ముంబై: ఇటీవల డిమాండుకు అనుగుణంగా దేశంలో సాస్(ఎస్‌ఏఏఎస్) స్టార్టప్‌లు భారీగా పుట్టుకొస్తున్నాయి. మరోపక్క కొద్ది నెలలుగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న పబ్లిక్ ఇష్యూల హవా చిన్నా, పెద్దా కంపెనీలకు కొత్త జోష్‌నిస్తోంది. దీంతో సాఫ్ట్‌వేర్‌నే సర్వీసులుగా అందించే(సాస్) స్టార్టప్‌లు సైతం పబ్లిక్ ఇష్యూలను చేపట్టాలని యోచిస్తున్నాయి. తద్వారా పెట్టుబడుల సమీకరణతోపాటు స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్టింగ్‌ను సాధించాలని ఆశిస్తున్నాయి. గత నెలలో రెండు సాస్ స్టార్టప్‌లు ఐపీవో బాటలో సాగనున్నట్లు ప్రకటించాయి కూడా. ఇవి రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, ఫ్రెష్‌వర్క్స్ ఇంక్. మర్చంట్ బ్యాంకర్ల సమాచారం ప్రకారం సాస్ స్టార్టప్‌ల పట్ల ఇన్వెస్టర్లు అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో పలు కంపెనీలు ఈ బాట పట్టనున్నట్లు భావిస్తున్నారు. దేశీయంగా ఆతిథ్యం, ట్రావెల్ విభాగంలో అతిపెద్ద సాస్ కంపెనీగా నిలుస్తున్న రేట్‌గెయిన్ టెక్నాలజీస్ తొలిగా స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్ట్‌కానున్నట్లు అంచనా వేస్తున్నారు.
రూ. 1,200 కోట్లు
పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,200 కోట్లు సమకూర్చుకునేందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రేట్‌గెయిన్ దరఖాస్తు చేసింది. మరోవైపు చెన్నై సిలికాన్ వ్యాలీ కంపెనీ.. ఫ్రెష్‌వర్క్స్ ఇంక్ 10 కోట్ల డాలర్ల(సుమారు రూ. 730 కోట్లు) సమీకరణకు గత వారాంతాన యూఎస్‌లో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా నాస్‌డాక్ గ్లోబల్ సెలక్ట్ మార్కెట్‌లో క్లాస్–ఏ కామన్‌స్టాక్‌గా లిస్టయ్యే ప్రణాళికల్లో ఉంది. కొన్నేళ్ల నుంచీ సాస్ కంపెనీలు పెట్టుబడులను భారీగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ రంగంలో ఇప్పటివరకూ 6 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 44,000 కోట్లు) పెట్టుబడులు నమోదయ్యాయి. గత మూడేళ్లలోనే 4 బిలియన్ డాలర్లు లభించడం గమనార్హం! కాగా.. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్(ఏపీఐలు)లకు సహకార ప్లాట్‌ఫామ్‌గా వ్యవహరించే పోస్ట్‌మ్యాన్ కంపెనీ ఇటీవల 22.5 కోట్ల డాలర్లను సమీకరించింది. తద్వారా కంపెనీ విలువ 5.6 బిలియన్ డాలర్లను అందుకుంది. వెరసి దేశీయంగా అత్యంత విలువైన సాస్ స్టార్టప్‌గా ఆవిర్భవించింది.
యూనికార్న్‌లుగా
దేశంలో ప్రస్తుతం బిలియన్ డాలర్ విలువను సాధించడం ద్వారా యూనికార్న్ హోదా పొందిన 60 సంస్థలలో 10 స్టార్టప్‌లు సాస్ విభాగంలోనే నమోదయ్యాయి. ఈ ఏడాదిలో నాలుగు సంస్థలు కొత్తగా జాబితాలో చేరాయి. దేశీయంగా సాస్ విభాగంలో సమర్ధవంతమైన కంపెనీలు ఊపిరి పోసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కస్టమర్లకు ప్రాధాన్యత, ప్రపంచస్థాయి ప్రొడక్టులు సహకరిస్తున్నాయి. డిమాండు ఆధారంగా సంస్థలను నెలకొల్పే టెక్ వ్యవస్థాపకులకుతోడు.. నైపుణ్యం కలిగిన డెవలపర్ల అందుబాటు వంటి అంశాలతో పరిశ్రమ వేగంగా ఎదుగుతున్నట్లు ట్రూస్కేల్ క్యాపిటల్ అధికారి సమీర్ నాథ్ తెలియజేశారు. దీంతో చివరి కస్టమర్లకు పలు విలువైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా దేశీ సాస్ కంపెనీలు పోటీలో ముందుంటున్నట్లు వివరించారు. పలు దేశీ కంపెనీలు యూఎస్‌తోపాటు, అవకాశాలకు వీలున్న గ్లోబల్ మార్కెట్లపై దృష్టిసారిస్తున్నాయి. అధిక వృద్ధి, ఆదాయాలు, ఆకర్షణీయ మార్జిన్లతో పోటీ సంస్థలతో పోలిస్తే ప్రీమియం విలువలను అందుకుంటున్నాయని విశ్లేషకులు తెలియజేశారు.
రేట్‌గెయిన్ ఐపీవో
రేట్‌గెయిన్ ట్రావెల్‌ను 2004లో భాను చోప్రా ఏర్పాటు చేశారు. హోటళ్లు, ఎయిర్‌లైన్స్, ఆన్‌లైన్ ట్రావెల్, టూర్ ప్యాకేజీ ప్రొవైడర్స్, రైల్, క్రూయిజర్లు తదితరాలలో సొల్యూషన్స్ అందిస్తోంది. ఆతిథ్యం, ట్రావెల్ విభాగంలో అతిపెద్ద డేటాపాయింట్ సర్వీసులను కల్పిస్తోంది. 1400 కస్టమర్ సంస్థలను కలిగి ఉంది. గ్లోబల్ ఫార్చూన్–500 కంపెనీలలో 8 సంస్థలకు సేవలు సమకూర్చుతోంది. హోటళ్ల విభాగంలో ఇంటర్‌కాంటినెంటల్, కెస్లర్ కలెక్షన్, లెమన్ ట్రీ, ఓయో తదితరాలున్నాయి.
ఫ్రెష్‌వర్క్స్‌కు పెట్టుబడులు
ఇటీవల ఫ్రెష్‌వర్క్స్ 40 కోట్ల డాలర్ల(రూ. 2,925 కోట్లు) పెట్టు బడులు సమకూర్చుకుంది. దీంతో కంపెనీ విలువ 3.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఫ్రెష్‌వర్క్స్‌లో దిగ్గజాలు సీక్వోయా క్యాపిటల్, యాక్సెల్, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, క్యాపిటల్ జి తదితరాలు ఇన్వెస్ట్ చేశాయి. గత ఏడాది కాలంలో యూఎస్‌లో సాప్ ఐపీవోలు విజయవంతమయ్యాయి. నాస్‌డాక్‌లో లిస్టింగ్ ద్వారా 10 బిలియన్ డాలర్ల విలువను అందుకోవాలని ఫ్రెష్‌వర్క్స్ చూస్తోంది. వెరసి అతిపెద్ద దేశీ సాస్ స్టార్టప్‌లలో ఒకటిగా నిలిచే అవకాశముంది.
చదవండి : రూ.16వేల కోట్ల ఐపీఓ,పేటీఎం కొత్త స్ట్రాటజీ!
Comments
Please login to add a commentAdd a comment