సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లో చేపట్టే 5జీ నెట్‌వర్క్ ప్రక్రియలో హువాయి, జడ్‌టీఈ కార్పొరేషన్‌లు పాల్గొనకుండా నిషేధించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అఖిలభారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ఈ మేరకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశాయి. భద్రతా కారణాల దృష్ట్యా హువాయి, జడ్‌టీఈలను 5జీ నెట్‌వర్క్‌లో పాల్గొనేందుకు అనుమతించరాదని మంత్రికి రాసిన లేఖలో సీఏఐటీ విజ్ఞప్తి చేసింది. ఈ చైనా కంపెనీలపై అంతర్జాతీయంగా గూఢచర్యం, కుట్ర, మనీల్యాండరింగ్ వంటి పలు నేరారోపణలు నమోదయ్యాయని పేర్కొంది.
గల్వాన్ ఘటన అనంతరం చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భార్టియా ప్రశంసించారు. 59 చైనా యాప్‌లను నిషేధించడం.. చైనా కంపెనీలకు అప్పగించిన హైవే, మెట్రో, రైల్వే కాంట్రాక్టులను రద్దు చేయడం వంటి చర్యలను స్వాగతించారు. జూన్ 10న తాము చేపట్టిన బాయ్‌కాట్ చైనా ప్రచారానికి అనుగుణంగా జాతి మనోభావాలకు అద్దంపడుతూ ప్రభుత్వం సముచిత చర్యలు చేపట్టిందని అన్నారు. చైనాకు గట్టి సందేశం పంపేలా భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌లో పాల్గొనకుండా హువాయి, జడ్‌టీఈ కార్పొరేషన్‌లను నిషేధించాలని భార్టియా కోరారు. అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల్లో ఈ కంపెనీల భాగస్వామ్యాన్ని అనుమతించడం లేదని భారత్‌లోనూ వాటిని అనుమతించరాదని స్పష్టం చేశారు. చదవండి : చైనాకు షాక్ : 4500 గేమ్స్ తొలగింపు
Comments
Please login to add a commentAdd a comment