లూటీ..! | commercial companies charges on GST | Sakshi
Sakshi News home page

లూటీ..!

Published Tue, Oct 3 2017 12:57 AM | Last Updated on Tue, Oct 3 2017 3:23 PM

commercial companies charges on GST

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో :  వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) గురించి కేంద్రం ఎప్పుడు మాట్లాడినా ప్రజలు అత్యధికంగా వినియోగించే నిత్యావసరాల ధరలు తగ్గుతాయనే చెబుతోంది. జీఎస్‌టీ అమలు నేపథ్యంలో కేంద్రం కొన్ని పన్ను విధివిధానాలను కూడా ఖరారు చేసింది. అయితే చాలామంది వ్యాపారులు అవేవీ పట్టించుకోవట్లేదు. ఉదాహరణకు.. వ్యాపారులు పన్నులకు సంబంధించి పారదర్శకంగా వ్యవహరించాలి. తక్కువ పన్నులున్న వస్తువుల ధరలను సామాన్యులకు బదిలీ చేయాలి.

మినహాయింపుల్లో ఉన్న వస్తువుల జాబితా కనిపించేలా బోర్డును ఏర్పాటు చేయాలి. ఏ వస్తువులపై ఎంత జీఎస్‌టీ అనేది ప్రదర్శించాలి. గతంలో ఏ వస్తువు ఎంత పన్ను ఉండేది, ప్రస్తుతమెంత అనేది స్పష్టంగా వివరించాలి. కానీ, రాష్ట్రంలోని ఏ రిటైల్‌ షాపుల్లోనూ ఇలాంటి బోర్డులేవీ కనిపించవు. గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ) అంటేనే అన్ని రకాల పన్నులు కలిపి వినియోగదారుడికి విక్రయించే ధర అని అర్థం. కానీ, వ్యాపారులు ఎంఆర్‌పీ మీద జీఎస్‌టీ విధిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు.

సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌లలో సంగతేంటి?
నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు ఇలా దైనందిన జీవితంలో వినియోగించే అత్యధిక వస్తువులపై కేంద్రం జీఎస్‌టీ నుంచి మినహాయింపునిచ్చింది. అయితే అమలులో మాత్రం వ్యాపారులు దీన్ని పట్టించుకోవట్లేదు. పన్నులు లేని వాటిపైన కూడా జీఎస్‌టీ పేరిట సొమ్ము చేసుకుంటున్నారు. సూపర్‌మార్కెట్లు, పెద్ద పెద్ద మాల్స్‌లలో కూడా ఈ తంతు బాగానే కనిపిస్తుంది. బియ్యం, పప్పులు, ఉప్పుల వంటి ఉత్పత్తులు ప్యాకింగ్‌ చేసి, రిజిస్టర్‌ ట్రేడ్‌ మార్క్‌ ఉంటేనే 5 శాతం పన్ను వసూలు చేయాలి.

కానీ, అవేవీ పట్టించుకోకుండా ప్యాకింగ్‌ ఉన్నా లేకున్నా సరే అన్నింటికీ ఒకే రకమైన పన్ను వసూలు చేస్తున్నారని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ కన్జ్యూమర్‌ ఆర్గనైజేషన్‌ (సీఏటీసీఓ) మాజీ సెక్రటరీ ప్రొఫెసర్‌ ఎ.బాలకిషన్‌ వ్యాఖ్యానించారు. ‘‘బిల్లులో జీఎస్‌టీ విధింపునకు సంబంధించి ఇస్తున్న వివరాలు కూడా గందరగోళంగా ఉంటున్నాయి.

కొందరు ఏ వస్తువుకు ఎంత సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ అని వేర్వేరుగా ఇస్తుంటే, మరికొందరేమో బిల్లు మొత్తానికి కలిపి సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ అని ఇస్తున్నారు.దీంతో ఏ వస్తువుపై ఎంత పన్ను పడిందో వినియోగదారులకు తెలియడం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. జీఎస్‌టీ దోపిడీని నియంత్రించడంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ విఫలమవుతున్నాయని తెలిపారు.

కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు...
పన్ను ప్రయోజనాలను బదలాయించని వ్యాపారులు, సంస్థలపై ఫిర్యాదుల కోసం కేంద్రం యాంటీ ప్రాఫిటరింగ్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. యాంటీ ప్రాఫిటరింగ్‌ అథారిటీలో కేంద్రం, రాష్ట్రం నుంచి ఇద్దరేసి అధికారుల చొప్పున మొత్తం నలుగురి బృందం ఉంటుంది. వినియోగదారులు నేరుగా యాంటీ ప్రాఫిటరింగ్‌ బృందానికి ఫిర్యాదు చేయొచ్చు. రాష్ట్ర స్థాయి ఫిర్యాదులకు స్క్రీనింగ్‌ కమిటీలో, జాతీయ స్థాయి ఫిర్యాదులకు స్టాండింగ్‌ కమిటీలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

ఫిర్యాదులు స్వీకరించాక ఆయా కమిటీలు విచారణ నిమిత్తం డైరెక్టర్‌ జనరల్‌ సేఫ్‌గార్డ్స్‌కు బదిలీ చేస్తారు. డీజీ సేఫ్‌గార్డ్స్‌ 2–3 నెలల్లో విచారణ నివేదికను యాంటీ ప్రాఫిటరింగ్‌ అథారిటీకి అందజేస్తుంది. ఈ సంస్థ ఏం చేస్తుందంటే.. జీఎస్‌టీ పన్ను తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించని వ్యాపార సంస్థలు, కంపెనీలను గుర్తించి వినియోగదారులకు ప్రయోజనాలను అందిస్తుంది. ఒకవేళ లబ్ధిదారులను గుర్తించలేని పక్షంలో ఆ మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ నిధికి బదలాయిస్తుంది. పదేపదే ఇలాంటి పొరపాట్లు చేసే వ్యాపార సంస్థలు, కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దవుతాయి.


రెస్టారెంట్లలో కూలింగ్‌ చార్జీల వసూలు...
జీఎస్‌టీ కంటే ముందు హోటళ్లు, రెస్టారెంట్లలో బిల్లులపై వ్యాట్, సర్వీస్‌ ట్యాక్స్, సర్వీస్‌ చార్జీ వసూలు చేసేవారు. కానీ, జీఎస్‌టీ అమలయ్యాక వీటన్నింటి స్థానంలో 18 శాతం జీఎస్‌టీ శ్లాబును కేటాయించారు. అయితే కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులో జీఎస్‌టీతో పాటూ ఫుడ్‌ను సర్వ్‌ చేసినందుకు గాను సర్వీస్‌ చార్జీ, వాటర్‌ బాటిల్, కూల్‌డ్రింక్స్‌ మీద కూలింగ్‌ చార్జెస్‌ కూడా వసూలు చేస్తున్నాయి. ఇవి కూడా ఎంఆర్‌పీ కంటే 3–5 శాతం మేర అధికంగా ఉంటున్నాయని ఓ కస్టమర్‌ వాపోయారు.

రెస్టారెంట్లలోని మెనూ కార్డులో మెనూ ధరల్లో జీఎస్‌టీ పన్నును కూడా కలిపి ధరలను చూపించాలి. అప్పుడే కస్టమర్‌కు ఆర్డర్‌ ఇవ్వక ముందే బిల్లు ఎంతవుతుందో తెలుస్తుంది. ‘‘జీఎస్‌టీ అమలయ్యాక రెస్టారెంట్లలో తిన్న బిల్లుపై ఎక్కువ వసూలు చేస్తున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగాయి’’ అని .  రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ అధికారి ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’కు తెలిపారు. జీఎస్‌టీ అమలయ్యాక నెల రోజుల్లోనే 68 కేసులు నమోదయ్యాయని చెప్పారాయన.

మొబైల్‌ టీం ఊసేలేదు...
వ్యాపారులకు అధికారుల నుంచి వేధింపులు ఉండకూడదనే ఉద్దేశంతో వ్యాపార సంస్థలపై దాడులు చేయవద్దని, ఇతర రకాలుగా వేధించకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఇదే ఆసరాగా జీఎస్‌టీ అమలునే అధికార యంత్రాంగం పూర్తిగా విస్మరించింది. జీఎస్‌టీ అమలుకు వ్యాపారుల వద్ద నుంచి సన్నద్ధత, ఏర్పాట్లకు సంబంధించి చెక్‌లిస్ట్‌ తీసుకున్న అధికారులు అది వాస్తవంగా అమలవుతుందా? లేదా అని పరిశీలించడం లేదు.

నిబంధనలు పాటిస్తున్నారా లేదా పరిశీలించకపోతే ఎలా అని వినియోగదారులు ప్రశ్నిస్తుంటే.. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. జీఎస్‌టీ అమలు తర్వాత చెక్‌పోస్టులను రాష్ట్రం ఎత్తేసింది. తెలంగాణలో మొత్తం 16 చెక్‌పోస్ట్‌లుండేవి. వాటి స్థానంలో తనిఖీల కోసం ప్రత్యేకంగా మొబైల్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేయాలి. కానీ, నేటికీ అవి కార్యరూపం దాల్చలేదని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’కు తెలిపారు. చెక్‌పోస్ట్‌ ఉద్యోగుల్ని ఖాళీగా ఉంచారన్నారు. నిఘా లేకపోవటంతో స్థానికంగా ఉత్పత్తులను తయారు చేసి ఇతర ప్రాంతాల్లో, రాష్ట్రాలకు సరఫరా చేసి విక్రయిస్తున్నారని తెలిపారు.   


రూ.50 వేలు జరిమానా.. జైలు శిక్ష
ఎంఆర్‌పీ కంటే ఎక్కువ వసూలు చేసినా లేదా ఇతరత్రా మార్గాల ద్వారా పన్నులు వసూలు చేసినా రాష్ట్ర తూనికలు, కొలతల శాఖకు ఫిర్యాదు చేయొచ్చు. ‘‘ప్రస్తుతానికైతే సీఎల్‌ఎం–టీఎస్‌ఎట్‌దిరేట్‌ఎన్‌ఐసీ.ఇన్‌కు మెయిల్‌ చేయాలి. టోల్‌ఫ్రీ నంబర్‌ లేదు. అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే విడుదల చేస్తాం’’అని  సంబంధిత శాఖ అధికారి తెలిపారు. ఎంఆర్‌పీ ధరలోనే 10–35 శాతం వరకు లాభం కలిపి ఉంటుంది. అలాంటప్పుడు ఎంఆర్‌పీ మీద అదనంగా 3–5 శాతం వరకు వసూలు చేయడం అన్యాయం.

రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 60 శాతం ఎంఆర్‌పీ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారనేవే అని ఆయన పేర్కొన్నారు. తాగునీరు నిత్యావసర వస్తువు. దీన్ని రిటైల్‌ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. తయారీ సంస్థలు, రిటైలర్లు, డీలర్లు, ప్యాకర్లు, విక్రయదారులు అందరూ ఎంఆర్‌పీ ప్రకారమే విక్రయించాలి. మల్టీ ప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, బస్‌ స్టేషన్లు, విమానాశ్రయాలు, హైవే ప్రక్కల దుకాణాల దగ్గర ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. మొదటిసారి నేరానికి రూ.2 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా, రెండోసారి నేరానికి 6 నెలల జైలు శిక్ష ఉంటుంది.


సీన్‌ 1
శ్రీనివాస్‌ కుటుంబంతో సహా వరంగల్‌కు బయలుదేరాడు. దార్లో టీ తాగుదామని భువనగిరి– ఆలేరు మధ్య హైవేలోని ఓ షాపు వద్ద కారు ఆపాడు. టీతో పాటూ ఓ లేస్‌ ప్యాకెట్‌ కూడా తీసుకున్నాడు. దీని ధర రూ.10. కానీ, షాపు యజమాని వసూలు చేసింది మాత్రం రూ.15.

అదేంటని అడిగితే.. ‘‘హోల్‌సెల్లర్‌ నాకే కాదు ఇక్కడున్న అన్ని షాపులకూ మేం కొనే సామాను మీద రూ.5 వేలు ఎక్కువ చార్జీ చేస్తుండు. ఎందుకనడిగితే జీఎస్‌టీ అంటుండు. కావాలంటే సరుకు తీసుకో! లేదంటే లేదని బెదిరిస్తుండు. అందుకే మేమూ కస్టమర్ల నుంచి ఎంఆర్‌పీపై అదనంగా వసూలు చేయాల్సి వస్తుం దో సార్‌’’ ఇదీ షాపు యజమాని సమాధానం.

లూటీ ఎంత?
ఇలా ఒక్క లేస్‌ ప్యాకెట్‌ కాదు!! ప్రతి వస్తువు మీద అదనంగా చెల్లించాల్సిందే. అక్కడున్న 105 షాపులదీ ఇదే పరిస్థితి. అంటే ఒక్కో షాపు రోజుకు అన్ని ఉత్పత్తుల మీద కలిపి రూ.1,500 అదనంగా వసూలు చేస్తుంటే.. 105 షాపులది కలిపి రూ.1.57 లక్షలు అదనమన్నమాట. ఓ చిన్న ప్రాంతంలో నెలకు రూ.47.25 లక్షలు జీఎస్‌టీ పేరిట  లూటీ చేస్తున్నారన్నమాట.

సీన్‌ 2
నారాయణ వరంగల్‌లోని కరీమాబాద్‌లో ఓ శారీ సెంటర్‌ యజమాని. పండుగ సీజన్‌ కావడంతో రెడీమేడ్‌ డ్రెస్‌లు, చీరలు కొందామని చార్మినార్‌లోని దివాన్‌ దేవిడీకి వచ్చాడు. ఓ హోల్‌సేల్‌ షాపుకెళితే.. ‘‘ఏది కొన్నా సరే 12% జీఎస్‌టీ! కార్డు మీద అయితే 5% అదనం!!’’ అనే బోర్డు చూసి షాకయ్యాడు.

నిజానికి జీఎస్‌టీ శ్లాబుల్లో రూ.1,000 లోపు ధర ఉండే చీరలపై జీఎస్‌టీ 5 శాతమే. కానీ, ఇక్కడలాంటివేవీ వర్తించవు. ఆ ఒక్క షాపే కాదు అక్కడున్న ఏ హోల్‌ సేల్‌ షాపుకెళ్లినా సేమ్‌ సీన్‌. దీంతో చేసేదేమీ లేక ఉత్తి చేతులతో ఇంటికి తిరిగెళ్లలేక... చేతిలో ఉన్న సొమ్ముతో కొంత ఖరీదు చేసి మరికొంత జీఎస్‌టీ పేరు మీద సమర్పించేసి బయలుదేరాడు.

లూటీ ఎంత?
చార్మినార్‌లోని దివాన్‌ దేవిడీ, మదీనా, పత్తర్‌ఘట్టీ ప్రాంతాలు హోల్‌సేల్‌ బట్టల షాపులకు నిలయం. రాష్ట్రంలోని ఏ రిటైల్‌ షాపులైనా సరే ఇక్కడి నుంచే కొనుగోలు చేస్తుంటాయి. ఇక్కడ సుమారు 15 వేల షాపులుంటాయని అంచనా. ఒక్కో షాపు ఎంతలేదన్నా కనీసం రోజుకు సగటున రూ.5 లక్షల వ్యాపారం చేస్తే ఇందులో కనీసం రూ.2 లక్షల వరకు అన్‌రిజిస్టర్‌ ఖాతాలోనే జమ అవుతాయి.అంటే బిల్లింగ్‌లో లేకుండా జీఎస్‌టీ రూపంలో ఆయా షాపులు జనాల నుంచి వసూలు చేసే సొమ్ము రోజుకు సుమారు రూ.300 కోట్లన్న మాట!!.
...పైరెండు సంఘటనలు శ్రీనివాస్, నారాయణకే కాదండోయ్‌!! మనలో చాలా మందికి అనుభవమే.

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు తర్వాతైతే మరీనూ!! ఒకరేమో ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తుంటే.. మరొకరు జీఎస్‌టీ నుంచి మినహాయించిన ఉత్పత్తులపైన కూడా పన్ను వసూ లు చేసేస్తున్నారు. ఇంకొకరేమో విభాగాల వారీగా కాకుండా అన్ని రకాల ఉత్పత్తులకూ ఒకే రకమైన జీఎస్‌టీని వసూలు చేస్తున్నారు. దండుకునే తీరేదైనా మొత్తంగా సామాన్యులపై జీఎస్‌టీ పేరిట లూట్‌ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement