వాణిజ్య ‘పద్మాలు’ వీరే... | Commercial 'lpadma's' are ... | Sakshi
Sakshi News home page

వాణిజ్య ‘పద్మాలు’ వీరే...

Published Tue, Jan 26 2016 5:46 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM

వాణిజ్య ‘పద్మాలు’ వీరే...

వాణిజ్య ‘పద్మాలు’ వీరే...

న్యూఢిల్లీ: దివంగత ధీరూభాయ్ అంబానీ సహా పలువు రు వ్యాపార దిగ్గజాలకు ‘పద్మ’ పురస్కారాలు దక్కాయి. అంబానీకి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ దక్కింది. మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ దక్కిన వారిలో నిర్మాణ రంగ దిగ్గజం పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ, మారుతీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ, బెన్నెట్ అండ్ కోల్‌మన్ చైర్‌పర్సన్ ఇందుజైన్ ఉన్నారు.
 
మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్‌పాల్ ఎస్ బంగా, సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ, సీఏ టెక్నాలజీస్ చైర్మన్ సౌరభ్ శ్రీవాస్తవ, ఘర్దా కెమికల్స్ వ్యవస్థాపకుడు కేకీ ఘర్దా పద్మశ్రీ దక్కించుకున్న వారిలో ఉన్నారు. వాణిజ్యం, పరిశ్రమల విభాగంలో వీరికి ఈ పురస్కారాలను ప్రకటించింది కేంద్రం.

 ధీరూభాయ్‌కి పద్మ విభూషణ్ ప్రకటించడం.. భారతీయ ఔత్సాహిక వ్యాపారవేత్తల స్ఫూర్తిని, ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలవాలనే వారి ఆకాంక్షలు, కృషిని గౌరవించుకోవడమేనని ఆయన కుమారుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.
 
  ఇది తనకు, లక్ష పైగా ఉద్యోగులున్న రిలయన్స్ కుటుంబానికి గర్వకారణమైన రోజుగా ఆయన అభివర్ణించారు. భారత్‌ను ఆధునిక, స్వయం సమృద్ధి దేశంగా తీర్చిదిద్దడంలో ఈ స్ఫూర్తితో పునరంకితం అవుతామని చెప్పారు.
 
 పల్లోంజీ మిస్త్రీ (86)..
 అత్యంత సంపన్నుల్లో ఒకరైనప్పటికీ.. ప్రచారార్భాటాలకు దూరంగా ఉంటారు మిస్త్రీ. నిర్మాణ రంగానికి చెందిన ఆయన వ్యాపార సామ్రాజ్యం భారత్‌తో పాటు దక్షిణాసియా, ఆఫ్రికాల్లో కూడా విస్తరించింది. గతేడాది ఫోర్బ్స్ లెక్కల ప్రకారం 14.7 బిలియన్ డాలర్ల సంపదతో.. అత్యంత సంపన్న భారతీయుల్లో ఆయనకు 5వ స్థానం లభించింది. టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ.. పల్లోంజీ కుమారుడే. టాటా సన్స్‌లో ఆయనకు 18.4% వాటాలు ఉన్నాయి. మీడియాలో ఎక్కువగా కనిపించని పల్లోంజీని ‘ఫాంటమ్ ఎట్ బాంబే హౌస్’గా(ముంబైలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం) అబ్బురంగా పిలుచుకుంటారు.
 
 ఆర్‌సీ భార్గవ (81)..
 ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా బోర్డు చైర్మన్‌గా ఉన్నారు ఆర్‌సీ భార్గవ. ఒకప్పుడు కేంద్ర ఇంధన శాఖ,  కేబినెట్ సెక్రటేరియట్‌లో సంయుక్త కార్యదర్శిగా కీలక హోదాల్లో పనిచేసిన భార్గవ.. 1981లో మారుతీలో చేరారు. కంపెనీని దిగ్గజంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు.
 
 అజయ్ బంగా (55)..
 అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల్లో బంగా ఒకరు. మాస్టర్‌కార్డ్ సీఈవోగా 2010 జూలై 1 నుంచి ఆయన వ్యవహరిస్తున్నారు. అంతకుముందు 13 ఏళ్ల పాటు సిటీబ్యాంక్‌లో పనిచేశారు. దానికన్నా ముందు రెండేళ్ల పాటు పెప్సీకోలో ఉన్నారు. భారత్‌లో పెప్సీకో ఫాస్ట్‌ఫుడ్ ఫ్రాంచై జీలను ప్రారంభించడంలో కీలకపాత్ర పోషించారు.
 
 దిలీప్ శాంతిలాల్ సంఘ్వీ (59)..
 తొలితరం వ్యాపారవేత్త సంఘ్వీ. జనరిక్, బ్రాండెడ్ ఔషధాలు తయారు చేసే దేశీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మాను 1982లో ప్రారంభించారాయన. ఎక్కువగా ప్రచారాల ఊసుకు వెళ్లని సంఘ్వీ.. దేశంలోనే అత్యంత లాభదాయక ఫార్మా కంపెనీల్లో ఒకటిగా సన్ ఫార్మాను తీర్చిదిద్దారు.  అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో ముకేశ్ అంబానీ తర్వాత రెండో స్థానంలో ఉన్నారు సంఘ్వీ.
 
 సౌరభ్ శ్రీవాస్తవ (69)..
 దాదాపు 4.5 బిలియన్ డాలర్ల బహుళజాతి ఐటీ సంస్థ సీఏ టెక్నాలజీస్ భారత విభాగానికి సారథ్యం వహిస్తున్నారు శ్రీవాస్తవ. దేశంలోనే పేరొందిన ఐటీ దిగ్గజాలు, ఏంజెల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టుల్లో ఆయన కూడా ఒకరు. ఐఐఎస్ ఇన్ఫోటెక్ సంస్థను స్థాపించారాయన. ఇది కార్యకలాపాలు ప్రారంభించిన నాలుగేళ్లలోనే టాప్ 20 దేశీ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. శ్రీవాస్తవ 50పైగా స్టార్టప్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారు.
 
 ధీరూభాయ్ అంబానీ ..
 వేల కోట్ల విలువ చేసే రిలయన్స్ ఇండస్ట్రీస్ మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ..(ధీరూభాయ్ అంబానీ) గుజరాత్‌లోని మారుమూల ప్రాంతంలోని స్కూలు మాస్టారు కుమారుడి స్థాయి నుంచి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగారు. 1932 డిసెంబర్‌లో జన్మించారాయన. యెమెన్‌లోని ఎడెన్‌లో ఒక ఆయిల్ కంపెనీలో పెట్రోల్ బంకు అటెండెంట్‌గా కూడా పనిచేసిన ఆయన 1958లో భారత్ తిరిగొచ్చారు. పాలిస్టర్ దిగుమతులు, సుగంధ ద్రవ్యాల ఎగుమతుల కోసం రిలయన్స్ ట్రేడింగ్ కార్పొరేషన్‌ను ప్రారంభించారు.
 
 ఇదే ఆ తర్వాత రిలయన్స్ టెక్స్‌టైల్స్ కార్పొరేషన్‌గాను.. చివరికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌గాను మారింది. భారత్‌కి తిరిగొచ్చేనాటికి అంబానీకి 26 ఏళ్లు. ఆపై ఎనిమిదేళ్ల తర్వాత 1966లో తమ తొలి టెక్స్‌టైల్ మిల్లును అహ్మదాబాద్ దగ్గర్లోని నరోదాలో ప్రారంభించారు. 1978 జనవరిలో బాంబే, అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో రిలయన్స్‌ను లిస్టింగ్ చేశారు. అటుపైన 1980లలో పాలిస్టర్ ప్లాంటును ఏర్పాటు చేశారు. 1990లలో పెట్రోకెమికల్స్, ఆయిల్ రిఫైనింగ్, టెలికమ్యూనికేషన్స్, ఆర్థిక సేవలు తదితర రంగాల్లోకి రిలయన్స్ సామ్రాజ్యం విస్తరించింది. 1976-77లో రిలయన్స్ టర్నోవరు రూ. 70 కోట్లు. 2002 జులై 6న 70 ఏళ్ల వయస్సులో ధీరుభాయ్ కన్ను మూసేనాటికి కంపెనీ టర్నోవరు ఏకంగా రూ. 75,000 కోట్లకు ఎగిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement