక్టులకు వనరులను సమకూర్చడం, వేగంగా అమలు చేయడం వంటివి ఈ చర్యల ప్రధానోద్దేశం. వివిధ రాష్ట్రాల్లో రైల్వే లైన్ల ఏర్పాటుకు డిమాండ్లు అంతకంతకూ పెరుగున్న నేపథ్యంలో వీటి నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు అవసరమవుతున్నాయి.
ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలతో ఏర్పాటు చేసే జేవీ కంపెనీలు ఇలాంటి ప్రాజెక్టులను గుర్తించడం, భూసేకరణ, తగిన నిధుల సమీకరణ వంటివాటితోపాటు పర్యవేక్షణను కూడా చేపడతాయి. ఈ విధమైన ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి కూడా కొంతమేరకు నిధులు లభిస్తాయని కేబినెట్ భేటీ అనంతరం కేంద్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈక్విటీ వాటా కేటాయింపు ప్రాతిపదికన జేవీ కంపెనీలు ఏర్పాటవుతాయి. ప్రతి జేవీకి ప్రాజెక్టుల సామ ర్థ్యాన్ని అనుసరించి కనీస పెయిడ్-అప్ మూలధనం రూ. 100 కోట్లుగా ఉంటుందని ప్రకటనలో తెలిపారు. ఇందులో ప్రతి రాష్ట్రంతో ఏర్పాటయ్యే జేవీలోనూ రైల్వేల కనీస పెయిడ్-అప్ మూలధనం రూ.50 కోట్లకు పరిమితమవుతుంది.
అయితే, భవిష్యత్తులో ఆయా ప్రాజెక్టుల కోసం మరిన్ని నిధులు/ఈక్విటీ పెంచాలంటే... సంబంధిత యంత్రాంగం నుంచి ప్రాజెక్టులు, నిధుల సమీకరణకు తగిన ఆమోదం లభించాకే వీలవుతుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. మరోపక్క ఈ జేవీ కంపెనీలు నిర్దేశిత ప్రాజెక్టుల కోసం విడివిడిగా ప్రత్యేక సంస్థ(ఎస్‌పీవీ)లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిలో బ్యాంకులు, పోర్టులు, ప్రభుత్వ రంగ సంస్థలు, మైనింగ్ కంపెనీలకు సైతం ఈక్విటీ వాటాలను ఇచ్చేందుకు అనుమతిస్తారు.
రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, చట్టపరమైన అనుమతులు వేగంగా రావడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మరింత భాగస్వామ్యం కల్పించేందుకు ఈ జేవీ విధానం దోహదం చేస్తుందని కేంద్రం పేర్కొంది. ఇటీవలే రైల్వే శాఖ కేరళ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలతో జేవీ కంపెనీల ఏర్పాటుకు అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు కూడా చేసింది. ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైల్వే ప్రాజెక్టులకు ఇదే విధమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
సిమెంట్, స్టీల్ రంగాలకు వేలం ద్వారా బొగ్గు..
ప్రభుత్వ నియంత్రణలోలేని సిమెంటు, స్టీల్ తదితర రంగాలకు బొగ్గు సరఫరాలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రంగాలకు చెందిన కంపెనీలకు వేలం పద్ధతిలోనే బొగ్గును సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విభాగంలో స్పాంజ్ ఐరన్, అల్యూమినియం, ఎరువుల కంపెనీ(యూరియా)లు మినహా ఇతర పరిశ్రమలు ఉన్నాయి. బొగ్గు సరఫరా ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, వినియోగదారులందరికీ సమాన అవకాశాలను కల్పించం కోసమే వేలం విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. ఏప్రిల్ చివరికల్లా వేలానికి సిద్ధం చేస్తామన్నారు.
కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ తమ ఉత్పత్తిలో పావు శాతాన్ని విద్యుత్‌యేతర కంపెనీల కోసం వేలంలో అందుబాటులో ఉంచుతాయని ప్రభుత్వ ప్రకటన వెల్లడించింది. అయితే, కోల్ ఇండియాతో దీర్ఘకాలిక ఒప్పందాలున్న కంపెనీలకు మాత్రం వాటి గడువు పూర్తయ్యేవరకూ సరఫరాలు కొనసాగుతాయని గోయల్ స్పష్టం చేశారు. రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్(ఆర్‌ఈఐఎల్)ను దాని మాతృ సంస్థ ఇన్‌స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ నుంచి విడదీసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్‌ఈ)గా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.