controller and auditor general
-
కాగ్ రిపోర్టు మంట... ఆప్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగ్ రిపోర్టు జాప్యం చేస్తున్నందుకు ఆప్ సర్కార్‌పై మండిపడింది. ఈ క్రమంలో ఆప్ నిజాయితీపై ప్రశ్నించింది. మద్యం కుంభకోణంపై ఇప్పటికే కాగ్ నివేదికను స్పీకర్‌కు పంపించి ఉంటే సభలో చర్చను ప్రారంభించి ఉండాలి అని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో, ఈ విషయంపై సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పూర్తి విచారణ జరుపనుంది.ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ సర్కార్‌కు కాగ్ నివేదిక దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానంలో ఆప్ అవకతవకలపై చర్చను కాగ్ తెరపైకి తీసుకువచ్చింది. ఢిల్లీ మద్యం విధానం లోపభూయిష్టంగా ఉందని, పాలసీ అమలులో పారదర్శకత లేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఈ విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ఇదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు 2026 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని కాగ్ అంచనా వేసింది. అయితే, కాగ్ నివేదిక అధికారికంగా ఇంకా బయటకు రాకపోయినప్పటికీ, ఆ నివేదికలోని కొన్ని అంశాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి.ఈ నేపథ్యంలో కాగ్ నివేదికను బహిర్గతం చేయాలని హైకోర్టు ఇప్పటికే ఆప్ సర్కార్‌ను ఆదేశించింది. కానీ, హైకోర్టు ఆదేశాలను ఆప్ సర్కార్ బేఖాతరు చేసింది. ఇప్పటికీ కాగ్ నివేదికను బయటకు ఇవ్వలేదు. దీంతో, కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాగ్ నివేదిక లీక్ కావడంతో అధికార ఆప్ పార్టీ తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులకు చెబుతున్నారు.Delhi High Court criticised the Delhi Government for its delay in addressing the CAG reports, stating, "The way you have dragged your feet raises doubts about your bona fides." The court further emphasized, "You should have promptly forwarded the reports to the Speaker and… pic.twitter.com/CSSALuCV0G— ANI (@ANI) January 13, 2025 కాగ్ నివేదికలో ఏముంది? లీక్ అయిన కాగ్ నివేదిక ప్రకారం.. 2021 నవంబర్‌లో అమల్లోకి తెచ్చిన పాలసీని తొలుత కేబినెట్ నుంచి గానీ, ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ నుంచిగానీ అనుమతి తీసుకోలేదు. మద్యం విక్రయం లైసెన్సులు పొందిన లిక్కర్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, గత చరిత్ర, పూర్వాపరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థలకూ లైసెన్సులు మంజూరుచేశారు. కొన్నింటికి లైసెన్సులను ఉద్దేశపూర్వకంగా పునరుద్ధరించారు. కీలక నిబంధనలను మార్చే సందర్భాల్లో ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. కొందరు రిటైలర్లు ఆ విధానం ముగియకముందే తమ లైసెన్సులను ప్రభుత్వానికి సమర్పించి వెనుతిరిగారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవకపోవడంతో ప్రభుత్వం రూ. 890 కోట్ల ఆదా యం నష్టపోయింది.జోనల్ లైసెన్సుల్లో మినహాయింపులు ఇవ్వడంతో మరో రూ.941 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. కోవిడ్‌ను సాకుగా చూపి కొందరికి లైసెన్స్ ఫీజులను మాఫీచేయడంతో మరో రూ.144 కోట్ల ఆదాయం కోల్పోయింది. కోవిడ్ వంటి అనూహ్య పరిస్థితులు తలెత్తితే ఆ నష్టాలను వ్యాపారులే భరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. నష్టాలను చవిచూసేందుకే మొగ్గుచూపింది అని ఉండటం గమనార్హం. -
కొత్త విభాగాల్లోకీ ఆడిట్ విస్తరణ
పంజిమ్: కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కొత్త విభాగాల్లోనూ ఆడిటింగ్‌ను పరిశీలిస్తోంది. నీడి అడుగున వెలికితీత కార్యకలాపాలకు సంబంధించి కూడా ఆడిటింగ్ చేయనున్నట్టు, మరిన్ని నివేదికలను విడుదల చేయాలని అనుకుంటున్నట్టు కాగ్ గిరీష్ చంద్ర ముర్ము చెప్పారు. జీ20 దేశాలతో కూడిన ఎస్ఐ20 మూడు రోజుల సమావేశం ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో కాగ్ గిరీష్ చంద్ర మాట్లాడారు. డేటా ప్రామాణీకరణ అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. దీనివల్ల ఆడిట్లను మరింత సులభంగా, వేగంగా చేయవచ్చన్నారు. ఇందుకు సంబంధించి ఆయా విభాగాలు, శాఖలతో సమావేశం కూడా నిర్వహించినట్టు చెప్పారు. ‘‘కొంత వరకు డేటా ప్రామాణీకరణ పట్ల అంగీకారం కుదిరింది. గతేడాదే పదేళ్ల రికార్డును అధిగమించాం. ఆడిట్ నివేదికలను మరిన్ని విడుదల చేస్తాం. డేటా ప్రాసెసింగ్, నివేదిక రూపకల్పన మరింత వేగాన్ని అందుకుంటుంది. నివేదికల రూపకల్పనలో పూర్తి స్థాయి డిజిటలైజేషన్‌ను (డిజిటల్ ఆడిట్లు) వినియోగించుకుంటాం’’అని గిరీష్ చంద్ర తెలిపారు. కాగ్ ఈ ఏడాది నుంచే డిటజిటల్ ఆడిట్ల విడుదలను ప్రారంభించడం గమనార్హం. వివిధ శాఖల పరిధిలో నిధుల కేటాయింపులు, వినియోగం పద్దులపై కాగ్ ఆడిటింగ్ చేసి, పార్లమెంటు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల ముందు నివేదికలను ఉంచుంతుంది. షిప్పింగ్, నీటి అడుగు నుంచి వెలికితీసే ఆయిల్ అండ్ గ్యాస్ తదితర నూతన విభాగాల్లోనూ ఆడిట్ చేయాలన్నది తమ ఉద్దేశమ్యని గిరీష్ చంద్ర చెప్పారు. కాగా, బ్లూ ఎకానమీ (సముద్రం ఆధారిత) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై ఈ సమావేశం చర్చించింది. -
‘అష్ట’కష్టాల్లో ఐఐటీలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 2008–09లో ఏర్పాటు చేసిన 8 ఐఐటీల్లో సమస్యలు తిష్టవేశాయని కాగ్ నివేదిక వెల్లడించింది. పరిపాలన, మౌలిక వసతుల కల్పన సహా పనితీరులో అనుకున్న మేర ఫలితాలను ఈ విద్యా సంస్థలు రాబట్టడం లేదని తెలిపింది. విద్యార్థులకు సరిపడా అధ్యాపకులు లేకపోవడం, పరిశోధన పత్రాల ప్రచురణలో వెనకబాటుతనం.. పీజీ, పీహెచ్డీ లాంటి కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం లాంటివి ఐఐటీల్లో డొల్లతనం బయటపెడుతున్నాయని చెప్పింది. ఐఐటీ హైదరాబాద్ సహా భువనేశ్వర్, గాంధీనగర్, ఇండోర్, జోధ్‌పూర్, మండి, పాట్నా, రోపార్‌లలోని 8 ఐఐటీల్లో 2014–19 మధ్య కార్యకలాపాలను కాగ్ పరిశీలించింది. తమ పరిశీలన నివేదికను ఇటీవలే ముగిసిన శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటుకు సమర్పించింది. 2008–09లో 8 ఐఐటీల స్థాపనకు రూ.6,080 కోట్లు ప్రతిపాదిస్తే 2019లో అవి పూర్తయ్యేనాటికి సవరించిన అంచనా వ్యయం రూ. 14,332 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఇందులో హైదరాబాద్ ఐఐటీ అంచనా వ్యయం రూ.760 కోట్ల నుంచి రూ.2,092 కోట్లకు చేరిందని వెల్లడించింది. 5 నుంచి 36 శాతం అధ్యాపకుల ఖాళీలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్య 1:10 నిష్పత్తిలో ఉండాల్సి ఉండగా హైదరాబాద్ ఐఐటీలో 2018–19 ఏడాదిలో 23 శాతం అధ్యాపకుల కొరత ఉందని కాగ్ నివేదిక పేర్కొంది. 2,572 మంది విద్యార్థులకు 257 మంది అధ్యాపకులు ఉండాలని, కానీ 197 మందే ఉన్నారని నివేదికలో తేల్చింది. ప్రతి ఏటా కొత్తగా అధ్యాపకులను తీసుకుంటున్నా 7 ఐఐటీల్లో 5 నుంచి 36 శాతం మేర ఖాళీలున్నాయంది. విద్యా నాణ్యతపై ఇది ప్రభావం చూపిందని తెలిపింది. అధ్యాపకుల స్థానాలకు తగినంత మంది అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం, పరిమిత మౌలిక సదుపాయాల వల్ల కొంతమంది విద్యార్థుల ఇన్‌టేక్ కెపాసిటీని పెంచలేకపోయారని వివరించింది. హైదరాబాద్ ఐఐటీలో ప్లేస్‌మెంట్స్ 63 శాతమే ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్లేస్మెంట్ అనేది ర్యాంకింగ్ కొలమానాల్లో ఒకటని, అయితే హైదరాబాద్ ఐఐటీలో 2014–19 వరకు విద్యార్థుల ప్లేస్మెంట్ శాతం కేవలం 63గానే ఉందని కాగ్ వివరించింది. 95 శాతం ప్లేస్‌మెంట్స్ ఇండోర్, 84 శాతం ప్లేస్‌మెంట్స్‌తో భువనేశ్వర్ ఐఐటీ రెండో స్థానంలో ఉన్నాయని తెలిపింది. 8 ఐఐటీల్లో హైదరాబాద్ చివరన ఉందని చెప్పింది. 2014–19 మధ్య కాలంలో పీజీ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నమోదు శాతం హైదరాబాద్ ఐఐటీలో చాలా తక్కువగా ఉందని కాగ్ వెల్లడించింది. ఎస్సీల్లో 25 శాతం, ఎస్టీల్లో 34 శాతం మంది పీజీ కోర్సుల్లో చేరలేదంది. పీహెచ్డీ కోర్సుల్లోనైతే ఎస్టీల్లో 73 శాతం, ఎస్సీల్లో 25 శాతం మందే చేరారని చెప్పింది. పేటెంట్లలో హైదరాబాద్ ఐఐటీ టాప్ ఆవిష్కరణలకు పేటెంట్లు సాధించడంలో మాత్రం హైదరాబాద్ ఐఐటీ ముందు వరుసలో ఉందని కాగ్ వివరించింది. 2014–19 మధ్య 94 ఆవిష్కరణల పేటెంట్లకు దరఖాస్తు చేసుకుంటే ఏకంగా 16 ఆవిష్కరణలకు పేటెంట్లు దక్కించుకుందని చెప్పింది. ఐఐటీ జో«ధ్‌పూర్ 4, ఐఐటీ రోపార్ 2 ఆవిష్కరణలకు పేటెంట్లు దక్కించుకున్నాయని వెల్లడించింది. కాగ్ ఏం సూచించిందంటే.. ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం, అధ్యాపకుల కొరత తీర్చేలా కేంద్రం చర్యలు చేపట్టాలని కాగ్ సూచించింది. కొత్త బోధన విధానాలు, సమయోచిత కోర్సుల పరిచయం, ఉన్నత విద్యా ప్రమాణాలను పాటిస్తే ఐఐటీలను మానవ వనరుల అవసరాలను తీర్చేందుకు వీలుగా అభివృద్ధి చేయవచ్చని వివరించింది. ఐఐటీలు ప్రచురించిన పేపర్లు, పొందిన పేటెంట్ల ద్వారా ప్రభుత్వేతర వనరుల నుండి నిధులను ఆకర్షించి పరిశోధనలపై మరింత దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలంది. ఐఐటీల కార్యకలాపాలపై గవర్నింగ్ బాడీలు పర్యవేక్షణ పెంచాలని, తరుచుగా భేటీ అవుతూ మంచి ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
బాబు హయాంలో అప్పుల తప్పులు: కాగ్ నివేదిక
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా ఇతర అవసరాలకు వినియోగించింది. దీంతో అప్పులు పెరిగిపోయాయి తప్ప ఆస్తుల కల్పన తగ్గిపోయింది. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఎత్తిచూపింది. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు ప్రభుత్వం చేసిన అప్పుల్లో ఆస్తుల కల్పనకు ఎంత వ్యయం చేసిందనే వివరాలను కాగ్ నివేదిక వెల్లడించింది. చదవండి: (చంద్రబాబు, రేవంత్ నుంచి ప్రాణహాని) చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అప్పులు చేయడం వాటిని ఆస్తుల కల్పనకు కాకుండా ఇతర రంగాలకు మళ్లించిన విషయాన్ని సాక్షి గతంలోనే పాఠకులకు తెలియజేసింది. ఇప్పుడు కాగ్ కూడా తన నివేదికలో ఈ విషయాన్ని నిర్ధారించింది. 2014–15లో అయితే చేసిన అప్పుల్లో సగం కూడా ఆస్తుల కల్పనకు వ్యయం చేయలేదని స్పష్టం చేసింది. కాగ్ వెల్లడించిన మేరకు చంద్రబాబు ప్రభుత్వం అప్పులు, ఆస్తుల కల్పన వ్యయం ఇలా ఉంది. -
పార్లమెంట్లో నేడు రఫేల్‌పై కాగ్ నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై కాగ్ నివేదికను ప్రభుత్వం నేడు పార్లమెంట్ ముందుంచనుంది. ఫ్రాన్స్ కంపెనీ దాసాల్ట్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పాలక, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. ప్రస్తుత లోక్‌సభ సమావేశాలు బుధవారంతో ముగియనుండటంతో దీనికి కేవలం ఒకరోజు ముందు రఫేల్‌పై కాగ్ నివేదికను ప్రభుత్వం పార్లమెంట్లో సమర్పించనుండటం గమనార్హం. రఫేల్ ఒప్పందంపై కాగ్ నివేదిక పార్లమెంట్లో ప్రభుత్వం సమర్పించనున్న క్రమంలో మరోసారి రఫేల్ ప్రకంపనలు చట్టసభను కుదిపేయనున్నాయి. మరోవైపు రఫేల్ ఒప్పందం జరిగిన సమయంలో ఆర్థిక కార్యదర్శిగా ఉన్న ప్రస్తుత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహర్షి ఈ ఒప్పందంపై ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ఆరోపించడం మరో వివాదానికి తెరలేపింది. కాగా కపిల్ సిబల్ ఆరోపణలను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. వ్యవస్ధలను నీరుగార్చే ఇలాంటి విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఇక రఫేల్‌పై కాగ్ నివేదిక పార్లమెంట్లో మరిన్ని ప్రకంపనలకు దారితీస్తుందని భావిస్తున్నారు. -
రఫేల్‌పై రేపు పార్లమెంట్ ముందుకు కాగ్ నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయంగా పెనుదుమారం రేపుతున్న రఫేల్ ఒప్పందంపై కాగ్ నివేదికను ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ ముందుంచనుంది. ఫ్రాన్స్ కంపెనీ దాసాల్ట్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పాలక, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. ప్రస్తుత లోక్‌సభ సమావేశాలు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఒక్కరోజు ముందు రఫేల్‌పై కాగ్ నివేదికను ప్రభుత్వం పార్లమెంట్లో సమర్పించనుండటం గమనార్హం. మరోవైపు రఫేల్ ఒప్పందం జరిగిన సమయంలో ఆర్థిక కార్యదర్శిగా ఉన్న ప్రస్తుత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహర్షి ఈ ఒప్పందంపై ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ఆరోపించడం మరో వివాదానికి తెరలేపింది. కాగా కపిల్ సిబల్ ఆరోపణలను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. వ్యవస్ధలను నీరుగార్చే ఇలాంటి విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఇక రఫేల్‌పై కాగ్ నివేదిక పార్లమెంట్లో మరిన్ని ప్రకంపనలకు దారితీస్తుందని భావిస్తున్నారు. -
పార్లమెంట్ ముందుకు రఫేల్‌పై కాగ్ నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రఫేల్ ఒప్పందంపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదకను ప్రభుత్వం సభ ముందుంచవచ్చని భావిస్తున్నారు. రఫేల్ ఒప్పందంతో పాటు పలు రక్షణ ఒప్పందాలపై కాగ్ లేవెనెత్తిన పలు ప్రశ్నలకు ఇప్పటికే ప్రభుత్వం సమాధానాలు ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాలన్నింటినీ కాగ్‌కు అందుబాటులో ఉంచామని గత నెలలో రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై కాగ్ నివేదిక కోసం వేచిచూస్తున్నామని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రఫేల్ సహా రక్షణ ఒప్పందాలపై కాగ్ నివేదికను పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం బహిర్గతం చేయవచ్చని అధికార వర్గాలు సంకేతాలు పంపాయి. కాగా, రఫేల్ ఒప్పందంపై ఇప్పటికే కాంగ్రెస్ సహా విపక్షాలు మోదీ సర్కార్‌ను ఇరుకునపెడుతున్న క్రమంలో ఈ వ్యవహారంపై కాగ్ నివేదిక పార్లమెంట్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
జీఎస్టీపై కాగ్ ఆడిట్
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పనితీరుపై కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఆడిట్ నిర్వహించనుంది. దీనికిగానూ జీఎస్టీ అమల్లోకి వచ్చిన నాటి (2017 జూలై 1) నుంచి దాని పనితీరుపై పోస్ట్‌మార్టమ్ నిర్వహించనుంది. దీనిపై తుది నివేదికను త్వరలో రూపొందించనుంది. డిసెంబర్ 11 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ నివేదికను ప్రవేశపెట్టాలని కాగ్ యోచిస్తోంది. జీఎస్టీ పనితీరు సహా విధివిధానాలను పరిశీలించేందుకు కాగ్ బృందాలు పలు ప్రధాన రాష్ట్రాల్లోని జీఎస్టీ కమిషనరేట్లను ఇప్పటికే సందర్శించాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
రిలయన్స్‌కు అనుమతులపై కాగ్ ఫైర్
చమురు శాఖ, డీజీహెచ్లకు అక్షింతలు.. నిల్వలను సరిగ్గా నిర్ధారించకుండానే అనుమతులిచ్చారని ఆక్షేపణ న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు కేజీ- డీ6 క్షేత్రాల విషయంలో అడ్డగోలుగా అనుమతులిచ్చారంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) మరోసారి తేనెతుట్టెను కదిపింది. బ్లాక్‌లో చమురు-గ్యాస్ నిల్వల నిర్ధారణకు కంపెనీ సరైన చర్యలు పాటించనప్పటికీ పెట్రోలియం శాఖ, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) అనుమతులు మంజూరు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. 2002 అక్టోబర్‌లో ఆర్ఐఎల్ ఇక్కడి డీ1, డీ3 ప్రధాన క్షేత్రాల్లో గ్యాస్ నిక్షేపాలను కనుగొంది. అయితే, 2003 ఏప్రిల్- 2004 మార్చి మధ్య ఈ క్షేత్రాల అభివృద్ధి వాణిజ్యపరంగా లాభసాటేనని వెల్లడించింది. 8.3 లక్షల ఘనపుటడుగుల(టీసీఎఫ్) గ్యాస్ నిల్వలు ఉన్నట్లు 2004 మే నెలలో తెలిపింది. అయితే, ఈ రెండు క్షేత్రాల్లో డీజీహెచ్ ఆమోదించిన 2.47 బిలియన్ డాలర్ల తొలి క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక(ఎఫ్డీపీ)లో మాత్రం నిల్వల అంచనా 5.47 టీసీఎఫ్లకు తగ్గిపోయిందని కాగ్ తన డ్రాఫ్ట్ ఆడిట్ నివేదికలో పేర్కొంది. ఇష్టానుసారంగా మార్పులు... 2006 అక్టోబర్‌లో ఇక్కడ తొలిసారిగా గ్యాస్‌ను బయటికితీసేనాటికి వెలికితీయగలిగిన(రికవరబుల్) నిల్వల పరిమాణం 3.81 టీసీఎఫ్లుగా మాత్రమే చూపించారు. అదే ఏడాది అక్టోబర్‌లో ఆర్ఐఎల్ సవరించిన ఎఫ్డీపీని సమర్పించింది. దీనిలో నిక్షేపాల పరిమాణం 14.164 టీసీఎఫ్లుగా, రికవరబుల్ నిల్వల మొత్తం 12.04 టీసీఎఫ్లుగా పేర్కొంటూ క్షేత్రాల అభివృద్ధి వ్యయాన్ని భారీ స్థాయిలో 8.8 బిలియన్ డాలర్లకు పెంచేయడం గమనార్హం. చమురు శాఖ, డీజీహెచ్ అధికారులతోకూడిన మేనేజ్మెంట్ కమిటీ... 2006 డిసెంబర్లో ఈ సవరించిన ప్రణాళికకు ఆమోదం తెలిపింది. రికవరబుల్ నిల్వలు 10.03 టీసీఎఫ్గా, ఉత్పత్తి అంచనాలను రెట్టింపుస్థాయిలో రోజుకు 80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంసీఎండీ) చొప్పున ఇందులో పేర్కొన్నారు. అయితే, 2009 ఏప్రిల్‌లో డీ1, డీ3 క్షేత్రాల్లో ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ప్రణాళికల్లో పేర్కొన్న విధంగా నిల్వలు లేవన్న విషయం బయటపడింది. గ్యాస్ ఉత్పత్తి ఘోరంగా పడిపోయి...ప్రస్తుతం సుమారు 10 ఎంసీఎండీల స్థాయికి దిగజారింది. దీంతో ఆర్ఐఎల్, దాని కొత్త భాగస్వామ్య సంస్థ బ్రిటిష్ పెట్రోలియంలు నిల్వల పరిమాణాన్ని 2.9 టీసీఎఫ్లకు కుదించాయి. ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు ప్రకారం కాంట్రాక్టర్(రిలయన్స్) నిక్షేపాలను మరోసారి లెక్కగట్టాలంటే తగిన నిర్ధారణ విధానాలను చేపట్టాల్సి ఉంటుందని, ఇవేమీ లేకుండానే అనుమతులు మం జూరు అయిపోయాయని కాగ్ తన నివేదికలో తేల్చిచెప్పింది. రిలయన్స్ నేరుగా గ్యాస్‌ను కనుగొన్న(డిస్కవరీ) స్థాయి నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తి దశకు వెళ్లిపోయిందని, సరైన నిర్ధారణ పద్ధతులు చేపట్టివుంటే గ్యాస్ రిజర్వాయర్ వాస్తవ స్వరూపం... రికవరబుల్ నిల్వల అసలు పరిమాణం ఎంత అనేది వెల్లడయ్యేదని కాగ్ పేర్కొం ది. ఇవన్నీ జరగకుండానే రిలయన్స్ ప్రణాళికలకు డీజీహెచ్ ఎలా అమోదముద్రవేసిందో అర్ధం కావడంలేదని పేర్కొంది. పనితీరు ఆడిట్ నివేదికను ఖరారు చేయాలంటే ఈ డ్రాఫ్ట్నివేదికపై అభిప్రాయలను తెలియజేయాలని చమురు శాఖకు కాగ్ సూచించింది.