
ఒక్క క్లిక్‌తో స్పందిస్తారు
హైదరాబాద్‌లో కాల్ అంబులెన్స్
• చేతులు కలిపిన 60 ఆసుపత్రులు
• వలంటీర్ల భాగస్వామ్యంతో సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రమాదం జరిగిన వెంటనే వైద్యం అందకపోవటం వల్లే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో బాధితులకు వెంటనే సహాయం అందితే బతికే అవకాశాలు ఎక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో కాల్ అంబులెన్స్ పేరిట సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇన్ఫోసిస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ఉమాశంకర్ కొత్తూరు, జగదీశ్ బాబు విశ్వనాథం దీన్ని ప్రారంభించారు. ఒక్క క్లిక్‌తో కొన్ని నిముషాల్లోనే బాధితుల వద్దకు అంబులెన్సు చేరుకోవడం దీని ప్రత్యేకత. ఇందుకోసం 60 ఆసుపత్రులతో కంపెనీ చేతులు కలిపింది. బాధితులకు సహాయం చేసేందుకు 100కె ఫస్ట్ రెస్పాన్స్ పేరుతో వలంటీర్ వ్యవస్థనూ ఈ కంపెనీ ఏర్పాటు చేస్తోంది.
బటన్ నొక్కితే చాలు..
కాల్ అంబులెన్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వ్యక్తికి అంబులెన్సు అవసరమైతే పవర్ బటన్‌నుగానీ, వాల్యూమ్ బటన్‌నుగానీ మూడుసార్లు నొక్కాలి. బాధితుడు ఆపదలో ఉన్నట్టు కుటుంబ సభ్యులకు, సమీపంలోని ఆసుపత్రికి, 108కు, అలాగే 100కె ఫస్ట్ రెస్పాన్స్ సభ్యుడికి అలర్ట్ వెళ్తుంది. ఆసుపత్రిగానీ, 108 సిబ్బందిగానీ స్పందించగానే ఈ సమాచారం మిగిలిన ఆసుపత్రులకూ చేరుతుంది. బాధితుడిని హాస్పిటల్‌కు తరలిస్తారు. యాప్ వాడుతున్న వ్యక్తి లొకేషన్ సైతం ట్రాక్ చేయవచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు బ్లడ్ గ్రూప్, ఆరోగ్య సమాచారం పొందుపరిస్తే వైద్యం అందించడం సులభం అవుతుంది. బ్లడ్ కావాలంటూ సభ్యులకు రిక్వెస్ట్ పెట్టవచ్చు.
వలంటీర్లు సైతం..: కంపెనీ ‘100కె ఫస్ట్ రెస్పాన్స్’ పేరుతో మరో యాప్‌ను అభివృద్ధి చేసింది. సామాజిక స్పృహ ఉన్నవారు ఇందులో చేరవచ్చు. అత్యవసర సమయాల్లో బాధితులకు చేయాల్సిన ప్రాథమిక చికిత్స, స్పందించాల్సిన తీరు గురించి సభ్యులకు కంపెనీ శిక్షణ ఇస్తుంది. బాధితుడికి కిలోమీటరు పరిధిలో ఉన్న సభ్యులకు అలర్ట్ వెళ్తుంది. ఎవరైనా స్పందిస్తే మిగిలిన సభ్యులకూ సమాచారం అందుతుంది. వలంటీర్లను భాగస్వాములను చేస్తూ పలు దేశాల్లో అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని కాల్ అంబులెన్స్ ఇన్వెస్టర్లలో ఒకరైన వివేక్ వర్మ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. అంబులెన్సు ఆపరేటర్లను సైతం యాప్‌కు అనుసంధానిస్తామని కంపెనీ సహ వ్యవస్థాపకులు ఉమాశంకర్ కొత్తూరు చెప్పారు. యూజర్లకు సేవలు ఉచితమని తెలిపారు. ఆసుపత్రుల నుంచి కొంత చార్జీ చేస్తామని చెప్పారు.