
చిన్న ఆభరణ సంస్థలకు శుభవార్త
న్యూఢిల్లీ: చిన్న ఆభరణ తయారీ సంస్థల ప్రయోజనాలకు అనుగుణమైన కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. పన్నులకు సంబంధించి చిన్న తరహా పరిశ్రమ(ఎస్‌ఎస్‌ఐ) మినహాయింపు పరిమితిని ప్రభుత్వం పెంచింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత రూ.6 కోట్ల టర్నోవర్ పరిమితిని రూ.10 కోట్లకు పెంచింది. ఇందుకు సంబంధించి కొన్ని నిబంధనలను సైతం ప్రభుత్వం సరళతరం చేసింది. నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తయారీ వస్తువుల టర్నోవర్ రూ.100 కోట్లు ఉండి, రూ. కోటికన్నా తక్కువ సుంకం చెల్లించిన యూనిట్ల విషయంలో అటు తర్వాత మొదటి రెండేళ్లూ ఎక్సైజ్ ఆడిట్ ఉండబోదని కూడా ప్రకటన తెలిపింది. వెండి యేతర ఆభరణాలపై 1% సుంకం విధింపు బడ్జెట్ ప్రతిపాదనను నిరసిస్తూ.. ఆభరణ వర్తకుల భారీ నిరసనల నేపథ్యంలో... సమస్యల పరిష్కారానికి కేంద్రం ఒక కమిటీని వేయడం తెలిసిందే.