గణాంకాలతో లాభాలు
పారిశ్రామికోత్పత్తి గణాంకాలు అక్టోబర్‌లో అంచనాలను మించడంతో స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 106 పాయింట్ల లాభంతో 25,150 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 7,650 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇటీవల క్షీణించిన షేర్లలో షార్ట్‌కవరింగ్ జరగడం ప్రభావం చూపింది.
నష్టాల్లోంచి... లాభాల్లోకి: సెన్సెక్స్ ప్రారంభంలోనే 25వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో 24,868 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి 9.8 శాతానికి పెరగడం ఊరటనిచ్చింది. నవంబర్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం వరుసగా 13వ నెలలోనూ క్షీణతలోనే నమోదు కావడం కలసివచ్చింది. ఇటీవల బాగా పతనమైన షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో ప్రారంభ నష్టాలు పూడుకుపోయాయి.
ఉక్కు షేర్ల జోరు: విదేశాల నుంచి దిగుమతయ్యే కొన్ని రకాలైన ఉక్కు ఉత్పత్తులపై కేంద్రం 57 శాతం వరకూ యాంటీ డంపింగ్ సుంకం విధించడంతో ఉక్కు షేర్లు పెరిగాయి. షేర్లతో పాటు లోహ షేర్లూ లాభపడ్డాయి. జిందాల్ స్టెయిన్‌లెస్ 11.5 శాతం, మహారాష్ట్ర సీమ్‌లెస్, ఐఎస్‌ఎంటీ 11 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 5.8 శాతం, జిందాల్ స్టీల్ అండ్ పవర్ 4.8 శాతం, టాటా స్టీల్ 1.6 శాతం, సెయిల్ 1.7 శాతం చొప్పున లాభపడ్డాయి.