భారత్‌కు వర్షాభావ గండం.. | Danger to by deficient rainfall in India | Sakshi
Sakshi News home page

భారత్‌కు వర్షాభావ గండం..

Published Wed, Aug 19 2015 2:23 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

భారత్‌కు వర్షాభావ గండం.. - Sakshi

భారత్‌కు వర్షాభావ గండం..

రేటింగ్ సంస్థ మూడీస్ హెచ్చరిక
- 2015-16 వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 7శాతానికి కోత
- సంస్కరణల నత్తనడకా కారణం
- వచ్చే ఏడాది వృద్ధి జోరందుకుంటుందని అంచనా
న్యూఢిల్లీ:
ఆర్థిక విశ్లేషణ, రేటింగ్  సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ భారత్ వృద్ధి వేగానికి సంబంధించి ‘రెడ్ ఫ్లాగ్’ ఎగరవేసింది. దేశాభివృద్ధి వేగానికి వర్షాభావ పరిస్థితులు అడ్డంకయ్యే అవకాశం ఉందని అంచనావేసింది. దీనికితోడు సంస్కరణల అమలు ఆలస్యం ప్రతికూలతలూ ఆర్థిక రంగంపై ఉంటాయని పేర్కొంది. ఆయా అంశాలను కారణంగా చూపుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) వృద్ధి రేటును ఇంతకుముందు ప్రకటించిన 7.5 శాతం నుంచి 7 శాతానికి కుదించింది.  ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక ధోరణులపై మూడీస్ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ముఖ్యాంశాలను మూడీస్ విశ్లేషకులు అత్సీ సేథ్ తెలిపారు.
 
మూడు అంశాల ప్రాతిపదిక: మూడు ప్రమాణాల ప్రాతిపదికన తాజా అంచనాలను లెక్కించడం జరిగింది. మొదటి విషయానికి వస్తే- ఇటీవలి స్థూల ఆర్థిక, బ్యాంకింగ్ రుణ వృద్ధి గణాంకాలు నిరుత్సాహ పరుస్తున్నాయి. మందగమన ధోరణికి అద్దం పడుతున్నాయి. ఇక రెండవ విషయానికి వస్తే- వర్షపాతం. తగిన వర్షపాతం నమోదయితే- గ్రామీణ ఆదాయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఇది వృద్ది రేటుకు ప్రతికూలాంశమే. ఇక మూడవది అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు.  
 
నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు...
- పలు సంస్కరణల అమల్లో ఆలస్యం ప్రతికూల ప్రభావం చూపుతోంది.  ప్రత్యేకించి వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), భూ సేకరణ వంటి అంశాలు ఇక్కడ ప్రస్తావనాంశం. కేవలం రాజకీయ గందరగోళం వల్ల వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ కీలక బిల్లులకు ఆమోదం లభించలేదు.
- 7 శాతం వృద్ధి సాధించినా... ఇంత స్థాయిలో ఏ దేశమూ వృద్ధి సాధించే పరిస్థితి లేదు. అందువల్ల వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో భారత దేశమే కొనసాగుతుంది.
- అయితే వచ్చే ఏడాది మాత్రం భారత్ వృద్ధి మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. భారత్ వృద్ధి క్రియాశీలత పటిష్టత కొనసాగుతుంది. క్రమంగా సంస్కరణల అమలు, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులు పెరిగే అవకాశాలు దీనికి ప్రధాన కారణం.
- కమోడిటీ ధరలు తక్కువగా ఉన్న పరిస్థితుల వల్ల రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణం లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లో ఉండడం వల్ల వాస్తవ ఆదాయాలకు, వ్యయాలకు మద్దతు లభిస్తుంది. ఆర్థిక వ్యవస్థకు రానున్న రోజుల్లో ఇది సానుకూల అంశమే.
- 2015లో బ్రెంట్ ఆయిల్ ధర బేరల్‌కు సగటున 55 డాలర్లు ఉంటే ఇది 2016లో 57 డాలర్లకు చేరే అవకాశం ఉంది.
 
సంస్కరణల ప్రక్రియ ఒక రోజులో జరిగే వ్యవహారం కాదు: కేంద్రం
భారత్ వృద్ధి రేటును మూడీస్ తగ్గించడంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా స్పందించారు. సంస్కరణల ప్రక్రియ ఒక్కరోజులో జరిగిపోయే వ్యవహారం ఏదీ కాదని ముంబైలో వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియను జాగరూకతతో ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇందుకు కేంద్రం కట్టుబడి ఉందని కూడా స్పష్టం చేశారు. ఈ దిశలో కేంద్రం ముందడుగు ఉపాధి సృష్టికి తద్వారా దేశాభివృద్ధికి దారితీస్తుందని అన్నారు. రేటింగ్ ఏజెన్సీలు దీనిని గుర్తించాలని సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement