ముస్తఫా 'దేవుణ్ని' నమ్మాడు..
ఏ వ్యాపారమైనా కానివ్వండి.. అత్యంత కీలకమైన బిల్ కౌంటర్ లేని దుకాణాన్ని చూశారా? పోనీ, రెస్టారెంట్ లో డబ్బులు తీసుకునేవాళ్లు లేకపోవటాన్ని ఊహించారా? అయితే ఈ కథనం మీకోసమే. పెట్టుబడికి తోడు కస్టమర్లపై కాసింత నమ్మకాన్నీ ఉంచాడో యువ పారిశ్రామికవేత్త. ఇంతకీ అతడు చేసిందేమంటే.. షాపులో బిల్ కౌంటర్, సేల్స్ పర్సన్స్ ను ఎత్తేయటం!
'వినియోగదారుడే దేవుడు(కస్టమర్ ఈస్ గాడ్)' అనే నానుడిని అక్షరాలా పాటించి దైవ(కస్టమర్)కటాక్షం పొందుతున్న ఈ యువకుడిపేరు పీ.సీ. ముస్తఫా. ఊరు ఐటీ రాజధాని బెంగళూరు. 'ఐడీ ఫ్రెష్' పేరుతో అతను ప్రారంభించిన ఈజీ ఫుడ్ స్టాల్స్ లో సేల్స్ పర్సన్స్ ఉండరు. బిల్ కౌంటర్ లేదు. కమ్ సే కమ్ సీసీటీవీ కెమెరా కూడా ఏర్పాటుచేయలేదు. స్టోర్ లో నుంచి పసందైన బ్రేక్ ఫాస్టో, లంచ్ ప్యాకో తీసుకుని పక్కనే ఉన్న బాక్సులో నగదు వేయాలి. అంతే.
టెక్కీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో 17 'ఐడీ ఫ్రెష్'లను ప్రారంభించిన ముస్తఫా వాటిద్వారా రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌లను ఆఫర్ చేస్తున్నాడు. వినియోగదారులను విశ్వసించడమే తన వ్యాపారానికి బలమంటున్న ముస్తఫా ఈ దుకాణాలను 24 గంటలు తెరిచి ఉంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పాడు. జాబ్ టైమింగ్స్ ను బట్టి స్టాక్ నింపుతామని, ఉద్యోగులే కాకుండా అపార్ట్‌మెంట్ల నుంచి కూడా 90శాతం కలెక్షన్ వస్తున్నదని హర్షం వ్యక్తంచేశారు ముస్తఫా. బెంగళూరులో విజయవంతమైన ఈ ప్రాజెక్టును త్వరలోనే హైదరాబాద్, చెన్నై, ముంబైలకు విస్తారిస్తానని ధీమాగాచెబుతున్నాడు. అన్నట్టు మనోడు ఐఐఎం బాబే విద్యార్థి. కోర్సు మధ్యలోనే వదిలేసి, సొంత కంపెనీ పెట్టి సక్సెస్ బాటలో పయనిస్తున్నాడు. ప్రస్తుతం అతని కంపెనీ విలువ రూ.7 కోట్ల పైమాటే!