రిలయన్స్‌కు అనుమతులపై కాగ్ ఫైర్
చమురు శాఖ, డీజీహెచ్‌లకు అక్షింతలు..
నిల్వలను సరిగ్గా నిర్ధారించకుండానే అనుమతులిచ్చారని ఆక్షేపణ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు కేజీ- డీ6 క్షేత్రాల విషయంలో అడ్డగోలుగా అనుమతులిచ్చారంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) మరోసారి తేనెతుట్టెను కదిపింది. బ్లాక్‌లో చమురు-గ్యాస్ నిల్వల నిర్ధారణకు కంపెనీ సరైన చర్యలు పాటించనప్పటికీ పెట్రోలియం శాఖ, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) అనుమతులు మంజూరు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. 2002 అక్టోబర్‌లో ఆర్‌ఐఎల్ ఇక్కడి డీ1, డీ3 ప్రధాన క్షేత్రాల్లో గ్యాస్ నిక్షేపాలను కనుగొంది. అయితే, 2003 ఏప్రిల్- 2004 మార్చి మధ్య ఈ క్షేత్రాల అభివృద్ధి వాణిజ్యపరంగా లాభసాటేనని వెల్లడించింది. 8.3 లక్షల ఘనపుటడుగుల(టీసీఎఫ్) గ్యాస్ నిల్వలు ఉన్నట్లు 2004 మే నెలలో తెలిపింది. అయితే, ఈ రెండు క్షేత్రాల్లో డీజీహెచ్ ఆమోదించిన 2.47 బిలియన్ డాలర్ల తొలి క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక(ఎఫ్‌డీపీ)లో మాత్రం నిల్వల అంచనా 5.47 టీసీఎఫ్‌లకు తగ్గిపోయిందని కాగ్ తన డ్రాఫ్ట్ ఆడిట్ నివేదికలో పేర్కొంది.
ఇష్టానుసారంగా మార్పులు...
2006 అక్టోబర్‌లో ఇక్కడ తొలిసారిగా గ్యాస్‌ను బయటికితీసేనాటికి వెలికితీయగలిగిన(రికవరబుల్) నిల్వల పరిమాణం 3.81 టీసీఎఫ్‌లుగా మాత్రమే చూపించారు. అదే ఏడాది అక్టోబర్‌లో ఆర్‌ఐఎల్ సవరించిన ఎఫ్‌డీపీని సమర్పించింది. దీనిలో నిక్షేపాల పరిమాణం 14.164 టీసీఎఫ్‌లుగా, రికవరబుల్ నిల్వల మొత్తం 12.04 టీసీఎఫ్‌లుగా పేర్కొంటూ క్షేత్రాల అభివృద్ధి వ్యయాన్ని భారీ స్థాయిలో 8.8 బిలియన్ డాలర్లకు పెంచేయడం గమనార్హం. చమురు శాఖ, డీజీహెచ్ అధికారులతోకూడిన మేనేజ్‌మెంట్ కమిటీ... 2006 డిసెంబర్‌లో ఈ సవరించిన ప్రణాళికకు ఆమోదం తెలిపింది. రికవరబుల్ నిల్వలు 10.03 టీసీఎఫ్‌గా, ఉత్పత్తి అంచనాలను రెట్టింపుస్థాయిలో రోజుకు 80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంసీఎండీ) చొప్పున ఇందులో పేర్కొన్నారు. అయితే, 2009 ఏప్రిల్‌లో డీ1, డీ3 క్షేత్రాల్లో ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ప్రణాళికల్లో పేర్కొన్న విధంగా నిల్వలు లేవన్న విషయం బయటపడింది. గ్యాస్ ఉత్పత్తి ఘోరంగా పడిపోయి...ప్రస్తుతం సుమారు 10 ఎంసీఎండీల స్థాయికి దిగజారింది. దీంతో ఆర్‌ఐఎల్, దాని కొత్త భాగస్వామ్య సంస్థ బ్రిటిష్ పెట్రోలియంలు నిల్వల పరిమాణాన్ని 2.9 టీసీఎఫ్‌లకు కుదించాయి. ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు ప్రకారం కాంట్రాక్టర్(రిలయన్స్) నిక్షేపాలను మరోసారి లెక్కగట్టాలంటే తగిన నిర్ధారణ విధానాలను చేపట్టాల్సి ఉంటుందని, ఇవేమీ లేకుండానే అనుమతులు మం జూరు అయిపోయాయని కాగ్ తన నివేదికలో తేల్చిచెప్పింది.
రిలయన్స్ నేరుగా గ్యాస్‌ను కనుగొన్న(డిస్కవరీ) స్థాయి నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తి దశకు వెళ్లిపోయిందని, సరైన నిర్ధారణ పద్ధతులు చేపట్టివుంటే గ్యాస్ రిజర్వాయర్ వాస్తవ స్వరూపం... రికవరబుల్ నిల్వల అసలు పరిమాణం ఎంత అనేది వెల్లడయ్యేదని కాగ్ పేర్కొం ది. ఇవన్నీ జరగకుండానే రిలయన్స్ ప్రణాళికలకు డీజీహెచ్ ఎలా అమోదముద్రవేసిందో అర్ధం కావడంలేదని పేర్కొంది. పనితీరు ఆడిట్ నివేదికను ఖరారు చేయాలంటే ఈ డ్రాఫ్ట్‌నివేదికపై అభిప్రాయలను తెలియజేయాలని చమురు శాఖకు కాగ్ సూచించింది.