కాగ్నిజెంట్ లాభం 10% అప్
న్యూయార్క్: ఐటీ సర్వీసుల అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్‌కు 38.2 కోట్ల డాలర్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(34.8 కోట్ల డాలర్లు)తో పోల్చితే 10 శాతం వృద్ధి సాధించామని కాగ్నిజెంట్ పేర్కొంది. ఇక ఆదాయం 242 కోట్ల డాలర్ల నుంచి 20 శాతం వృద్ధితో 291 కోట్ల డాలర్లకు పెరిగిందని కాగ్నిజెంట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కరెన్ మెక్‌లాఫ్‌లిన్ చెప్పారు. తాము అంచనా వేసిన అదాయం(288 కోట్ల డాలర్లు)కంటే అధిక అదాయం ఆర్జించామని వివరించారు.
ఫలితాలు ప్రోత్సాహాకరంగా ఉన్నాయని దీంతో ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో అంచనాలను పెంచుతున్నామని ఆమె పేర్కొన్నారు. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు ఆదాయం కనీసం 301 కోట్ల డాలర్లుగా ఉండొచ్చని ఆమె అంచనా వేస్తున్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను కూడా పెంచుతున్నామని చెప్పారు.