గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాల ఆధారంగా గృహ రుణ సంస్థ కేన్ ఫిన్ హోమ్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో భారీ నష్టాలు ప్రకటించడంతో ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి కేన్ ఫిన్ హోమ్స్ కౌంటర్ లాభాలతో సందడి చేస్తుంటే.. టాటా మోటార్స్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం..
కేన్ ఫిన్ హోమ్స్
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కేన్ ఫిన్ హోమ్స్ నికర లాభం 36 శాతం పెరిగి రూ. 91 కోట్లకు చేరింది. ఇందుకు వడ్డీ ఆదాయం సహకరించగా.. నికర వడ్డీ ఆదాయం 35 శాతం ఎగసి రూ. 186 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.29 శాతం నుంచి 3.52 శాతానికి బలపడ్డాయి. ఈ కాలంలో స్థూల మొండి బకాయిలు 0.8 శాతం నుంచి 0.76 శాతానికి తగ్గినట్లు కేన్ ఫిన్ హోమ్స్ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో కేన్ ఫిన్ హోమ్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 8 శాతం దూసుకెళ్లి రూ. 327 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 339 వరకూ ఎగసింది.
టాటా మోటార్స్
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ రూ. 9,894 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ.1,117 కోట్ల నికర లాభం ఆర్జించింది. తాజా క్వార్టర్‌లో నికర అమ్మకాలు 28 శాతం క్షీణించి రూ. 61,949 కోట్లకు చేరాయి. ఈ కాలంలో రూ. 9313 కోట్లమేర పన్నుకు ముందు నష్టం నమోదైంది. అంతక్రితం క్యూ4లో రూ. 1265 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4.25 శాతం పతనమై రూ. 96 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment