గణాంకాలపై ఇన్వెస్టర్ల చూపు | Show investors on statistics | Sakshi
Sakshi News home page

గణాంకాలపై ఇన్వెస్టర్ల చూపు

Published Sun, Nov 9 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

గణాంకాలపై ఇన్వెస్టర్ల చూపు

గణాంకాలపై ఇన్వెస్టర్ల చూపు

కేంద్ర మంత్రివర్గ విస్తరణకూ ప్రాధాన్యత
సెప్టెంబర్ పారిశ్రామికోత్పత్తి వివరాలు
అక్టోబర్ నెలకు ద్ర వ్యోల్బణం వెల్లడి
మిగిలిన బ్లూచిప్స్ ఫలితాలూ కీలకమే
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల విశ్లేషణ

 
న్యూఢిల్లీ: ఈ వారం మార్కెట్లను పలుఅంశాలు ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వివరాలు, అక్టోబర్ నెలకు ద్రవ్యోల్బణం గణాంకాలు వెల్లడికానున్నాయి. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి ఆటో దిగ్గజం టాటా మోటార్స్, బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐతోపాటు, ప్రభుత్వ రంగ బ్లూచిప్‌లు ఓఎన్‌జీసీ, బీహెచ్‌ఈఎల్ ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటితోపాటు సన్ ఫార్మా, టాటా స్టీల్, సిప్లా, టాటా పవర్, డీఎల్‌ఎఫ్, హిందాల్కో, యునెటైడ్ స్పిరిట్స్ తదితరాలు క్యూ2 పనితీరును వెల్లడించనున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, విస్తరణ సైతం మార్కెట్ల నడకను నిర్దేశించనున్నాయని పలువురు నిపుణులు పేర్కొన్నారు. ఇవికాకుండా విదేశీ పరిణామాలు, సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, చమురు ధరలు వంటి అంశాలు కూడా సెంటిమెంట్‌కు కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు తెలిపారు.

బుధవారం ఎఫెక్ట్

సెప్టెంబర్ నెల ఐఐపీతోపాటు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు బుధవారం(12న) వెలువడనున్నాయి. టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు శుక్రవారం(14న) వెల్లడికానున్నాయి. వీటితోపాటు బ్లూచిప్ కంపెనీల క్యూ2 ఫలితాలు సమీప కాలంలో మార్కెట్ల కదలికలను నిర్దేశిస్తాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఎంటీ డెరైక్టర్ వివేక్ గుప్తా అంచనా వేశారు. ప్రధాని  మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన నేపథ్యంలో తదుపరి సంస్కరణలపై ఇన్వెస్టర్లు దృష్టి నిలుపుతారని చెప్పారు.
 
నిఫ్టీకి 7,900-7,950 వద్ద మద్దతు

గత 2 వారాల నుంచి ఎఫ్‌ఐఐల పెట్టుబడులు భారీగా పుంజుకున్న నేపథ్యంలో రానున్న కాలంలో విదేశీ పెట్టుబడులు కీలకంగా నిలవనున్నాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అభిప్రాయపడ్డారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి సమీపకాలంలో 7,900-7,950 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభిస్తుందని అంచనా వేశారు. విదేశీ సంకేతాలు కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. కాగా, గడిచిన వారం మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 3 పాయింట్ల నామమాత్ర లాభంతో 27,869 వద్ద ముగియడం గమనార్హం. అయితే నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 8,337 వద్ద స్థిరపడింది.
 
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ. 5,200 కోట్లు
 
ఈ నెల తొలి వారంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ క్యాపిటల్ మార్కెట్లో రూ. 5,200 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడిన సానుకూల పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు వంటి అంశాలు విదేశీ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా, నవంబర్ 3-7 కాలంలో ఎఫ్‌పీఐలు ఓవైపు ఈక్విటీల్లో నికరంగా రూ. 4,412 కోట్లు(71.8 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్‌చేయగా, మరోపక్క రూ. 765 కోట్ల  (12.5 కోట్ల డాలర్లు)విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. ఇప్పటికే అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీని జపాన్ మరింత పెంచగా, యూరోజోన్ దేశాల ఆర్థిక వృద్ధికి యూరోపియన్ కేంద్ర బ్యాంక్(ఈసీబీ) సైతం భారీ స్థాయిలో నిధులను వెచ్చించే యోచనలో ఉంది. ఈ ఏడాది జనవరి మొదలు అక్టోబర్‌వరకూ ఎఫ్‌పీఐలు   ఈక్విటీల్లో నికరంగా రూ. 86,678 కోట్లు పెట్టుబడిపెట్టగా... రూ. 1.37 లక్షల కోట్లను రుణ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement