న్యూఢిల్లీ: చైనాలో వ్యాపించి, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేపుతున్న కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..కరోనా వైరస్ ప్రభావం భారత్‌పై స్వల్పమే అని అన్నారు. అంతర్జాతీయంగా చైనా ఆర్థిక వ్యవస్థ విస్తరించడం వల్ల ప్రపంచ వృద్ధి రేటు, వాణిజ్యంపై కరోనా వైరస్ ప్రభావం పడనుందని తెలిపారు. దేశంలో పలు రంగాలు కొంత మేర ప్రభావానికి లోనయినా, వాటిని పరిష్కరించడానికి మార్గాలను అన్వేషించామని అన్నారు. చైనా ఆర్థక వ్యవస్థ మందగమనం వల్ల దేశీయ ఫార్మా, ఎలక్ట్రానిక్ రంగాలపై కొంత మేర ప్రభావం పడవచ్చని అభిప్రాయపడ్డారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు చైనా అతిపెద్ద భాగస్వామి అని, చైనాలో జరిగే ప్రతి అంశాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. చైనా నుంచి భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంటుందని అన్నారు. దేశీయ ఫార్మా రంగానికి సంబంధించిన ముడి పదార్ధాలను చైనాను నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఈ సమస్యలను అధిగమించడానికి ఇతర ఆసియా దేశాల నుంచి ముడిసరుకులను దిగుమతి చేసుకోవడానికి భారత్ ప్రమత్నిస్తుందని తెలిపారు. చైనాకు భారత్ ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై కొంత మేర ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment