చైనా మందగమనం భారత్‌కు మంచిదే..!
‘గ్రాంట్స్’కు సప్లిమెంటరీ డిమాండ్‌పై చర్చకు అరుణ్ జైట్లీ సమాధానం
♦ జీఎస్‌టీ అమలు ఆలస్యంపై ఆవేదన
♦ పీఎస్‌యూ బ్యాంకులకు రూ. 1.1 లక్ష కోట్లు అవసరం
న్యూఢిల్లీ : చైనా ఆర్థిక వ్యవస్థ మందగమన ధోరణి భారత్ అంతర్జాతీయ తయారీ కేంద్రంగా ఎదగడానికి దోహదపడే అంశమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1 నుంచి 2 శాతం వృద్ధికి దోహదపడే వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు ఆలస్యం కావడం పట్ల ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రి గతవారం పార్లమెంటులో తన మొట్టమొదటి సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌ను ప్రవేశపెట్టారు. ఈ మొత్తం దాదాపు రూ.25,500 కోట్లు. స్థూలంగా రూ.40,822 కోట్ల వ్యయాలకు అనుమతి కోరితే... పొదుపులు లేదా పెరిగిన వసూళ్లు, రికవరీలు అన్నీ (దాదాపు రూ.15,326 కోట్లు) పోనూ నికర నగదు వ్యయ డిమాండ్ రూ.25,500 కోట్లు. ఇందులో సగం బ్యాంకులకు తాజా మూలధన కేటాయింపులకు సంబంధించినదే కావడం గమనార్హం. దీనిపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన పేర్కొన్న అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి...
► పెట్టుబడుల పునరుద్ధరణ, నిలిచిపోయిన ప్రాజెక్టుల పునఃప్రారంభం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన మూలధనం కేటాయింపులు వంటి పలు చర్యలను కేంద్రం తీసుకుంటోంది. తగిన వర్షపాతమూ నమోదయ్యే అవకాశం ఉంది. వీటిన్నింటి దన్నుతో జీడీపీ వృద్ధి రేటు 8 శాతం నమోదయ్యే అవకాశం ఉంది.
► రానున్న ఐదేళ్లలో బ్యాంకులకు రూ.70,000 కోట్లు సమకూర్చాలన్నది కేంద్రం లక్ష్యం. రూ.1.10 లక్షల కోట్లను బ్యాంకులు మార్కెట్ నుంచి సమీకరించుకోవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ అకౌంట్ల నిరర్ధక ఆస్తుల్లో స్టీల్, విద్యుత్, రహదారుల రంగాలే మెజారిటీగా ఉన్నాయి. ఆర్థిక వృద్ధి సాధన క్రమంలో ఎన్‌పీఏల సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నా.
► జీఎస్‌టీ అమలుకు అన్ని పార్టీలూ సహకరించాలి. దీనివల్ల దేశ వ్యాప్తంగా పన్నుల వ్యవస్థలో ఏకరూపత వస్తుంది. వృద్ధి రేటు పెరగడానికి తోడ్పడుతుంది. ఇలాంటి విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం అవసరం.
► చైనాలో కంపెనీల వేతన బిల్లులు పెరిగిపోయాయి. దీనిని భరించాలంటే- ఆయా కంపెనీలు ఉత్పత్తిచేసే వస్తువుల ధరలు పెరగాలి. ఇలాంటి పరిస్థితిని భారత్ తనకు సానుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తయారీ రంగానికి భారత్ కేంద్రంగా పరిణతి చెందాలి. ఇదే జరిగితే భారత్ వృద్ధి మరింత జోరందుకుంటుంది.
► మనం 8 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నాం. రెవెన్యూ వసూళ్లు కూడా ఇందుకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలూ సానుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా పరోక్ష పన్ను వసూళ్ల విభాగం బాగుంది.
► విదేశీ విభాగంలో ఆర్థిక అంశాలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. రికార్డు స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 49 శాతం పెరిగాయి. కరెంట్ అకౌంట్ లోటు నియంత్రణలో ఉంది.
► తగిన నిధుల లభ్యత వల్ల సామాజికాభివృద్ధి పథకాల్లో కూడా కేంద్రం నిధులను వెచ్చించగలుగుతుంది.
► బడ్జెట్ అంచనాలకు, సవరించిన అంచనాలకు పెద్దగా తేడా ఉండకుండా చూసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బడ్జెట్ అంచనాలకన్నా... సవరించిన అంచనాలు స్వల్ప స్థాయిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
► కొన్ని రాష్ట్రాల్లో ఆహార పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో సాగునీటి పారుదలపై మరింత వ్యయాలు పెంచాలి.
► 8 నుంచి 9 శాతం వృద్ధి సాధనలో రాష్ట్రాల పాత్రా కీలకం. వాటికి తగిన స్థాయిల్లో నిధులు అందజేస్తాం. ఏ రాష్ర్టం పట్లా పక్షపాత ధోరణి ఉండబోదు.