టెకీలకు శుభవార్త: ఆ కంపెనీ 20వేల ఉద్యోగాలు
బెంగళూరు : ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాల నియామకంపై నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ బహుళ జాతీయ కంపెనీ క్యాప్‌జెమిని గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. ఈ ఏడాది భారత్‌లో 20వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. అంతేకాక ఆటోమేషన్ ప్రభావం ప్రస్తుత ఉద్యోగులపై పడకుండా ఉండేందుకు మే నెల వరకు ఈ కంపెనీ 45 వేల మందికి రీస్కిల్ చేపట్టింది. ఈ ఫ్రెంచ్ ఐటీ సర్వీసు కన్సల్టెంట్ గతేడాది 33వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. 51వేల మందికి రీస్కిల్ చేపట్టింది. తాము ఎక్కువమొత్తంలో పెట్టుబడులను ట్రైనింగ్ ప్రొగ్రామ్స్ అభివృద్ధి కోసం పెడుతున్నామని క్యాప్‌జెమిని ఆటోమేషన్, ఇండస్ట్రియలైజేషన్ హెడ్ క్రిస్టోఫర్ స్టాన్కోమ్బ్ చెప్పారు. తమ వర్క్‌ఫోర్స్‌లో ఎక్కువ అవకాశాలు ఆటోమేషన్, ఇంటిగ్రేషన్ ఆటోమేషన్ కల్పిస్తుండటంతో ట్రైనింగ్ ప్రొగ్రామ్‌లలో పెట్టుబడులు పెంచినట్టు తెలిపారు. క్యాప్‌జెమిని భారత కార్యకలాపాల్లో కంపెనీకి లక్ష మంది ఉద్యోగులున్నారు.
అయితే అంతర్జాతీయంగా ఎంతమందిని నియమించుకుంటుంది, ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తుందో కంపెనీ బహిర్గతం చేయలేదు. ఆటోమేషన్ తమ ఉద్యోగులకు మరింత ఉత్పాదకతను అందిస్తుందని క్రిస్టోఫర్ చెప్పారు. ఆటోమేషన్ ప్రభావం ఉద్యోగులకు మరింత డిమాండ్‌ను కల్పించనుందనే ఈ కంపెనీ చెబుతోంది. అయితే ఆటోమేషన్, డిజిటైజేషన్ ప్రభావంతో చాలా ఐటీ కంపెనీలు నియామకాలను తగ్గించాయి. ఇండస్ట్రి బాడీ నాస్కామ్ సైతం ఈ ఏడాది ఉద్యోగాల వృద్ది కేవలం 5 శాతం మాత్రమే ఉంటుందని పేర్కొంది. వచ్చే మూడేళ్లలో ఉద్యోగ నియామకాలు 20-25 శాతం తగ్గిపోయే అవకాశముందని కూడా అంచనావేసింది. మరోవైపు ఇన్ఫోసిస్ కంపెనీ కూడా 2018 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 20వేల మందిని నియమించుకోనున్నట్టు తెలిపింది. అయితే ఆటోమేషన్‌తో 11వేల మంది ఫుల్-టైమ్ ఉద్యోగులను ఇంటికి పంపేసినట్టు తన వార్షిక రిపోర్టులో పేర్కొంది.