ఇక ‘ముద్రా’ బ్యాంక్..! | Cabinet nod for credit guarantee fund for MUDRA Bank loans | Sakshi
Sakshi News home page

ఇక ‘ముద్రా’ బ్యాంక్..!

Published Thu, Jan 7 2016 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

ఇక ‘ముద్రా’ బ్యాంక్..!

ఇక ‘ముద్రా’ బ్యాంక్..!

ముద్రా(సిడ్బి) బ్యాంకుగా మార్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ముద్రా రుణాలకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఏర్పాటుకు కూడా ఓకే
ఈ బడ్జెట్లో ముద్రా బ్యాంకుకు
రూ.20వేల కోట్లు; ఫండ్‌కు రూ.3వేల కోట్లు!


 న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ).. ముద్రా లిమిటెడ్‌ను ముద్రా బ్యాంకుగా మార్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారి కోసం మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముద్రా(ప్రధాన మంత్రి మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజన కింద రుణాలను అందించే పథకాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే. దీనిద్వారా ఇచ్చే రుణాలకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి కూడా కేబినెట్ ఓకే చేసింది. బుధవారమిక్కడ ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) భేటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
 
 ఇప్పుడున్న ముద్రా లిమిటెడ్... ముద్రా(సిడ్బి) బ్యాంక్‌గా మారుతుందని, ఇది ప్రస్తుతం ఉన్న భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్(సిడ్బి)కి పూర్తిస్థాయి అనుసంబంధ సంస్థగా కొనసాగుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. ముద్రా బ్యాంక్.. రీఫైనాన్స్ కార్యకలాపాలతో పాటు వివిధ సేవలు, పోర్టల్ మేనేజ్‌మెంట్, డేటా విశ్లేషణ వంటివి చేపడుతుందని కూడా వెల్లడించింది.
 
 ముద్రా యోజన కింద సూక్ష్మ, చిన్న వ్యాపార యూనిట్లకు బ్యాంకులు అందించిన రూ.లక్ష కోట్లకు పైబడిన రుణాలకు తొలి దశలో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ కింద ప్రభుత్వం గ్యారంటీని అందిస్తుందని భావిస్తున్నారు. దీనివల్ల ఈ స్కీమ్‌లో ఎదురయ్యే డిఫాల్ట్‌ల (ఎగవేతలు) విషయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిస్కు తగ్గుతుంది.  క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ ముద్రా యూనిట్స్ (సీజీఎఫ్‌ఎంయూ) పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తారు. 2015, ఏప్రిల్ 8 నుంచి ఈ స్కీమ్ కింద మంజూరైన రుణాలన్నిటికీ ప్రభుత్వ గ్యారంటీ వర్తిస్తుంది.
 
 నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ(ఎన్‌సీజీటీసీ)... ఈ సీజీఎఫ్‌ఎంయూకు ట్రస్టీగా వ్యవహరిస్తుంది. రుణ పోర్ట్‌ఫోలియో ఆధారంగా మొత్తం రుణంలో డిఫాల్ట్ అయిన దానిలో గరిష్టంగా 50 శాతం వరకూ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఈ సీజీఎఫ్‌ఎంయూ గ్యారంటీని అందించేందుకు వీలవుతుంది. ప్రతిపాదిత ముద్రా బ్యాం కుకు రూ.20,000 కోట్ల వరకూ రీఫైనాన్స్ మూలనిధి(కార్పస్), క్రెడిట్ గ్యారంటీ ఫండ్‌కు రూ.3,000 కోట్ల మూలనిధిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) బడ్జెట్ నుంచే అందించనున్నారు.
 
 మూడు రకాల రుణాలు...
 పీఎం ముద్రా యోజనలో ప్రస్తుతం శిశు, కిశోర్, తరుణ్ పేర్లతో మూడు రకాల రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఔత్సాహిక చిన్న వ్యాపారవేత్తలు సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకోడానికి రుణ సదుపాయం కల్పించడమే ఈ స్కీమ్ ముఖ్యోద్దేశం. శిశు విభాగంలో రూ.50,000 వరకూ, కిశోర్ విభాగంలో రూ.50,000 పైబడి రూ.5 లక్షల వరకూ రుణాలు లభిస్తాయి. ఇక తరుణ విభాగంలో రూ.5 లక్షలపైన, రూ. 10 లక్షల వరకూ రుణ సదుపాయం ఉంటుంది.
 
 విదేశీ సంస్థలతో ఒప్పందాలకు ఓకే...
 వివిధ దేశాల ప్రభుత్వ సంస్థలతో కార్పొరేట్ వ్యవహారాల శాఖ(ఎంసీఏ), కాంపిటీషన్ కమిషన్(సీసీఐ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) కుదుర్చుకున్న ఒప్పందాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిద్వారా మేధోపరమైన, సమాచార మార్పిడి, సాంకేతిక భాగస్వామ్యం, అనుభవాలను పంచుకోవడం ఇతరత్రా అంశాల్లో కుదిరిన మొత్తం 8 ఒప్పం దాలు అమల్లోకి రానున్నాయి.
 
  నెదర్లాండ్స్ ఆర్థిక శాఖ వ్యవహారాల శాఖతో ఎంసీఏ కుదుర్చుకున్న ఎంఓయూ, రష్యా ఫెడరల్ యాంటీ-మోనోపోలీ సర్వీస్, ఈయూ డెరైక్టరేట్ జనరల్ ఫర్ కాంపిటీషన్, కెనడా కాంపిటీషన్ కమిషన్‌తో సీసీఐ చేసుకున్న ఒప్పందం వంటివి ఇందులో ఉన్నాయి. అదేవిధంగా అసంఘటిత రంగంలోని కార్మికులు, యూనిట్లను సంఘటిత ఆర్థిక వ్యవస్థలోకి చేర్చేందుకు వీలుగా అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) ప్రతిపాదించిన సిఫార్సులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

 మూడు హెచ్‌ఎంటీ యూనిట్ల మూసివేత...
 ప్రభుత్వ రంగ హెచ్‌ఎంటీ లిమిటెడ్‌కు చెందిన మూడు నష్టజాతక యూనిట్లను మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది. 2007 వేతన స్కేల్స్ ప్రకారం సంబంధిత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) అందించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూసివేతకు ప్రతిపాదించిన యూనిట్లలో హెచ్‌ఎంటీ వాచెస్, హెచ్‌ఎంటీ చినార్ వాచెస్, హెచ్‌ఎంటీ బేరింగ్స్ ఉన్నాయి. ఈ మూడూ హెచ్‌ఎంటీ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థలుగా కొనసాగుతున్నాయి.

ఈ మూడింటికీ రూ.427.48 కోట్ల నగదు సాయాన్ని అందించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వీటిలోని దాదాపు 1,000 మంది ఉద్యోగులకు ఇప్పటివరకూ ఇవ్వాల్సిన బకాయిలతో పాటు ఆకర్షణీయమైన వీఆర్‌ఎస్/వీఎస్‌ఎస్‌ను కల్పించడం ద్వారా హెచ్‌ఎంటీ నుంచి విడదీసి ఆ తర్వాత మూడు యూనిట్లను మూసివేయనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన అధికార ప్రకటన పేర్కొంది. ప్రభుత్వ విధానాన్ని అనుసరించి వీటికున్న స్థిర, చరాస్తుల విక్రయం జరుగుతుందని కూడా తెలిపింది. మొత్తం 31 కేంద్ర పీఎస్‌యూల్లో 12 మాత్రమే ప్రస్తుతం లాభాలతో నడుస్తున్నాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement