భారత్ వృద్ధి 7.7 శాతం: సిటీ గ్రూప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2016-17) భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 7.7 శాతం నమోదవుతుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజం- సిటీగ్రూప్ నివేదిక ఒకటి తెలిపింది. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఆర్థిక వృద్ధి సూచీలు బలహీనంగా కనబడుతున్నప్పటికీ 7.7 శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది.
ఏప్రిల్, మే నెలల్లో వాణిజ్య వాహన అమ్మకాలు, మౌలిక రంగంలో రుణ వృద్ధి, విద్యుత్ డిమాండ్, ఎయిర్ కార్గో వంటి విభాగాలు బలహీన ధోరణిని కనబరిచినట్లు నివేదిక విశ్లేషించింది. తగిన వర్షపాతంతో గ్రామీణ డిమాండ్ మెరుగుదల, 7వ వేతన సంఘం సిఫార్సుల అమలు వల్ల వినియోగం పెరగడం తమ వృద్ధి అంచనాలకు కారణంగా పేర్కొంది. ఆయా అంశాలు పెట్టుబడుల వృద్ధికీ కొంతమేర దోహదపడతాయని అంచనావేసింది.