కరోనా భయానికి గుడ్‌బై చెప్పండి! | Coronavirus Scare: Top 5 Games For Self Quarantine | Sakshi
Sakshi News home page

ఫోన్‌ పట్టండి, కరోనా చింత వీడండి!

Published Wed, Mar 18 2020 11:54 AM | Last Updated on Wed, Mar 18 2020 2:44 PM

Coronavirus Scare: Top 5 Games For Self Quarantine - Sakshi

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా మహమ్మారి చాప కింద నీరులా అన్ని దేశాలకు విస్తరించింది. దాని భయంతో గడప దాటాలాంటేనే జనాలు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వాలు సైతం గుంపులుగా వెళ్లకండి, సమూహాలుగా జత కట్టకండి అంటూ ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తున్నాయి. మరి రోజంతా ఇంట్లో ఉండాలంటే అది అయ్యేపనేనా.. ఎన్నిరోజులని ఒంటరిగా స్వీయనిర్భందం చేసుకుంటాం. పోనీ అన్ని గంటలు ఒక్కరమే ఉండాలంటే మనకు తోడుగా ఓ వ్యాపకం ఉండాల్సిందే. దీనికి ఫోన్‌ను మించిన అవకాశం మరొకటి లేదు. కాబట్టి మీకు బోర్‌ కొట్టకుండా ఉండాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో కింద చెప్పుకునే గేమ్స్‌ వేసుకోండి. పైగా వీటిని ఎలాంటి రుసుము లేకుండా ప్లేస్టోర్‌లో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం ఉంది. మరింకెందుకాలస్యం.. వెంటనే ఫోన్‌ అందుకో.. గేమ్‌ ఆడుకో..


ఎయిట్‌ బాల్‌ పూల్‌: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది డౌన్‌లోడ్‌ చేసుకున్న గేమ్స్‌లో ఇది కూడా ఒకటి. ఇది తప్పకుండా మీకు మజా ఇస్తుంది. ప్రత్యర్థుకు పోటీనిస్తూ ఎక్కువ స్కోర్‌ సాధించుకునే అవకాశం ఉంది.

సబ్‌వే సర్ఫర్స్‌: చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ మెచ్చే గేమ్‌ ఇది. ఓ పిల్లవాడు తన ఎదురుగా ఉండే కాయిన్స్‌ను అందుకుంటూ వెళ్లాలి. క్రమక్రమంగా వేగం పుంజుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఎదురుగా వచ్చే రైళ్లను ఢీ కొట్టకుండా తప్పించుకు పరుగెత్తాలి. ఎన్నిసార్లు ఆడినా అస్సలు బోర్‌ కొట్టదు. ఆడిన ప్రతిసారీ ఇంతకుమించి హైస్కోర్‌ చేయాలనే ఉద్దేశంతో మళ్లీ మళ్లీ ఆడాలనిపిస్తుంది. (కోస్తా తీరంలో కంబళ.. ఎలా ఆడతారంటే)


క్యాండీ క్రష్‌ సోడా సాగా: ఈ గేమ్‌ తెలియనివారు దాదాపుగా ఉండనే ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇది పాత గేమే అయినప్పటికీ ఇప్పటికీ దీనికి విపరీతమైన క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా ఎప్పుడూ టూర్‌లు గట్రా అంటూ తిరిగే వారికి ప్రయాణంలో దీన్ని మించిన తోడు ఉండదు.

లూడో కింగ్‌: ఇది తప్పకుండా మీకందరికీ సుపరిచితమైన గేమ్‌. ఒకప్పుడు ఇంట్లో అందరూ కలిసి ప్రత్యక్షంగా ఆడుకునేవాళ్లు. ఇప్పుడు మొబైల్‌ ఫోన్‌ వచ్చాక దీన్ని కాస్త ఆధునీకరించి ఆన్‌లైన్‌లో పరోక్షంగా ఆడుతున్నారు. ఆఫ్‌లైన్‌లో కంప్యూటర్‌తో, ఇంటిసభ్యులతో ఆడుకునే సదుపాయం ఉండగా ఆన్‌లైన్‌లో ప్రపంచంలో ఎవరితోనైనా ఆడవచ్చు.

ప్లేయర్స్‌ అన్‌నౌన్‌ బ్యాటిల్‌గ్రౌండ్స్‌(పబ్జీ): చివరగా చెప్పుకునే ఈ గేమ్‌ ఈపాటికే చాలామంది మొబైల్స్‌లో ఇన్‌స్టాల్‌ అయి ఉంటుంది. సాధారణ గేమ్స్‌ కన్నా ఇది కాస్త భిన్నం. అడ్వెంచర్స్‌ను ఇష్టపడేవాళ్లకు ఈ గేమ్‌ తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి పబ్జీ ఆడటానికి అలవాటుపడ్డారంటే.. ప్రపంచంలో ఏం జరుగుతున్నా అది మీకు సంబంధం లేనట్టే వ్యవహరిస్తారు. అంతలా అందులో తలమునకలవుతారు. ఈ గేమ్‌లో ఒకరినొకరు కాల్చిచంపుకునే విధ్వంసం కూడా ఉంటుంది. కానీ అది గేమ్‌వరకే పరిమితం. ఈ గ్రాఫిక్‌ గేమ్‌ ప్రస్తుత యూత్‌కు మోస్ట్‌ ఫేవరెట్‌ గేమ్‌గా నిలిచిపోయింది. (పబ్‌జీ సరికొత్త వెర్షన్‌; వారి పరిస్థితేంటో..!)

ఇలాంటి మరెన్నో గేమ్స్‌ ప్లేస్టోర్‌ ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. మీ అభిరుచిని బట్టి వాటినీ ఓసారి ట్రై చేయండి. దీంతోపాటు టీవీలో కార్టూన్స్‌, సినిమాలు చూస్తూ ఎంజాయ్‌ చేయండి. కుదిరితే పుస్తకాలతో కుస్తీ పట్టండి. ఈ విధంగా కరోనా భయాన్ని మీ దరి దాపుల్లోకి రాకుండా నిలువరించండి. కానీ, ఏదేమైనా వైద్యులు, ప్రభుత్వాల సూచనలు మాత్రం తూచ తప్పకుండా పాటించండి.. కరోనా భయానికి గుడ్‌బై చెప్పండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement