పుంజుకున్న కార్ల అమ్మకాలు
- మోడీ మేజిక్
- ఎక్సైజ్ సుంకం తగ్గింపు కొనసాగించాలి: సియామ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: వరుసగా రెండు నెలలుగా క్షీణిస్తూ వచ్చిన కార్ల అమ్మకాలు మే నెలలో కాస్త పుంజుకున్నాయి. అలాగే వరుసగా ఎనిమిది నెలలుగా తగ్గుతూ వస్తున్న ప్రయాణికుల వాహనాల అమ్మకాలు కూడా మేలో పెరిగాయి. ఎన్నికల అనంతరం సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడటంతో గత నెలలో కార్ల అమ్మకాలు 3 శాతం పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది. సెంటిమెంట్ మెరుగుపడిందని, ఎంక్వైరీలు పెరుగుతున్నాయని, అమ్మకాలు కూడా పుంజుకుంటున్నాయని సియామ్ డెరైక్టర్ జనరల్ విష్ణు మాధుర్ వెల్లడించారు.
అయితే పరిస్థితులు మెరుగుపడ్డాయని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. సుదీర్ఘకాలంగా అమ్మకాల్లేక కుదేలైన వాహన రంగం కోలుకోవాలంటే ప్రభుత్వం తోడ్పాటు తప్పనిసరని పేర్కొన్నారు. మధ్యంతర బడ్జెట్‌లో అందించిన ఎక్సైజ్ సుంకం తగ్గింపును కొనసాగించాలని కోరుతున్నామని, అలాగే జీఎస్‌టీను అమలు చేయాలని సూచించారు. ఆర్థిక వృద్ధి జోరు పెంచడానికి పారిశ్రామిక ప్రాజెక్ట్‌లకు పర్యావరణ అనుమతిలివ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వం అత్యవసర ప్రణాళికలకు సిద్ధంగా ఉందని, ఫలితంగా వర్షాలు సరిగ్గా కురవకపోయినా, వాహనరంగంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆయన వెల్లడించిన గణాంకాల ప్రకారం.. .
* గత ఏడాది మేలో 1,44,132గా ఉన్న దేశీయ కార్ల అమ్మకాలు, ఈ ఏడాది మేలో 1,48,577కు పెరిగాయి.
* ఫిబ్రవరిలో 1 శాతం పెరిగిన కార్ల అమ్మకాలు మార్చిలో 5 శాతం, ఏప్రిల్‌లో 10 శాతం చొప్పున క్షీణించాయి.
* స్కూటర్ల అమ్మకాలు 2,65,892 నుంచి 34 శాతం వృద్ధితో 3,57,564కు పెరిగాయి. హోండా మోటార్, సైకిల్స్ ఇండియా స్కూటర్ల అమ్మకాలు 41 శాతం, హీరో మోటొకార్ప్ అమ్మకాలు 15 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఇక టీవీఎస్ మోటార్ కంపెనీ స్కూటర్ల అమ్మకాలు కూడా 59 శాతం వృద్ధి సాధించాయి.
* వాణిజ్య వాహనాల విక్రయాలు 55,458 నుంచి 15 శాతం క్షీణించి 46,986కు పడిపోయాయి. ఈ సెగ్మెంట్ వాహన విక్రయాలు క్షీణించడం ఇది వరుసగా 19వ నెల.
* మొత్తం మీద అన్ని సెగ్మెంట్ల వాహన విక్రయాలు 14,99,893 నుంచి 13 శాతం వృద్ధితో 16,98,138కు పెరిగాయి.