పసిడిది మెరుపుల బాటే..!
ట్రంప్ గెలిస్తే ఏకంగా 1,850 డాలర్లకు చేరుతుందన్న అంచనాలు
పసిడి ఈ ఏడాది పటిష్ట బాటలోనే కొనసాగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రానున్న అమెరికా ఎన్నికలు, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ ఫండ్ రేటును ప్రస్తుతం ఉన్న 0.50 శాతం నుంచి పెంచకపోవచ్చని వారు చెబుతున్నారు. దీంతో స్వల్ప ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, పసిడి న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్-నెమైక్స్‌లో ఔన్స్‌కు 1,300-1,375 డాలర్ల శ్రేణిలోనే తిరుగుతుందన్నది వారి విశ్లేషణ. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే పసిడి ధర ఏకంగా 1,850 డాలర్లకు పెరిగిపోతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతుండడం గమనార్హం.
అమెరికా ఎన్నికల ఫలితాలు పలు సందర్భాల్లో పసిడి ధరలపై గణనీయమైన ప్రభావం చూపినట్లు అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం ఏబీఎన్ ఆమ్రో ప్రతినిధి జార్జిట్ బోలే పేర్కొన్నారు. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ విజయం పొందినా... తరువాతి కాలాల్లో పసిడి ఔన్స్‌కు 1,650 డాలర్ల దిశగా కదిలే వీలుందని విశ్లేషించారు.
గత వారంలో ధరల తీరు...
శుక్రవారంతో ముగిసిన వారంలో అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్‌లో ఔన్స్ ధర స్వల్పంగా 4 డాలర్లు ఎగసి, 1,332 డాలర్లకు చేరింది. ఇక దేశీయ మార్కెట్ విషయానికి వస్తే, రెండు వారాలు బలహీనంగా ఉన్న పసిడి ధర తిరిగి పుంజుకుంది. పండుగల సీజన్ దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్‌లో శుక్రవారంతో ముగిసిన వారంలో 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు రూ.330 ఎగసి, రూ.31,325కు చేరింది.
(గమనిక: ప్రస్తుతం డాలర్‌తో రూపాయి విలువ రూ.67కు కాస్త అటూఇటుగా ఉంది. ఒక ఔన్స్‌కు 31.1గ్రాములు.)