
హైదరాబాద్‌లో ‘సైకిల్స్’ రెస్టారెంట్
• ఒకేచోట ఫుడ్, సైకిళ్ల విక్రయం
• జూబ్లీహిల్స్‌లో చిక్లో కేఫ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెస్టారెంట్, బార్, సైకిల్ స్టోర్.. అన్నీ ఒకేచోట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. చెన్నైలో విజయవంతంగా నడుస్తున్న చిక్లో కేఫ్ ఇప్పుడు హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. సైకిళ్ల తయారీ దిగ్గజం టీఐ సైకిల్స్, హాస్పిటాలిటీ రంగంలో ఉన్న అబ్సొల్యూట్ స్పెషాలిటీ సంయుక్తంగా చిక్లో కేఫ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. ఇక్కడి జూబ్లీహిల్స్‌లో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రంలో టీఐ సైకిల్స్‌కు చెందిన బీఎస్‌ఏ, హెర్క్యూలెస్, ట్రాక్ అండ్ ట్రయల్‌తోపాటు రిడ్లే, బియాంకీ, కనోండేల్, మోంగూస్, ష్విన్, మోంట్రా వంటి విదేశీ బ్రాండ్ల సైకిళ్లు కొలువుదీరాయి. రూ.5 వేలు మొదలుకొని రూ.8 లక్షల వరకు ధరగల మోడళ్లను ఇక్కడ విక్రయిస్తారు. అద్దెకు సైతం సైకిళ్లు లభిస్తాయి.
విక్రయాలను ప్రోత్సహించేందుకే..: 160 సీట్ల సామర్థ్యం గల రెస్టారెంట్‌తోపాటు బార్ సైతం చిక్లో కేఫ్‌లో అదనపు ఆకర్షణ. సైకిళ్ల విక్రయాలను ప్రోత్సహించేందుకే ఈ కాన్సెప్ట్‌ను పరిచయం చేశామని టీఐ సైకిల్స్ ప్రెసిడెంట్ అరుణ్ అలగప్పన్ తెలిపారు. అబ్సొల్యూట్ స్పెషాలిటీ వ్యవస్థాపకుడు ఆశిష్ థడానితో కలసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. యూరప్, జపాన్ తర్వాత భారత్‌లోనే ఇలాం టి కేఫ్ అందుబాటులోకి వచ్చిందన్నారు. గుర్‌గావ్, బెంగళూరు, కోయంబత్తూరులో ఏప్రిల్ నాటికి చిక్లో కేఫ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. మూడేళ్లలో 20 దాకా కేంద్రాలను నెలకొల్పుతామని చెప్పారు. ఒక్కో సెంటర్‌కు రూ.4 కోట్ల దాకా వ్యయం అవుతోంది.