
ఇన్ఫోసిస్ లో కోటీశ్వరులు తగ్గారు!
టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీలో కోటీశ్వరులైన ఉద్యోగుల సంఖ్య పడిపోయిందట. కంపెనీ వార్షిక రిపోర్టు ప్రకారం 2014-15లో 113గా ఉన్న సంపన్న ఉద్యోగులు, 2015-16 ఆర్థిక సంవత్సరానికి 54కి పడిపోయారట. దీనికి గల ప్రధాన కారణం కంపెనీ నుంచి ఉద్యోగులు బయటికి వెళ్తుండటమేనని వార్షిక రిపోర్టు నివేదించింది. భారత్ లో రెండో అతిపెద్ద స్టాఫ్ట్ వేర్ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్, గతేడాది ఉద్యోగులకు ప్రమోషన్లను, బోనస్ లను ఇవ్వడం వల్ల కోటీశ్వరుల జాబితా పెరిగింది.
అయితే ఈ ఏడాది ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్ లకు మాత్రమే వన్ టైమ్ బోనస్ లు అందించింది. దీంతో విశ్లేషకులు అంచనా వేసిన విధంగానే ఇన్ఫోసిస్ లో సంపన్న ఉద్యోగుల జాబితా తగ్గింది. అయితే ఏడాదికి రూ.60 లక్షల వేతనం ఆర్జించే ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాదిలో 260కి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం నాటికి రూ.60 లక్షల వేతనం ఆర్జించేవారు కేవలం 200 మందే ఉన్నారు.
కంపెనీ నుంచి ఉద్యోగులు బయటికి వెళ్తుండటంతో సంపన్న ఉద్యోగుల జాబితా 2016-17లో మరింత తగ్గుతుందని ఇన్ఫోసిస్ వార్షిక రిపోర్టులో నివేదించింది. గతేడాది ఇన్ఫోసిస్ కు రాజీనామా చేసిన వెళ్లిన మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ రాజీవ్ బన్సాల్, ఏడాదికి రూ.10 కోట్లకు పైగా వేతనం ఆర్జించేవారు. ఏడాదికి రూ.60 లక్షలకు పైగా వేతనం ఆర్జించే వారిలో దాదాపు 70 మంది ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీ నుంచి బయటికి వెళ్లినట్టు వార్షిన నివేదిక వెల్లడించింది.
అదేవిధంగా ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.48.73 కోట్ల వేతనం ఆర్జిస్తున్నారని కంపెనీ తెలిపింది. సీఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు 2014 ఆగస్టులో ఆయన వేతనం కేవలం రూ.4.56 కోట్లగా మాత్రమే. ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావ్ ఈ ఏడాది రూ.9.28కోట్ల సాలరీ పొందుతున్నారు. 2016 మార్చి 31 వరకు ఇన్ఫోసిస్ లో 1.94 లక్షల పైగా ఉద్యోగులున్నారు.