
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న స్పెయిన్‌కు చెందిన కెమో గ్రూప్ భారత్‌లో తొలి ప్లాంటును హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటులో ట్యాబ్లెట్లు, క్యాప్లెట్లు, పెల్లెట్ల వంటి ఓరల్ సాలిడ్ డోసేజ్ ఉత్పత్తులు తయారు చేసి విదేశాలకు ఎగమతి చేస్తారు. శామీర్‌పేట సమీపంలోని జీనోమ్ వ్యాలీలో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ ప్లాంటు కోసం కంపెనీ రూ.100 కోట్లు వెచ్చించింది.
మూడు దశలు పూర్తి అయ్యేనాటికి ప్లాంటు రెండింతల విస్తీర్ణానికి చేరుతుందని కెమో ఇండియా ఫార్ములేషన్స్ ఎండీ కుమార్ కురుమద్దాలి బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. మొత్తం పెట్టుబడి రూ.400–500 కోట్లు ఉండొచ్చని పేర్కొన్నారు. ఉద్యోగుల సంఖ్య 350కి పెరుగుతుందని చెప్పారాయన. ప్రపంచవ్యాప్తంగా తమ గ్రూప్ ఈ ఏడాది ఇప్పటికే నాలుగు ప్లాంట్లు ప్రారంభించిందని ఇండస్ట్రియల్ బిజినెస్ ఎండీ లుకాస్ సిగ్మన్ వెల్లడించారు. ప్రతిభావంతులు ఇక్కడ ఉన్నారనే కారణంతోనే భారత్‌లో ప్లాంటును నెలకొల్పామని చెప్పారు. కెమో గ్రూప్‌నకు ప్రపంచవ్యాప్తంగా 15 ప్లాంట్లు, 10 ఆర్‌అండ్‌డీ కేంద్రాలు, 33 అనుబంధ కంపెనీలు ఉన్నాయి. 96 దేశాల్లోని 1,150 కంపెనీలకు ఫార్మా ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.