ఈ ఏడాది 5.6% వృద్ధికి చాన్స్: సిటీ గ్రూప్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లో దేశ జీడీపీ 5.6% స్థాయిలో వృద్ధి చెందే అవకాశముందని సిటీగ్రూప్ అంచనా వేసింది. సంస్కరణలు వేగవంతంకావడం, ద్రవ్యోల్బణం దిగిరావడం వంటి అంశాలు ఇందుకు దోహదపడతాయని ఒక నివేదికలో సిటీగ్రూప్ పేర్కొంది. రెండో క్వార్టర్‌లో ఆర్థిక వృద్ధి 5.3%కు పరమితమైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఊపందుకున్న సంస్కరణలు, మెరుగుపడుతున్న లిక్విడిటీ పరిస్థితులు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని అభిప్రాయపడింది. ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో జీడీపీ 5.7% వృద్ధి సాధించినప్పటికీ, రెండో క్వార్టర్‌లో 5.3%కు పరిమితమైంది.
వెరసి ఈ ఏడాది ప్రథమార్ధంలో 5.5% ఆర్థిక వృద్ధి నమోదైంది. గతేడాది ఇదే కాలంలో సాధించిన 4.9%తో పోలిస్తే 12% పురోగమించినట్లే. కాగా, గతేడాది పూర్తికాలానికి 4.7% వృద్ధి నమోదుకాగా, ఈ ఆర్థిక సంవత్సరం 5.6%కు చేరవచ్చునని సిటీగ్రూప్ అంచనా వేసింది. వేగవంతమైన సంస్కరణలు, మెరుగుపడ్డ లిక్విడిటీ పరిస్థితులు, ప్రాజెక్ట్‌లకు అనుమతులు వంటి అంశాలు తాజా అంచనాలకు కారణమని తెలిపింది.