పెట్రోల్,డీజిల్ ధరలు ఎంత తగ్గాయో తెలుసా?
పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజువారీ మార్పులతో వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుంది. గత నెల నుంచి అవలంభిస్తున్న ఈ విధానంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినట్టు తెలిసింది. లీటర్ పెట్రోల్‌పై ఇప్పటి వరకు రెండు రూపాయలకు పైగా తగ్గగా.. డీజిల్‌పై రూపాయి మేర కిందకి పడిపోయింది. జూన్ 16 నుంచి కొత్తగా పెట్రోల్, డీజిల్ ధరలను రోజూవారీ మారుస్తున్నారు. ప్రతిరోజు ఉదయం ఆరుగంటలకు ఈ రేట్లలో మార్పు కనిపిస్తోంది. ఈ రోజువారీ సమీక్ష పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పెట్రోల్ ధరలు లీటరుకు రూ.2.40 తగ్గాయి. అంతేకాక, డీజిల్ ధర కూడా లీటరుకు రూ.1.05 తగ్గింది. జూన్ 16న ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.65.48గా, డీజిల్ రూ.54.49గా ఉండగా... నేడు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.63.08గా, డీజిల్ ధర రూ.53.44గా నమోదవుతోంది.
అంతకముందు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ప్రతి 15రోజులకు ఒకసారి చూసేవాళ్లం. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇంధన కంపెనీలు ఆ సమీక్ష చేపట్టేవి. కొత్త విధానంతో అంతర్జాతీయం క్రూడ్ ఆయిల్ ధరల్లో రోజువారీ మార్పులు వెనువెంటనే దేశీయ వినియోగదారులకు చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. తొలుత మే 1 నుంచే ఉదయ్ పూర్, జంషెడ్పూర్, విశాఖపట్నం, ఛండీగర్, పుదుచ్చేరిలో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. అనంతరం దేశమంతటా దీన్ని ప్రవేశపెట్టింది. ఇటీవల కాలంలో గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోతున్నాయి. దీంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిపోతున్నాయి.