ఏసీలు, ఫ్రిజ్‌లూ మేకిన్‌ ఇండియా! | Cyber Monday deals 2018 on TVs, smartphones | Sakshi
Sakshi News home page

ఏసీలు, ఫ్రిజ్‌లూ మేకిన్‌ ఇండియా!

Published Tue, Nov 27 2018 12:24 AM | Last Updated on Tue, Nov 27 2018 5:31 AM

Cyber Monday deals 2018 on TVs, smartphones - Sakshi

ముంబై: మోదీ సర్కారు మేకిన్‌ ఇండియా నినాదం స్మార్ట్‌ఫోన్లు... టీవీల తయారీ రంగంలో బాగానే పనిచేస్తోంది. ఈ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసేందుకు విదేశీ కంపెనీలన్నీ పెట్టుబడులకు ముం దుకొచ్చాయి. మరి ఇప్పుడు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, ఎయిర్‌ కండీషనర్లు వంటి వైట్‌ గూడ్స్‌ ఉత్పత్తి కంపెనీలు కూడా మేకిన్‌ ఇండియాను తలకెత్తుకోవడానికి సిద్ధమయ్యాయి. ఒకపక్క, ఆయా ఉత్పత్తులు, సంబంధిత విడిభాగాల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీగా దిగుమతి సుంకాలను వడ్డించడంతో పాటు ఇటీవల కాలంలో డాలరుతో రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణించ డం కూడా విదేశీ వైట్‌ గూడ్స్‌ కంపెనీల మేకిన్‌ ఇండి యా రాగానికి బాటలు వేసింది. వచ్చే రెండేళ్లలో ఈ కంపెనీలు ఏకంగా రూ.6,500 కోట్ల పెట్టుబడులను దేశీయంగా కుమ్మరించనుండటం దీనికి నిదర్శనం. 

సుంకాల మోత... 
మేకిన్‌ ఇండియాలో భాగంగా భారత్‌లో తయారీని ప్రోత్సహించి... తద్వారా ఇక్కడ మరింతగా ఉద్యోగాలను సృష్టించాలనేది ప్రభుత్వ సంకల్పం. అయితే, ఇప్పటివరకూ ఈ జాబితాలో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం టీవీలు, స్మార్ట్‌ఫోన్‌ దిగుమతులపై దిగుమతి సుంకాలను 20 శాతానికి పెంచింది. వీటికి సంబంధించిన విడిభాగాలపై కూడా ఈ ఏడాది సుంకాన్ని పెంచడంతో తప్పనిసరిగా ఆయా కంపెనీలు మేకిన్‌ ఇండియాకు ఓకే చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే పరిస్థితి వైట్‌ గూడ్స్‌ రంగంలోనూ పునరావృతం అవుతోంది. రూపాయి ఘోరంగా పతనం కావడంతో కొన్ని అత్యవసరం కాని ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను కేంద్రం పెంచడం తెలిసిందే. ఇందులో వాషింగ్‌ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లపై సుంకాలను ఈ ఏడాది సెప్టెంబర్‌లో రెట్టింపు చేసి 20 శాతానికి చేర్చారు. అదేవిధంగా ఏసీలు, ఫ్రిజ్‌ల కంప్రెషర్లపైనా దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. దీంతో దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల ధరలు 10% ఎగబాకాయి. దేశీయంగా వైట్‌గూడ్స్‌ పరిశ్రమ ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.30,000 కోట్లుగా అంచనా. ఇది ఏటా 7–8% వృద్ధి చెందుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 

విదేశీ దిగ్గజాల క్యూ.. 
వైట్‌ గూడ్స్‌కు సంబంధించి జర్మనీకి చెందిన బాష్, సీమెన్స్, టర్కీ కంపెనీ ఆర్సెలిక్, చైనా సంస్థ మైడియా, హేయర్, టీసీఎల్, జపాన్‌ కంపెనీ పానాసోనిక్‌ వంటివి భారత్‌లో కొత్తగా తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు, ఉన్నవాటిని విస్తరించేందుకు సిద్ధమయ్యాయి. వీటికి తోడు దేశీయ సంస్థలైన గోద్రెజ్, బీపీఎల్‌ కూడా పెట్టుబడి ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. షాంగై హిటాచీ ఎలక్ట్రికల్‌ అప్లయెన్సెస్‌ కంపెనీ... గుజరాత్‌లో కంప్రెషర్‌ యూనిట్‌ను విస్తరిస్తోంది. జపాన్‌ సంస్థ హిటాచీ, చైనా కంపెనీ షాంగై హైలీ గ్రూప్‌ల జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఇది. చైనాకు చెందిన గ్వాంగ్‌డాంగ్‌ మీజి కంప్రెషర్‌ కంపెనీ కూడా కొత్త ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. కూలింగ్‌ యూనిట్లలో ఉపయోగించే పరికరాలను ఇది తయారు చేయనుంది.  కాగా, కంపెనీలు ప్రారంభ, మధ్య స్థాయి వైట్‌ గూడ్స్‌ ఉత్పత్తులను మాత్రమే దేశీయంగా తయారు చేస్తున్నాయి. ప్రీమియం మోడళ్లతోపాటు సంక్లిష్లమైన విడిభాగాల(హీట్‌ ఎక్సే్ఛంజ్‌ కాయిల్స్, కంప్రెషర్స్‌ వంటివి) విషయంలో మాత్రం దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ఎయిర్‌ కండిషర్లలో అయితే, ఏకంగా 50% విడిభాగాలు దిగుమతి చేసుకున్నవే ఉంటున్నాయి. కాగా, రానున్న కాలంలో మరింతగా దిగుమతి సుంకాలు పెరగవచ్చని.. దీంతో ఇక్కడే ప్లాంట్లను ఏర్పాటు చేయడం ఉత్తమం అని కంపెనీలు భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నారు. ‘అంతేకాకుండా భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉన్న దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదాని కంటే స్థానికంగా తయారు చేస్తేనే ఉత్పాదక వ్యయం తగ్గుతుందని చాలా కంపెనీలు నిర్ణయానికి వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ తక్కువ వేతనాలకే కార్మికులు లభిస్తారు.  దిగుమతులకు భారీగా రవాణా చార్జీలు చెల్లించక్కర్లేదు కూడా. డాలరుతో రూపాయి విలువ పతనం కూడా దిగుమతులకు భారంగా పరిణమిస్తోంది’ అని గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌ కమల్‌ నంది వ్యాఖ్యానించారు. కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయెన్సెస్‌ తయారీదారుల సంఘం    (సీమా) ప్రెసిడెంట్‌ కూడా ఆయన.  

జోరుగా పెట్టుబడులు...
‘తాజాగా కేంద్రం సుంకాలను పెంచడంతో మేం స్థానికంగా తయారీపై పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే కష్టమే’ అని బీఎస్‌హెచ్‌ హౌస్‌హోల్డ్‌ అప్లయెన్సెస్‌ ఎండీ గుంజన్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ సంస్థ భారత్‌లో బాష్, సీమెన్స్‌ ఉత్పత్తులను విక్రయిస్తోంది. చెన్నైకి సమీపంలోని ఫ్యాక్టరీలో బీఎస్‌హెచ్‌ ఇటీవలే వాషింగ్‌ మెషీన్ల తయారీని ప్రారంభించింది. ఇక్కడే రూ.800 కోట్ల పెట్టుబడితో ఫ్రిజ్‌ల ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. 

∙చైనాకు చెందిన మైడియా గ్రూప్‌ ఇటీవలే రూ.1,350 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో సగం కంప్రెషర్ల తయారీ కోసం వెచ్చించనుంది. చైనా వెలుపల తమకు ఇదే అతిపెద్ద పెట్టుబడి అని కంపెనీ ఇండియా ఎండీ క్రిషన్‌ సచ్‌దేవ్‌ తెలిపారు. 

∙చైనాలో అతిపెద్ద అప్లయెన్సెస్‌ తయారీ సంస్థ హేయర్‌ కూడా నోయిడాలో కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.3,000 కోట్ల  పెట్టుబడులను ఖరారు చేసింది. పుణేలో ఈ సంస్థ యూనిట్‌తో పోలిస్తే ఈ పెట్టుబడి మూడింతలు ఎక్కువ కావడం విశేషం. నోయిడా ప్లాంట్‌లో విడిభాగాలతో పాటు ప్రీమియం మోడళ్లను ఉత్ప త్తి చేస్తామని హేయర్‌ అప్లయెన్సెస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగాంజా పేర్కొన్నారు. 

∙తాము స్థానికంగా ఏసీ కంప్రెషర్లు ఇతరత్రా విడిభాగాల తయారీ కోసం సప్లయర్లతో చర్చలు జరుపుతున్నట్లు జపాన్‌ దిగ్గజం పానాసోనిక్‌ ఇండియా సీఈఓ మనీష్‌ శర్మ వెల్లడించారు. 

∙ఇక మరో చైనా ఎలక్ట్రానిక్స్‌ అగ్రగామి టీసీఎల్‌ కార్పొరేషన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వద్ద నెలకొల్పుతున్న రూ.2,000 కోట్ల ప్లాంట్‌లో వైట్‌ గూడ్స్, విడిభాగాల తయారీని వచ్చే ఏడాదిలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇక్కడ టీవీలను కూడా తయారు చేస్తామని కంపెనీ ఇండియా హెడ్‌ మైక్‌ చెన్‌ చెప్పారు. 

∙టర్కీ కంపెనీ ఆర్సెలిక్‌ టాటా కంపెనీ వోల్టాస్‌తో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. గుజరాత్‌లో తయారీ ప్లాంట్‌ కోసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement