
విలీనాలు ఓకే.. మరి సిబ్బందో?
టెలికం కంపెనీలు ఒకదానితో ఒకటి చేతులు కలుపుతున్నాయి. దీనికి తీవ్రమైన పోటీ, రేట్ల కోత వంటి పలు అంశాలు కారణంగా వెల్లడవుతున్నాయి.
⇔ ప్రమాదంలో టెలికం ఉద్యోగాలు
⇔ 10,000 మంది ఉపాధి గల్లంతు!
⇔ పరిశ్రమ నిపుణుల అంచనా
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు ఒకదానితో ఒకటి చేతులు కలుపుతున్నాయి. దీనికి తీవ్రమైన పోటీ, రేట్ల కోత వంటి పలు అంశాలు కారణంగా వెల్లడవుతున్నాయి. కాకపోతే కంపెనీల విలీనాల వల్లన ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమౌతున్నారు. ఎక్కడ ఉపాధి గల్లంతవుతుందోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. టెలికం పరిశ్రమలో వచ్చే ఏడాది కాలంలో దాదాపు 10,000 మంది ఉద్యోగులు ఇంటిదారిపట్టే అవకాశముందని పరిశ్రమ నుంచి సంకేతాలు వస్తున్నాయి.
ఎక్కువున్న చోటే తొలి కోత
ఐడియా, వొడాఫోన్ వంటి పెద్ద పెద్ద కంపెనీల విలీనాలతో డూప్లికేషన్ వల్ల చాలా ఉద్యోగాలు ఎగిరిపోవొచ్చని తెలుస్తోంది. ‘కొన్ని విభాగాల్లో అవసరానికి మించి ఉద్యోగులుంటారు. సేల్స్‌మెన్, టెలికాలర్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వీరిలో చాలా మంది ఉపాధి కోల్పోయి బయటకు వెళ్లొచ్చు’ అని అస్సాన్ జాబ్స్ సహవ్యవస్థాపకుడు, సీఈవో దినేశ్ గోయెల్ తెలిపారు. టెలికం కంపెనీల్లో సాధారణంగానే సేల్స్, బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాల కోసం ప్రారంభ స్థాయిల్లో సిబ్బంది ఎక్కువగా ఉంటారని పేర్కొన్నారు. అలాగే ఫైనాన్స్, లీగల్ విభాగాల్లో ఉద్యోగులపై కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చని అంచనా వేశారు.
7,000+3,000=10,000!
ఐడియా–వొడాఫోన్ విలీనం వల్ల 7,000 ఉద్యోగాలు, రిలయన్స్ కమ్యూనికేషన్స్–ఎయిర్‌సెల్ విలీనం వల్ల 3,000 ఉద్యోగాలు ప్రమాదంలో పడొచ్చని హెచ్‌బీఎల్ నివేదిక పేర్కొంటోంది. వొడాఫోన్, ఐడియా విలీనం వల్ల టెలికం పరిశ్రమలో కొత్త అధ్యాయం ప్రారంభముతుందని విళ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆయా కంపెనీల్లోని ఉద్యోగుల అవసరాలు, ప్రాధాన్యాలు కూడా మారతాయని అంచనా వేశారు. ఐడియా–వొడాఫోన్ కంపెనీలు 2.1 బిలియన్ డాలర్ల మేర వ్యయాలను తగ్గించుకోవాలని చూస్తున్నాయని, దీంతో అవి ఉద్యోగులను ఇంటికి పంపే అవకాశముందని తెలిపారు.
వ్యయాల నియంత్రణే లక్ష్యం
పరిశ్రమలో 20 శాతం ఉద్యోగాల కోత ఉంటుందని గోయెల్ అంచనా వేశారు. దీంతో విలీనాంతరం ఆవిర్భవించే కంపెనీకి వ్యయాల ఒత్తిడి తగ్గుతుందని, రాబడి మెరుగుపడుతుందని చెప్పారు. కంపెనీలు అందుబాటులో ఉన్న సిబ్బందిని ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చనే అంశంపై దృష్టి కేంద్రీకరిస్తాయని తెలిపారు. ‘‘ఒక కంపెనీతో పోలిస్తే విలీనం తర్వాత ఏర్పడ్డ కంపెనీ వ్యాపారాభివృద్ధి కార్యకలాపాలు తగ్గుతాయి. దీనిక్కారణం విలీనాంతర కంపెనీ విస్తృతి పెరగడమే.
విలీనం తర్వాత 6–12 నెలల కాలంలో ఉద్యోగాల కోత ప్రారంభం కావొచ్చు’’ అని ఆయన అంచనా వేశారు. డిమాండ్ వల్ల అనుభవం ఉన్న ఉద్యోగులు, కంపెనీల విస్తరణ ప్రణాళికల వల్ల టైర్–2 పట్టణాల్లోని సిబ్బంది ఉద్యోగాల కోత గురించి అంతగా చింతించాల్సిన అవసరం లేదన్నారు. టెలికం పరిశ్రమ ఔట్‌లుక్ ఆశాజనకంగా ఉందని, అందుకే ఉద్యోగాలు కోల్పోయిన వారు వేరొక చోటు ఉపాధి పొందొచ్చని చెప్పారు.