పెట్రోల్ ధరెంత పెరిగిందో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజువారీ మార్పులు వినియోగదారులకు భారీగానే నడ్డి విరుస్తున్నాయి. జూలై 1 నుంచి ఇప్పటివరకు పెట్రోల్ ధరలు లీటరుకు రూ.5.79 పైసలు మేర పెరిగాయి. జూలై 1 దేశరాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.63.09, రూ.53.33గా ఉంటే, నిన్న(బుధవారం) సమీక్షించిన లీటరు పెట్రోల్ ధర రూ.68.88, లీటరు డీజిల్ ధర రూ.57.06గా నమోదైంది. ప్రభుత్వం వీటికి జీఎస్టీ నుంచి విముక్తి కల్పించినప్పటికీ, పలు రాష్ట్రాలు, కేంద్రం వేస్తున్న లెవీలు మాత్రం ధరలపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. అయితే అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ, ఆ ప్రయోజనాలు ప్రజలకు చేరడం లేదని ఓ వైపు నుంచి విపక్షాలు, ప్రభుత్వంపై మండిపడుతూనే ఉన్నాయి.
అంతర్జాతీయ ధరలు దిగొస్తుంటే దేశీయ ధరలు తగ్గాల్సింది పోయి, ఎక్సైజ్ పెరుగుతుందని, ఈ ప్రభావం ధరలపై పడుతుందని సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఇది చాలా అన్యాయమంటూ ఆయన ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. కాగ, జూన్ 16 నుంచి ఇంధన ధరల్లో రోజువారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం 6 గంటలకు రోజూ ఇంధన ధరలు బంకుల వద్ద మారుతాయి. అంతకముందు వరకు ఈ ధరలను ఆయిల్ కంపెనీలు 15 రోజులకు ఒక్కసారి సమీక్షించేవి. రోజువారీ ధరల విధానం ప్రభుత్వం ప్రవేశపెట్టే వరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పలుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేవి.